Home » వైసీపీ రెక్కలు విరిచేస్తున్న గూండాగిరి

వైసీపీ రెక్కలు విరిచేస్తున్న గూండాగిరి

-వైసీపీ రౌడీయిజంపై ఓటర్ల తిరుగుబాటు
– ఓటరుపై దాడి చేసిన వైసీపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
– అది చాలక ఆ ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల మూకుమ్మడి దాడి
– గాయాలపాలైన ఓటరును పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లడంపై ఓటర్ల ఆగ్రహం
– వైసీపీ ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేయాలని ఈసీ ఆదేశం
– సోషల్‌మీడియాలో వైసీపీ ఎమ్మెల్యే దాడి దృశ్యాలు వైరల్
– మహిళాఓటర్లపై గుంటూరు ఎంపీ అభ్యర్ధి రోశయ్య దుర్భాష
– రోశయ్యపై మహిళల తిరుగుబాటు
– పల్నాడులో మహిళలపై వైసీపీ నేతల గూండాగిరి
– మాచర్లలో ఈవీఎం ధ్వంసం, తాడిప్రతిలో రాళ్లదాడి
– రాష్ట్రంలో అంతటా ఇవే దౌర్జన్యకర దృశ్యాలు
– వైసీపీ గూండారాజ్‌పై ఓటర్ల ఆగ్రహం
– పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు
– వైసీపీపై ఆగ్రహాన్ని ఓట్లరూపంలో చూపిస్తున్న వైనం
– తలపట్టుకుంటున్న వైసీపీ నాయకత్వం
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందన్న సామెత పోలింగ్ సమయంలో వైసీపీ విషయంలో అక్షరాలా రుజువువుతోంది. ఇప్పటికే తల్లి, చెల్లి దూరమైన జగన్ పార్టీకి డీజీపీ సహా ఐపిఎస్-ఐఏఎస్‌ల బదిలీ శిరోభారంగా మారింది. తాజాగా తెనాలిలోని ఒక పోలంగ్ బూత్‌లో.. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే చెంపమీద కొట్టడం, ఓటర్లలో వైసీపీని ముద్దాయిగా నిలబెట్టినట్టయింది.
పోలింగ్ సమయంలో సంయమనంతో ఉండి, ఓటర్లను అభ్యర్ధించడం బదులు.. స్వయంగా ఓటర్లపైనే దాడులకు తెగబడుతున్న వైసీపీ నేతల అరాచకంపై, ఓటర్లు తిరగబడుతున్నారు. మహిళలని కూడా చూడకుండా వారి తలలు పగలకొడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చూస్తున్న ఆంధ్రా ఓటర్లు, పోలింగ్ బూత్‌లలో వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరువేస్తున్న వైనం, వైసీపీ నాయకత్వాన్ని బెంబేలెత్తిస్తోంది.

క్యూలో రాని తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ఒక సాధారణ ఓటరు ప్రశ్నించారు. దానితో ఆగ్రహించిన ఎమ్మెల్యే శివకుమార్ సదరు ఓటరు చెంపపై కొట్టారు. దానితో ఒళ్లు మండిన ఆ ఓటరు కూడా ఎమ్మెల్యే చెంపదెబ్బ ఒకటిచ్చారు. అదిచూసిన ఆయన అనుచరులు కూడా ఓటరుపై దాడికి తెగబడి, గాయపరిచారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం విశేషం. తీవ్రంగా గాయపడిన ఓటరును ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా, పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనను సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న ఈసీ.. ఎమ్మెల్యే శివకుమార్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ ముగిసే వరకూ ఆయనను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. అసలు ఎమ్మెల్యే అనుచరులను పోలీసు అధికారి, పోలింగ్‌బూత్‌లోకి ఆయనతోపాటు ఎలా అనుమతించారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

ఇక గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య.. ఎస్సీ ఓటర్లపై దురుసుగా ప్రవర్తించడంతో, అక్కడి మహిళలు తిరుగుబాటు చేసిన పరిస్థితి. తక్కెళ్లపాడుకు వచ్చిన రోశ య్యను ఎస్సీ మహిళలు పలు ప్రశ్నలు వేశారు. దానితో ఆగ్రహించిన రోశయ్య వారిపై దాడి చేయాలని తన అనుచరులను ఆదేశించడం, దానితో మహిళలు తిరగబడటం ఉద్రిక్తతకు దారితీసింది.

వైసీపీకి ఒక్కచాన్స్ ఇస్తేనే తమపై దాడి చేస్తుంటే, మళ్లీ రెండోసారి అధికారం ఇస్తే ప్రాణాలు తీస్తారని ఓటర్లు మండిపడుతున్నారు. సాధారణ ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని దాడితో, రాష్ట్రంలోని ఓటర్లు వైసీపీ రౌడీయిజంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మహిళలు ఈ ఘటనపై మండిపడుతున్నారు. కాగా పోలింగ్ రోజున జరిగిన ఈ ఘటన, తమ పార్టీ కొంపముంచేదేనని వైసీపీ వర్గాలు బేజారెత్తుతున్నారు. ప్రశాంతతను కోరుకునే ఓటర్లను భయపెట్టాలనుకోవడమే తమ ఎమ్మెల్యే చేసిన తప్పు అని, అది ఇప్పుడు తమ కొంపముంచిందని వైసీపీ నేతలు తల
పట్టుకుంటున్నారు.

‘ పోలింగ్ సమయంలో ఏ మాత్రం వ్యతిరేక సంకేతాలు వెళ్లినా, అది పార్టీ మొత్తానికి నష్టం కలిగిస్తుంది. ఓటర్లను బుజ్జగించాల్సిన మా ఎమ్మెల్యే శివకుమార్ ఏకంగా ఓటరుపైనే దాడి చేస్తే, క్యూలైన్లలో ఉన్న ఓటర్లు మా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న జ్ఞానం కూడా, మా ఎమ్మెల్యేకు లేకపోవడంతో దాని మూల్యం ఇప్పుడు మొత్తం పార్టీ చెల్లించుకోవాల్సి వస్తోంద’ని ఒక వైసీపీ ఎమ్మెల్యే వాపోయారు. ఈవిధంగా పోలింగ్ సమయంలో ఒక్క తెనాలిలోనే కాకుండా, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వైసీపీ ఓటర్లపై గూండాయిజం చేస్తున్న వీడియోలు, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పోలింగ్ బూత్‌ల వద్ద సృష్టించిన దౌర్జన్యకాండతో, పల్నాడు నర్సరావుపేట జిల్లాలో ఓటర్లు వైసీపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రోడ్లపై కనిపించే వాహనాలన్నీ ధ్వంసం చేస్తున్న దృశ్యాలు, సోషల్‌మీడియాలో రావడంతో ఓటర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసి, పలు చోట్ల ఓట్లు వేయకుండా భయానక వాతావరణం సృష్టించిన వైసీపీ ఆగడాలపై, ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాచర్ల నియోజకవర్గం సమస్యాత్మకమైనదని తెలిసినప్పటికీ, అక్కడ ఆమేరకు అదనపు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఓటర్లు మండిపడుతున్నారు. దీనిపై మాజీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, ఈసీకి ఫిర్యాదు చేశారు. 126కి పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలివేయడంపై, ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై, వైసీపీ గూండాలు దాడి చేశారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్ధి మోహిత్‌రెడ్డి, ఒక విలేకరి దగ్గర ఫోను గుంజుకుని నేలకేసి కొట్టారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో, వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలపై మూకదాడులు చేయడంతో ఓటర్లు పరుగులు తీశారు. నరసరావుపేట ఉప్పలపాడులో ైవె సీపీ శ్రేణులు టీడీపీ నేతపై దాడిచేశారు.

కాగా రాష్ట్రంలో పోలింగ్ రోజున వైసీపీ చేస్తున్న మూకదాడులు, పోలింగ్ కేంద్రాల వద్ద చేస్తున్న గూండాగిరిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించని ఫలితమే ఈ దాడులని అభివర్ణించారు. అనేక చోట్ల టీడీపీ ఏజెంట్లను, వైసీపీ నేతలు బయటకు పంపిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా.. తమ పార్టీ నేతల దౌర్జన్యాలు, ఓటర్లపై దాడుల ఘటనలన్నీ సోషల్‌మీడియా ద్వారా ఓటర్లకు చేరడం, వైసీపీ నాయకత్వాన్ని కలవరపరుస్తోంది. పోలింగ్ బూత్‌లకు వెళుతున్న ఓటర్లు, క్యూలైన్లలో ఉండే ఓటర్లకు.. ఇవన్నీ తమ పార్టీపై వ్యతిరేకతను పెంచేవేనని వైసీపీ అగ్రనేతలు అంగీకరిస్తున్నారు.

‘ప్రత్యర్ధి పార్టీలపై దాడులు చేయడం వేరు. సాధారణ ఓటర్లపై దాడులు చేయడం వేరు.ఇతర పార్టీలపై దాడులు చేస్తే పట్టించుకోరు. కానీ ఓటర్లు నేరుగా తమపైనే దాడులు చేస్తే వారు ఏ పార్టీనీ సహించరు. అంటే మా పార్టీ ఎమ్మెల్యే అన్నాబత్తుని ఈరోజు లక్షమలమంది ఓటర్లతో, పరోక్షంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసేలా చేశార’ని ఓ వైసీపీ అగ్రనేత వాపోయారు.

Leave a Reply