Suryaa.co.in

Editorial

గులాబీలో గుబులెందుకు?

– ఓడిస్తే రెస్టు తీసుకుంటామన్న కేసీఆర్‌
– బీసీలలో కులం కంటే గుణం గొప్పదన్న కేటీఆర్‌
– భగ్గుమంటున్న బడుగులు
– నన్ను చూసి ఓటేయమంటున్న కేసీఆర్‌
– మరి ఎమ్మెల్యేలకు విలువలేదా?
– ఎమ్మెల్యేలు పనులేమీ చేయలేదా?
– కేసీఆర్‌ వ్యాఖ్యల సంకేతాలేమిటి?
– బీజేపీ ‘బీసీ సీఎం స్లోగన్‌’పై కనిపించని ఎదురుదాడి
– దళిత సీఎం సవాలుపై స్పందించని గులాబీదళాలు
– అగ్రనేతల వ్యాఖ్యల సంకేతాలేమిటి?
– వాస్తవ పరిస్థితి అర్ధమవుతోందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రతిష్టాత్మకంగా మారిన తెలంగాణ ఎన్నికలలో గెలిచే తొందరలో.. గులాబీదళపతులు చేస్తున్న వ్యాఖ్యల సంకేతాలు, క్షేత్రస్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. స్వయంగా సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌-మంత్రి కేటీఆర్‌ చేసిన రెండు కీలక వ్యాఖ్యలపై, ప్రతికూల చర్చకు తెరలేచింది.

సహజంగా ఎన్నికల సమయంలో గులాబీ దళపతి కేసీఆర్‌, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తన మాటలతో ప్రత్యర్ధులను బేజారెత్తిస్తారు. తన వ్యూహాలతో శత్రు శిబిరాల్లో గందరగోళం రేపుతారు. అలాంటి కేసీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్య, సొంత పార్టీ క్యాడర్‌ సహా, రాజకీయవర్గాలను ఆందోళన-ఆలోచనలో పడేసింది.

‘‘ గెలిపిస్తే సేవ చేస్తాం. లేకపోతే ఇంట్లో రెస్టు తీసుకుంటాం’’అంటూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా బహిరంగసభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో గందరగోళంలో పడేశాయి. మొన్నటివరకూ మనకు 90 సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌కు అభ్యర్దులే లేరు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం అని బల్లగుద్ది చెప్పిన కేసీఆర్‌.. ఎన్నికల సభలో మాత్రం, గెలిపించకపోతే ఇంట్లో రెస్టు తీసుకుంటామన్న వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ను డీలా పడేశాయి. దీనిపై ఇప్పటికే సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్ర్తాలు, విస్తృత చర్చ జరుగుతోంది.

ఎన్నికల వేళ శ్రేణుల్లో మనోస్థైర్యం పెంచాల్సిన అధినేత నోటి నుంచి, ఇలాంటి నిరుత్సాహపూరిత ప్రకటనలు రావడాన్ని, పార్టీ క్యాడర్‌ జీర్ణించుకోలేకపోతోంది. కేసీఆర్‌ వ్యాఖ్యలతో.. పార్టీ గెలవడం కష్టమన్న సంకేతాలు వెళ్లడమే దానికి కారణంగా కనిపిస్తోంది. గెలవకపోతే విశ్రాంతి తీసుకుంటామన్న మాట, కేసీఆర్‌ వంటి పోరాటయోధుడి నోటి నుంచి రావడం ఇదే తొలిసారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

కాగా కేసీఆర్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌-బీజేపీ సోషల్‌మీడియా సైన్యం విస్తృతంగా వైరల్‌ చేస్తున్నాయి. ఫలిత ంగా కేసీఆరే అలాంటి కామెంట్‌ చేశారు కాబట్టి ఇక బీఆర్‌ఎస్‌ గెలవడం కష్టం. ఆయన దానిని దృష్టిలో ఉంచుకునే ఆ విశ్రాంతి వ్యాఖ్యలు చేశారన్న భావన-చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతోంది.

‘ఇప్పుడు మాత్రం కేసీఆర్‌ పనిచేస్తున్నారా? విశ్రాంతి తీసుకుంటున్నారు కదా? ఆయన ఎవరిని కలుస్తారు? ఎవరికి అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారు? రేపు ఎన్నికల తర్వాత సారు ఇక పూర్తి విశ్రాంతి తీసుకుంటారు’’ అని బీజేపీ ఎంపి ధర్మపురి అర్వింద్‌ వంటి నేతలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.

‘‘సార్‌ పదేళ్లు తెలంగాణ కోసం కష్టపడ్డారు. ఆయన కుటుంబం కూడా బాగా కష్టపడింది. ఇక అందరూ రెస్టు తీసుకుంటే మంచిది’’ అని కాంగ్రెస్‌-బీజేపీ సోషల్‌మీడియా సైనికులు వ్యంగ్యాస్ర్తాలతో కూడిన పోస్టులు సంధిస్తున్నారు.

దానికితగినట్లే బీఆర్‌ఎస్‌ సర్పంచుల నుంచి ఎమ్మెల్సీ స్థాయి నేతల వరకూ, వరస పెట్టి కాంగ్రెస్‌లో చేరుతున్న వైనం, కారులో కలవరం రేపుతోంది. ఎమ్మెల్సీ పదవులు తీసుకున్నవారు సైతం కాంగ్రెస్‌లో చేరుతుండటం, బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్‌ వైపే వలసలు పెరగడం, బీజేపీ-బీఆర్‌ఎస్‌ అగ్రనేతలంతా కాంగ్రెస్‌నే లక్ష్యంగా విమర్శలు సంధించడం చూస్తే.. కాంగ్రెస్‌ బలం పెరుగుతోందన్న సంకేతాలు సహజంగానే జనక్షేత్రంలోకి వెళుతున్నాయి.

బహుశా కేసీఆర్‌ ఆందోళనతో కూడిన వ్యాఖ్యల వెనుక, అసలు కారణం అది కూడా అయి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ‘గెలిపించకపోతే ఇంట్లో రెస్టు తీసుకుంటా’నన్న కేసీఆర్‌ వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్‌ క్యాడర్‌పై పెను ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది.

ఇక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ బీసీలపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌-బీజేపీ అస్త్రంగా సంధించడం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌కు దమ్ముంటే దళితుడిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని బీజేపీ విసిరిన సవాల్‌కు.. ఇప్పటిదాకా కేసీఆర్‌ గానీ, కేటీఆర్‌ గానీ నేరుగా జవాబిచ్చిన దాఖలాలు లేవు. పైగా తాము బీసీ అభ్యర్ధిని సీఎంగా చేస్తామన్న ప్రకటన, బీఆర్‌ఎస్‌ను సంకటంలో నెట్టేసింది. మేం బీరీ అభ్యర్ధిని సీఎంగా ప్రకటిస్తున్నాం. మరి మీరు గతంలో చెప్పినట్లు దళితులను సీఎంను చేస్తారా?అని అమిత్‌షా సంధించిన ప్రశ్నాస్త్రం బీఆర్‌ఎస్‌ పక్కలో బాంబులా పేలింది.

దీనిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదమై కూర్చున్నాయి. ‘‘కులం కాదు. గుణం ముఖ్యమ’’న్న కేటీఆర్‌ వ్యాఖ్యలు, ఇప్పుడు కాంగ్రెస్‌-బీజేపీ బ్రహ్మాస్ర్తాలుగా మారాయి. ఆ రెండు పార్టీలకు చెందిన సోషల్‌మీడియా సైన్యం కూడా, కేటీఆర్‌ వ్యాఖ్యలను అందిపుచ్చుకుని విమర్శనాస్ర్తాలు సంధించడం ఆసక్తికరంగా మారింది.

‘‘అంటే బీసీలకు గుణం లేదా? మీ పార్టీలో ఎంతమంది గుణవంతులున్నారు. ే టీఆర్‌ బీసీలకు గుణం లేదని అవమానించారు. వెంటనే కేటీఆర్‌ బీసీలకు క్షమాపణ చెప్పాల’’ని బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ డిమాండ్‌ చేయడంతో, బీఆర్‌ఎస్‌ వర్గాలు నెత్తిపట్టుకోవలసి వచ్చింది.

అటు కాంగ్రెస్‌ బీసీ నేతలు కూడా, బీసీలను అవమానించిన బీఆర్‌ఎస్‌లో ఇంకా బీసీలు ఎందుకు కొనసాగుతున్నారు? కేటీఆర్‌ వ్యాఖ్యలను బీసీ నేతలు ఎందుకు ఖండించడం లేదంటూ సంధిస్తున్న ప్రశ్నలు, అటు బీఆర్‌ఎస్‌లోని బీసీ నేతలకు సంకటంలా మారాయి. కీలకమైన ఎన్నికల వేళ విజయాన్ని శాసించే బీసీలనుద్దేశించి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలప్రభావం బీసీ వర్గాలపై పడితే, కొంపకొల్లేరడం ఖాయమన్న ఆందోళన అధికార పార్టీలో తొంగిచూస్తోంది.

కాగా తనను చూసి ఓటేయాలంటూ.. ఇటీవల బహిరంగ సభల్లో కేసీఆర్‌ ఇస్తున్న పిలుపు మేధావి, యువ-విద్యావంతుల్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని నియోజకవర్గాల్లో తానే ఉన్నానని, తనను చూసి ఓట్లేయాలని కేసీఆర్‌ ఇస్తున్న పిలుపు పుణ్యాన.. బీఆర్‌ ఎస్‌ అభ్యర్ధులకు విలువ లేకుండా పోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానితో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతున్నాయి.

నిజానికి కేసీఆర్‌ కంటే సీనియర్లు, సుదీర్ఘకాలం మంత్రి- ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో ఎన్టీఆర్‌, చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేసిన సీనియర్లు కూడా ఉన్నారు. అలాంటి సీనియర్లకు సైతం వారి సొంత నియోజకవర్గాల్లో ఫేస్‌ వాల్యూ లేదా? కేసీఆర్‌ను చూసి ఓటేస్తే.. మరి ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు జనాలకు ఏం పని చేయలేదా? వారికి ఉన్న విలువ ఇంతేనా? కేసీఆర్‌ను చూసి ఓటేసేట్టయితే వీళ్లే ఎందుకు? ఎవరినైనా నిలబెట్టవచ్చు కదా? అసలు కేటీఆర్‌ ఇటీవల ఈటలపై చేసిన వ్యాఖ్యల ప్రకారం, కేసీఆర్‌ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చు కదా? అన్న ప్రశ్నలతో కూడిన చర్చ, సోషల్‌మీడియాలో ఆసక్తికరంగా సాగుతోంది. ప్రధానంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు విద్యావంతులు- ఉద్యోగులు- యువతపై ఎక్కువప్రభావం చూపిస్తున్నాయి.

LEAVE A RESPONSE