ఇదేం అ‘రాజకీయం’?

( మార్తి సుబ్రహ్మణ్యం)
మన శాసనసభ సమావేశాల సందర్భంలో నిమిషానికి అయ్యే ఖర్చు 8,900 రూపాయలు. గంటకు 5 లక్షల 34 వేలు. అదే ఒకరోజుకయితే కోటీ 28 లక్షల రూపాయలు. ఇదీ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బును.. పన్నుల రూపంలో వసూలు చేసే ప్రభుత్వాలు, అసెంబ్లీ నిర్వహణకు చేస్తున్న ఖర్చు. మరలాంటప్పుడు జనం సొమ్మును, పాలకులు ఎంత జాగ్రత్తగా వినియోగించాలి? ప్రజల సమస్యలు చర్చించి, వాటి పరిష్కారాల కోసమే కదా చట్టాలు చేయాల్సింది?
మరి ఇప్పుడు పాలక పార్టీలు ఆ పనిచేస్తున్నాయా? లేక రాజకీయ ప్రత్యర్ధులను బూతులు తిడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ప్రజాధనాన్ని హారతికర్పూరంలా కరిగిస్తున్నాయా? అసలు జనం ఓట్లతో సభకు వెళ్లిన వారు హుందాతనంగా వ్యవహరిస్తున్నారా? కుళాయిదగ్గర అమ్మలక్కలూ ఈర్ష్యపడే స్థాయికి సభ్యుల ప్రవర్తన దిగజారిందా? అసలు ఇప్పుడు మనం చూస్తున్నది రాజకీయమా? అరాజకీయమా? ఎదుటివారి వ్యక్తిత్వహననానికి అన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసుకోవడం దేనికి.. ఆ పనేదో పార్టీ ఆఫీసుల్లోనే కూర్చుని కానివ్వచ్చుకదా? అంతోటిదానికి అమరావతి దాకా రావడం ఎందుకు?.. ఇవీ.. శుక్రవారం ఏపీ శాసనసభ కార్యక్రమాల తీరు చూసిన వారి మస్తిష్కం నుంచి జాలువారిన సందేహాలు.
పాలిటిక్స్‌లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు.. తనకు జరిగిన అవమానానికి కుంగిపోయి, ఇక తాను సభకు మళ్లీ సీఎం అయ్యేవరకూ రాబోనని శపథం చేశారు. అంతకుముందు సభలో మంత్రులు, అధికార పార్టీ సభ్యులు వెనుకబెంచీల నుంచి చేసిన వ్యాఖ్యలూ అంతా చూసినవే. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన చంద్రబాబు, తన అనుభవం-పోరాటాల గురించి ప్రస్తావిస్తూ… తాజాగా తన


కుటుంబసభ్యుల పట్ల, అధికార పార్టీ పాల్పడుతున్న వ్యక్తిత్వ హననంపై మాట్లాడిన సందర్భంలో ఉద్వేగానికి లోనయి, భోరున విలపించారు. ఆ సమయంలో ఆయన కన్నీటిని ఆపుకునేందుకు ప్రయత్నించినా, గసలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే, చంద్రబాబుదంతా నటన అని, అదంతా స్క్రిప్టు ప్రకారమే జరిగిందన్నది కొడాలి నాని వంటి వైకాపేయుల వెక్కిరింపు. తనలాంటి మహిళను వేధించినందుకు, తగిన శాస్తి జరిగిందన్నది రోజా శాపనార్ధాలు. బాబు రాజకీయ వ్యభిచారి అని, తన రాజకీయ అవసరాల కోసం కుటుంబసభ్యులను కూడా, బట్టలు విప్పి రోడ్డున నిలబెడతారన్నది కొడాలి నిండుసభలో వేసిన నింద. దానికి సభానాయకుడి స్థానంలో ఉన్న జగనన్న చిరునవ్వులు. ఇవీ స్థూలంగా సభలో వినిపించి-కనిపించిన దృశ్యాలు.గత రెండున్నరేళ్లు, అంతకు ఐదేళ్లకు ముందు సభలో బూతులు వినిపించకపోతేనే

ఆశ్చర్యంగా అనిపించేది. రాష్ట్రం విడిపోయిన తర్వాతనే ఈ వైపరీత్యం. కానీ ఇటీవలి కాలంలో సీనియర్ల పట్ల కించిత్తు గౌరవం కూడా కనిపించకపోగా, బజారుభాష వినిపిస్తున్న దురదృష్టకర పరిస్థితి.
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో కూడా వైసీపీ సభ్యులపై బూతులు వినిపించాయి. అది మీడియా సెంటర్ వరకూ విస్తరించి, బ్లూఫిలిం ఆరోపణలకూ వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. అటు వైసీపీ సభ్యులు కూడా, బూతులను శ్రవణానందకరంగా వినిపించిన వారే. ఆ విషయంలో ఒకరు తక్కువ మరొకరు ఎక్కువన్నది లేదు. దొందూ దొందే. వైసీపీ-టీడీపీ రాజకీయ ప్రత్యర్ధులకు బదులు, ఆజన్మశత్రువుల్లా భావిస్తుండటంతోనే ఈ సమస్య.
గతంలో బాబును సీఎంగా చూసేందుకు జగన్ ఇష్టపడకపోగా, ప్రతిపక్ష నేత సీట్లో కూర్చున్న జగన్ తనను ప్రశ్నించడాన్ని బాబు ఇష్టపడలేదు. ఇప్పుడు జైల్లో ఉండివచ్చిన జగన్ సభానేత స్థానంలో కూర్చుని, వ్యవస్థలను శాసించడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. 151 సీట్లు వచ్చిన తనను, కేవలం 23 సీట్లు వచ్చిన చంద్రబాబు ప్రశ్నించడాన్ని అటు జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరికీ అసలు సమస్య అదీ. కానీ ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత ఇష్టాలకు తావుండదు కాబట్టి, ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. మరి చట్టసభల్లో ఈ రచ్చ ఎందుకు? అక్కడికే వద్దాం.
ఏ అంశమైనా చర్చించేందుకు రాష్ట్ర స్థాయిలో, రాజ్యాంగబద్ధంగా ఉన్న వేదిక శాసనసభ ఒక్కటే. అక్కడ ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాలు ఎండగట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. వాటిని తిప్పికొట్టి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు అధికారపక్షం ప్రయత్నిస్తుంటుంది. ఆ సందర్భంలో తూలే-పేలే మాటలే ఒక్కోసారి వివాదానికి దారితీస్తుంటాయి. గతంలో కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు నిండుసభలో జయలలితకు అవమానం జరిగితే.. అవమానభారంతో రగిలిపోయిన ఆమె, తాను మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెడతానని శపథం చేసి, తర్వాత అన్నంతపని చేశారు. ఇక కరుణానిధి కూడా జయలలిత ప్రతీకారానికి గురయిన నాయకుడే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవమానానికి గురయిన ఎన్టీఆర్, సభ నుంచి నిష్క్రమిస్తూ మళ్లీ సీఎంగానే సభలోకి వస్తానని శపథం చేసి, మాట నెగ్గించుకున్నారు. సభలో పార్టీ వ్యవహారాలను చంద్రబాబునాయుడు, అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు, కోడెల, వేణుగోపాలచారి, మాధవరెడ్డి వంటి నేతలకు అప్పగించారు. ఇప్పటి స్పీకర్ తమ్మినేని కూడా అప్పటి బృందంలో నాయకుడే. రాష్ట్రం విడిపోయిన తర్వాత విపక్ష నేతగా ఉన్న జగన్, సభలో తనకు అవమానం జరుగుతోందని భావించి, సభను బహిష్కరించి జనంలోకి వెళ్లారు. మళ్లీ ఆయన సీఎంగానే సభలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వంతు.
అయితే చంద్రబాబు నిష్క్రమణ, వీరందరికంటే భిన్నంగా కనిపించింది. తన నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు వివరిస్తూ, విలపించిన చంద్రబాబును జనమే కాదు…ఆయనతో సుదీర్ఘానుబంధం ఉన్న నేతలకూ అది కొత్తగా, నమ్మలేని నిజంగా అనిపించింది. ఎందుకంటే చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న ఏ నాయకుడయినా.. ఆయన ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేని పిరికివాడని, శత్రువులపై పగ తీర్చుకోవడం చేతకాదని చెబుతారు. రాయలసీమలో పుట్టినా, అక్కడి నేతల మాదిరిగా ఫ్యాక్షను మనస్తత్వం అబ్బలేదని మాత్రమే అంటుంటారు. పట్టువిడుపులతో పాటు, ఎక్కడ తగ్గాలో తెలిసిన ఫక్తు రాజకీయనాయకుడని విశ్లేషిస్తుంటారు.
అంతే తప్ప, సమస్యలు- సంక్షోభానికి భయపడి పారిపోయే పిరికివాడని మాత్రం ఎవరూ చెప్పరు. పోరాటం తెలియని నేత అని ఎవరూ అనలేరు. అంతేకాదు, ప్రతి సంక్షోభంలోనూ రాటుతేలతారని కూడా చెబుతారు. అలాంటి చంద్రబాబు భోరున విలపించడం అందరికీ కొత్తకోణమే. విపత్కర పరిస్థితుల్లోనూ.. ఆత్మస్థైర్యం చెరిగిపోకుండా నిటారున నిలిచే బాబు, ఇలా బేలగా మారడం టీవీలు చూసే వారిని కలచివేయడం సహజం. శుక్రవారం అదే జరిగింది. సరే.. దానిపై ఆ పార్టీ అభిమానుల ఆగ్రహావేశాలు, సానుభూతి, నిరసన

ప్రదర్శనలూ పక్కకుపెడితే, ప్రసార-ప్రచార మాధ్యమాలు చూసిన సగటు మనిషి మాత్రం, ప్రాంతాలకు అతీతంగా బాబుపై బోలెడు సానుభూతి ప్రదర్శించాడు.
రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను తెరమీదకు తీసుకువచ్చారన్న బాబు ఆవేదన, మహిళలనూ గాయపరిచింది. రాజకీయాలతో సంబంధం లేని గృహిణులయితే, బాబుకు బాసటగానే నిలిచినట్లు వారి మాటలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలూ లేనందున.. ఇవన్నీ టీడీపీకి రాజకీయంగా లాభించేవి కాకపోయినా, నైతికంగా బాబు పట్ల అభిమానం-అధికార పార్టీ పట్ల అసహనం పెంచేవేనన్నది నిష్ఠుర నిజం.
ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే.. రాజకీయంగా చంద్రబాబు వల్ల నష్టపోయి, ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్న నేతలు కూడా, బాబు పరిస్థితికి చలించిపోవడం విశేషం. కొమ్మినేని వికాస్ అని, బాబుకు యూత్‌కాంగ్రెస్ నుంచి మిత్రుడు. ఆయన సోదరుడు కొమ్మినేని శేషరిగిరావు రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు చిత్తూరు జిలా, వైఎస్ కడప జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు. బాబు పెళ్లికి కలసి కార్డులు కూడా పంచినంత మిత్రత్వం. కానీ తనకు ఆయన ఏమీ సాయం చేయలేదని చెప్పే వికాస్ కూడా, బాబుకు జరిగిన అవమానంపై మనస్తాపం చెందారు.
‘నాకు ఆయన ఏమీ చేయలేదు. నేను మిత్రుడనుకోవడం తప్ప, ఆయన నన్ను మిత్రుడిగా కూడా ఎప్పుడూ చూడలేదు. ఒకప్పుడు నేనూ పార్టీలో అవమానాలకు గురయ్యా. కానీ అంతపెద్ద మనిషిని అవమానించడం మంచిదికాదు. రాజకీయ నేతలు హీరోలుగా ఉండాలే తప్ప విలన్లుగా ఉండకూడదు. ఇప్పుడు జగన్ విలన్‌గా కనిపిస్తున్నారు. ఈరోజు జరిగిన సంఘటన చాలామందిని బాధించింది. రాజకీయాలతో సంబంధం లేని ఆయన భార్యను, మధ్యలో తీసుకురావడం మర్యాదస్తులు చేసే పనికాదు. అది మగతనం అనుకోను. అసలు చంద్రబాబు సభకు వెళ్లకుండా మిగిలిన వారికి అప్పగించి ఉండాల్సింది. ఇది నేను బాబు మిత్రుడిగా చెప్పడం లేదు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా చెబుతున్నా’నని కొమ్మినేని వికాస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇక తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరిన పాత టీడీపీ నేతలు సైతం బాబుకు సానుభూతి చూపించడం విశేషం.
అటు ఏపీలో కూడా తటస్తులు, మేధావులు, విద్యావంతులు కూడా వైసీపీ వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. సవాళ్లు-ప్రతి సవాళ్లు, రాజకీయాలతో సంబంధంలేని ఆయన కుటుంబసభ్యుల ప్రస్తావన తీసుకురావడాన్ని ఎవరూ ఆహ్వానించలేకపోతున్నారు. చివరకు .. రాజకీయంగా బాబుతో విబేధించి దూరమైన బీజేపీ నేత పురందీశ్వరి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా వైసీపీ నేతల భాషను ఖండించారంటే.. బాబుకు వైసీపీ నేతలు ఏ స్థాయిలో

సానుభూతి పోగుచేసి పెట్టారో అర్ధం చేసుకోవచ్చు. సభలో బాబును దూషిస్తున్న మంత్రులు, సభ్యులను వారించే ప్రయత్నం చేయకుండా, సభా నాయకుడయిన జగన్.. చిద్విలాసం చిందించడాన్ని ఎవరూ హర్షించడం లేదన్నది మనం మనుషులం అన్నంత నిజం. సభలో సీనియర్లు పెద్దగా లేకపోవడం, ఉన్నవారు కూడా ఘర్షణ పరిస్థితులను నివారించేందుకు సాహసించ పోవడం దురదృష్టకరం.
వైఎస్ ఉన్నప్పుడు సభలో పరిస్థితిలు ఎంత వాడివేడిగా ఉన్నా, అటు ఇటు ఉన్న సీనియర్ల చొరవ- రాయబారాలతో అది వెంటనే సమసిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితీ లేదు. జగన్‌కు భయపడకుండా చొరవ తీసుకునే అధికార పార్టీ సభ్యులే లేరు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉన్నందున, ఆ కోణంలో ప్రతిపక్ష నేతను పోటీలు పడి విమర్శించడం సహజం. సభలో అదే కనిపించింది.
టీడీపీ హయాంలో తమను ఇంతకంటే ఎక్కువ వేధించారన్న వైసీపేయుల వాదనను కాదనలేం. అందుకే కదా అది నచ్చని ప్రజలు, ఆ పార్టీని 23 స్థానాలకు పరిమితం చేసింది? మరిప్పడు వైసీపేయులూ అదే చేస్తే ఇక ఇద్దరికీ తేడా ఏముంటుంది? మరి మధ్యలో నైతిక విలువల ఉపన్యాసాలెందుకు? అప్పుడు దొందూ దొందే కదా? అంటే తమను కూడా ప్రజలు, టీడీపీ మాదిరిగానే శిక్షించాలని కోరుకుంటున్నారా?!
ఇక చంద్రబాబు సానుభూతి కోసమే కన్నీటి డ్రామాలాడుతున్నారన్నది వైసీపేయుల వాదన. కాసేపు అదే నిజమేననుకున్నా, కనుచూపుమేరలో ఇప్పట్లో కనీసం కౌన్సిలర్ ఎన్నికలు కూడా లేవు. అన్ని ఎన్నికలూ అయిపోయాయి. ఇక కుప్పం ఓటమి నుంచి డైవర్షన్ అన్నది మరొక వాదన. కాసేపు అదీ నిజమేననుకుందాం. అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అక్కడ టీడీపీ ఓడింది. ఇక ఇప్పటి ఓటమిలో కొత్తేముంది? మరి ఆ ప్రకారంగా.. చంద్రబాబు విలాపపర్వం నటన ఎలా అవుతుందన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

Leave a Reply