-ఎన్నికల తారా తో‘రణం’
– తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ?
– విజయవాడ లోక్‌సభ నుంచి నాగార్జున?
– వద్దన్నా ఆయనకే ఇవ్వాలంటున్న వైసీపీ శ్రేణులు
– నాగ్ పోటీ అసెంబ్లీలపై ప్రభావం చూపిస్తుందంటున్న వైసీపీ నేతలు
– ఇంకా తేలని మోహన్‌బాబు పోటీ అంశం
– నగరిలో మంత్రి రోజాపై వాణీవిశ్వనాధ్?
– సికింద్రాబాద్ అసెంబ్లీ లేదా మల్కాజిరిగి ఎంపీ రేసులో విజయశాంతి?
– మల్కాజిగిరి కాకపోతే సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ?
– సికింద్రాబాద్ అసెంబ్లీ కావాలంటున్న జయసుధ
– సనత్‌నగర్ బీజేపీ రేసులో కవిత?
– చిలకలూరిపేట నుంచి పోసాని మురళీకృష్ణ?
-మంత్రి రజని-మర్రి రాజశేఖర్ వివాదంతో పోసానికి చాన్స్?
– గుంటూరు వైసీపీ బరిలో ఆలీ?
– మళ్లీ ఆందోల్ నుంచి బాబూమోహన్
– తాడేపల్లిగూడెం జనసేన నుంచి పృధ్వీరాజ్?
– ఏపీ-తెలంగాణలో ఒకచోట నుంచి సుమన్ పోటీ?
( మార్తి సుబ్రహ్మణ్యం)
రానున్న ఎన్నికల్లో తారలు తళుక్కుమనబోతున్నారు. రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల్లోని వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు, తారలు రంగం సిద్ధమవుతున్నారు. లోక్‌సభ-అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. తాజా-మాజీ తారలతో.. వచ్చే ఎన్నికలు తళుక్కుమననున్నాయి. గతంలో పోటీ చేసిన తారలతోపాటు, తాజా తారలు కూడా ఈసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈసారి సీటు మారనున్నారు. గతంలో భీమవరం, భీమిలి నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్.. ఈసారి తిరుపతి నుంచి తన అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో బలిజ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. గతంలో చిరంజీవి కూడా అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించడం తెలిసిందే. గతంలో నర్సాపురం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబు, ఈసారి పోటీ చేయకపోవచ్చంటున్నారు.
ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ హీరోయిన్ విజయశాంతి పోటీపై ఆసక్తి నెలకొంది. ఆమె మల్కాజిగిరి లోక్‌సభ లేదా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజవర్గం గానీ కావాలని అడుగుతున్నట్లు సమాచారం. మల్కాజిగిరి లోక్‌సభ పార్లమెంటు పరిథిలో సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం, మోదీ ఇమేజ్‌తో విజయం సాధించడం సులభమన్న అంచనాతో కనిపిస్తున్నారు. అయితే బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి కూడా లోక్‌సభ సీటు ఆశిస్తున్నారు. ఇంకా మరికొందరు సీనియర్లు కూడా మల్కాజిగిరి ఎంపీ సీటుపై కన్నేయడంతో, రాములమ్మ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి. ఒకవేళ మల్కాజిగిరి ఎంపీ సీటు దక్కకపోతే.. సికింద్రాబాద్ అసెంబ్లీ అయితే ఎలా ఉంటుందన్న కోణంలో, సికింద్రాబాద్ బీజేపీ నేతలతో ఆమె చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే కొందరు సికింద్రాబాద్ బీజేపీ నేతలు ఆమెతో టచ్‌లో ఉండటం గమనార్హం.
ఇక సహజనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, తర్వాత వైసీపీలో చేరారు. అంతకుముందు టీడీపీలో చేరిన జయసుధను, చివరకు సికింద్రాబాద్‌లో విజయం వరించింది. కాగా రానున్న ఎన్నికల్లో ఆమె తిరిగి సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఆ మేరకు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. సికింద్రాబాద్‌లో క్రైస్తవుల ఓట్లతోపాటు, మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున గతంలో మాదిరిగానే తన విజయం సులభమన్నది ఆమె అంచనాగా కనిపిస్తోంది.
వైసీపీ మద్దతుదారయిన హాస్యనటుడు అలీ, గుంటూరు-2 నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాపై అసంతృప్తి ఉన్న నేపథ్యంలో, అలీ అయితే బాగుంటుందని నాయకత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు ఆయన, టీడీపీ నుంచి గుంటూరు అభ్యర్ధిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అలీకి రాజ్యసభసీటు ఇస్తారని ఒకసారి, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని మరోసారి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ఇక ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’గా పేరున్న కాపు సామాజికవర్గానికి చెందిన పృధ్వీరాజ్ కూడా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన అభ్యర్ధిగా, ఆయన బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలుస్తోంది. వైసీపీకి గట్టి మద్దతుదారుగా, జగన్‌కు వీరవిధేయుడిగా ఉన్న పృధ్వీ.. తాను వైసీపీలో చేరి తప్పుచేశానని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి బాబూమోహన్ తిరిగి, తన ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆ మేరకు ఇప్పటికే అక్కడ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక సీనియర్ నటి, బీజేపీ నేత కవిత సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సనత్‌నగర్‌లో సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం తనకు లాభిస్తుందని ఆమె అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే కొందరు స్థానిక బీజేపీ నేతలు కొందరు, ఆమెతో సంప్రదించినట్లు చెబుతున్నారు. కవితకు సీటు ఇవ్వడం ద్వారా, నగరంలోకి సెటిలర్ల ఓట్లు రాబట్టుకోవచ్చని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఇప్పటిదాకా పార్టీని అధికారికంగా సీటు అడగలేదంటున్నారు.
గతంలో చిలకలూరిపేట నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన నటుడు, రచయిత పోసాని మురళీకృష్ణ.. ఈసారి అక్కడ నుంచే వైసీపీ అభ్యర్ధిగా పోటీచేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి రజనీ పనితీరుపై నాయకత్వం అసంతృప్తితో ఉండటం-అక్కడ కమ్మ వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్-ర జనీ మధ్య దూరం పెరగడంతో, మధ్యేమార్గంగా పోసానిని బరిలోకి దించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు.
ఇక నగరిలో మంత్రి, మాజీ హీరోయిన్ రోజాపై ఈసారి మరో మాజీ హీరోయిన్ వాణీవిశ్వనాధ్ టీడీపీ నుంచి పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో వాణీవిశ్వనాధ్ పేరు వినిపించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆమె పోటీ చేయలేదు. ఈసారి రోజాపై ఆమెనే పోటీకి దింపుతారంటున్నారు. నియోజకవర్గంలో తమిళ ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉండటం వాణీవిశ్వనాధ్‌కు కలసి వచ్చే అంశమంటున్నారు.
ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి, ఇప్పటిదాకా మళ్లీ ఏ పార్టీలో చేరలేదు. ఆమె బీజేపీలో చేరవచ్చన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఉన్న మరో మాజీ నటి జీవిత, ఎన్నికల్లో పోటీపై ఆసక్తిచూపించడం లేదు. కాగా మాజీ హీరో సుమన్.. రేపల్లె లేదా మచిలీపట్నం లేదా తెలంగాణలోని ఒక నియోజకవర్గం నుంచి, పోటీ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా.. అక్కినేని నాగార్జున పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన వైసీపీ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం చాలాకాలం నుంచీ సాగుతోంది. అయితే తనకు పోటీ చేసే యోచన లేదని, ఇటీవల నాగార్జున వ్యాఖ్యానించారు. కానీ వైసీపీ రాజకీయ అవసరాల దృష్ట్యా, నాగార్జునను బరిలోకి దింపడం మినహా వైసీపీ నాయకత్వానికి మరో దారి లేదంటున్నారు.
ఇప్పటివరకూ విజయవాడ ఎంపీ స్థానం గెలవకపోవడాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న జగన్.. ఈసారి ఎట్టి పరిస్థితిలో, విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకు నాగార్జున ఒకరే సరైన అభ్యర్ధి అని, వైసీపీ నాయకత్వం కూడా గ్రిహ ంచింది. నాగార్జున పోటీ చేస్తే..పార్లమెంటు నియోజకవర్గంలో పట్టున్న కమ్మ సామాజికవర్గం కూడా చీలిపోయి, నాగార్జున గెలుపు నల్లేరుపైనడక అవుతుందని స్థానిక వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. పైగా ఆయన ఎంపీగా పోటీ చేస్తే, ఆ ప్రభావం అసెంబ్లీలపైనా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకయితే నాగార్జున మాత్రం పోటీకి విముఖంగానే ఉన్నారు.
ఇక మోహన్‌బాబు పోటీ అంశం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు బంధువు కూడా అయిన మోహన్‌బాబు.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం, చిత్తూరు జిల్లా వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే ఆయన లోక్‌సభకు పోటీ చేస్తారా? అసెంబ్లీకి పోటీ చేస్తారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదంటున్నారు. అయితే ఆయన తనయుడు మనోజ్ పోటీచేస్తారన్న ప్రచారం గతంలో కొద్దికాలం జరిగిన విషయం తెలిసిందే. మొత్తానికి మంచు కుటుంబం నుంచి ఒకరు పోటీ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.