జగన్ రెడ్డికి ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాభివృద్ధికోసమా…భూదోపిడీకోసమా?

– 3న్నరేళ్లలోనే తనకుమార్తె, అల్లుడి కంపెనీకి వేలకోట్ల ప్రాజెక్ట్ లు, వందలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో విజయసాయిరెడ్డిచెప్పాలి.
• తన కూతురి, అల్లుడికంపెనీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధికలగలేదని, ఎలాంటి భూ ఆక్రమణలతో సంబంధంలేదంటున్న విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అరబిందో పరిస్థితేంటి.. ఇప్పుడు ఆకంపెనీకి కలిగిన లబ్దేంటో చెప్పాలి.
• జగన్ రెడ్డి అధికారదుర్వినియోగంతో ఏ2రెడ్డి సాగించిన భూదోపిడీ ఉత్తరాంధ్రను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్

జగన్ రెడ్డి సహాయసహాకారాలతో, విశాఖనగరం సాక్షిగా, విజయసాయిరెడ్డి సాగించిన భూదోపిడీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులలూఠీపై ఎంపీహోదాలో, తనకుతానుగా సీబీఐ విచారణ కోరే ధైర్యం ఏ2 రెడ్డికి ఉందా అని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ నిలదీశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే. “జగన్ రెడ్డిబినామీగా, ఆయన అధికారదుర్వినియోగంతో తానుసాగించిన భూదోపిడీపై రాజ్యసభసభ్యుడి హోదాలో సీబీఐ విచారణ కోరే దమ్ము, ధైర్యం విజయసాయిరెడ్డికి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. కేవలం మూడున్నరేళ్లలోనే తనకుమార్తె, అల్లుడి కంపెనీకి వేలకోట్ల విలువైన ప్రాజెక్ట్ లు, వందలకోట్ల భూములు ఎలావచ్చాయో ఏ2చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ముసుగులో విజయసాయి, ఆయన పరివారం విశాఖలో భారీ భూదోపిడీకి తెరలేపారు.

మహానగరం సాక్షిగా వైసీపీప్రభుత్వం సాగించిన భూఅక్రమాలు కోకొల్లలు. పంచగ్రామాల క్రమబద్ధీకరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్, అనకాపల్లి భూములు, స్వచ్ఛందసంస్థ ప్రేమసమాజం భూములు వేటినీ వదల్లేదు. ఆఖరికి సీబీసీఎస్ఈ చర్చిభూములు సహా, ఎక్కడ అవకాశం అంటే అక్కడ జగన్ రెడ్డి నేత్రత్వంలో సాగరనగరం సాక్షిగా మహాభూదోపిడీ సాగించారు. టీడీపీ ప్రభుత్వం విశాఖ భూములు కాపాడటానికి కృషిచేసిందని విజయసాయే చెప్పారు. వందలకోట్ల విలువైన దసపల్లా భూములకొట్టేయడం కోసమే ఉమేశ్, గోపీనాథ్ రెడ్డిల అష్యూర్ డెవలపర్స్ సంస్థ పుట్టుకొచ్చింది. భూ యజమానులుగా ఉన్నవారి మెడపై కత్తిపెట్టి మరీఒప్పందాలు చేసుకున్నది నిజంకాదా?

విజయసాయిరెడ్డి కుమార్తె అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ద్వారా అష్యూర్ డెవలపర్స్ కు డబ్బుచేరింది. గొలుసుకట్టు పద్థతిలో ప్రభుత్వసహాకారంతోనే విశాఖలో మహాభూదోపిడీ సాగింది. అభివృద్ధి పేరుతో 70 శాతం భూమి డెవలపర్స్ కు, 30శాతం భూమి యజమానులకు కేటాయించడం మాయాజాలంకాదా? భూయజమానులకు 30శాతం, అభివృద్ధిచేసేవారికి 70శాతమనేది దేశంలోనే పెద్ద వింత. అలాంటి వింతలు ఏపీలోనే జరుగుతాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా చంద్రబాబుహాయాంలో విశాఖనగరంలోని భూములు నిషేధిత జాబితాలోనే ఉన్నాయని స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పారు. గతంలో దసపల్లా భూములకు సంబంధించి దొంగదీక్షలుచేసి, పసలేనిఆరోపణలు చేసిన గుడివాడ అమర్నాథ్, నేడు మంత్రిగా ఉండికూడా సదరుభూములస్వాహాతోపాటు, విశాఖ భూదోపిడీపై ఎందుకు నోరెత్తడు? తమపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయనకుమార్తె, అల్లుడు భూములు కాజేస్తున్నారనే అమర్నాథ్ మాట్లాడటం లేదా?

ఉత్తరాంధ్ర బీసీలపై జగన్ రెడ్డికి ప్రేమేఉంటే, ఆప్రాంతానికి విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్లను ఎందుకు ఇన్ ఛార్జ్ లుగా నియమించాడు? ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువఉంటే, ఆప్రాంత ఇన్ ఛార్జ్ గా జగన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఎందుకు నియమించారు? తరువాత ఆయనస్థానంలో వై.వీ.సుబ్బారెడ్డి ఎందుకు వచ్చాడు? కేవలం బీసీల ముసుగులో జగన్ రెడ్డి ఆయనప్రభుత్వం ఉత్తరాంధ్రపై కపటప్రేమ చూపుతోంది. ఉత్తరాంధ్రలోని ఖనిజసంపద, భూదోపిడీ కోసమే జగన్ రెడ్డి ఆప్రాంతంపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. భూములు కొట్టేయడానికి, కొట్టేసిన వాటిని కాపాడటానికే జగన్ రెడ్డి బీసీలను ఉత్తరాంధ్రనేతలుగా నియమించలేదు. కుల అహాంకారం, అధికారమదాన్ని ఒళ్లంతా నింపుకున్న జగన్ రెడ్డి టీడీపీపై, మీడియా సంస్థలపై అర్థంపర్థంలేని ఆరోపణలుచేస్తున్నాడు. టీడీపీలో చెప్పుకోవడానికి ఎర్రంనాయుడు, కళావెంకట్రావు, ప్రతిభాభారతి లాంటి వారు ఉన్నారు.

కూతురు అల్లుడిని వెనకేసుకొస్తున్న విజయసాయి, అరబిందోసంస్థ గిల్లుడు గురించి చెప్పడేం?
తన అల్లుడి కంపెనీ 20ఏళ్లనుంచి ఉందని వారుతప్పుచేయరని బుకాయిస్తున్న విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి అధికారంలోకిరాకముందు.. వచ్చాక సదరు కంపెనీ పరిస్థితేమిటోచెప్పాలి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాకే సదరు కంపెనీకి ఎన్ని ప్రాజెక్ట్ లు వచ్చాయో విజయసాయి చెప్పాలి. అరబిందో కంపెనీకి కాకినాడ గేట్ వే పోర్ట్ లో 74శాతం వాటా, ప్రపంచవిఖ్యాతి గాంచిన జీఎంఆర్ సంస్థకంటే ఎక్కువగా ఎస్ ఈజెడ్ లో 99శాతం వాటా అరబిందోకు దక్కింది నిజంకాదా? జీఎంఆర్ కంపెనీ చేయలేనిది అరబిందో చేయగలుగుతుందా? చమురుశుద్ధికి సంబంధించి ప్రత్యేకంగా ఒకపోర్ట్ తయారుచేయాలన్న లక్ష్యంతో జీఎంఆర్ ముందుకువస్తే, దాన్ని కాదని కాకినాడ ఎస్ఈజెడ్ లో అరబిందోకు అగ్రవాటా ఎలా దక్కింది?

పోలవరం నిర్మాణానికి పనికిరాదన్న నవయుగ సంస్థతో కలిసి అరబిందో సంస్థ రామాయపట్నంపోర్టు పనులు దక్కించుకోలేదా? ఫార్మా సంస్థ అరబిందోకు ఎస్ఈజెడ్ లు, పోర్టులు అభివృద్ధిచేసే అర్హతఉందా? దేశంలోనే అత్యుత్తమ కంపెనీ అయిన జీఎంఆర్ కంటే అరబిందో సమర్థవంతమైన కంపెనీనా? ముఖ్యమంత్రి సహాయసహాకారాలతోనే విజయసాయిరెడ్డి తనకుమార్తె, అల్లుడికంపెనీకి వేలకోట్లు దోచిపెట్టారనడంలో ఇసుమంతసందేహం కూడా లేదు. 108-104 అంబులెన్స్ ల నిర్వహిస్తున్న బీ.వీ.జీసంస్థను బెదిరించి, వారికాలపరిమితిని రద్దుచేసిమరీ అరబిందోకు ఎలా అప్పగించారో విజయసాయిరెడ్డి చెప్పాలి. వేలకోట్ల విలువైన పనులు, ఆస్తులు, భూములు కేవలం మూడున్నరేళ్లలోనే తనకూతురి అల్లుడికంపెనీకి ఎలా వచ్చాయో ఎంపీగా విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి.

కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ కూడా అరబిందో సంస్థకే వస్తుందంటున్నారు.
ఎలా చూసినా, తాము తమ కుటుంబసంస్థలు తప్ప, ఇంకేవీ రాష్ట్రంలో ఉండకూదన్నదే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల ఆలోచన. ఏ ప్రభుత్వం అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే విషయం విజయసాయికి తెలియదా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకవ్యక్తిగాఉన్న విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి సంగతేంటి? ఢిల్లీలో కాళ్లుపట్టుకోవడం.. రాష్ట్రంలో కాలర్ ఎగరేయడం విజయసాయికి బాగా తెలిసిన విద్య. జగన్ రెడ్డి వచ్చాక, రాకముందు రాష్ట్రవ్యాప్తంగా సాగిన భూదోపిడీపై కూడా విజయసాయి మాట్లాడాలి.

అమరావతిప్రాంతంలో ఫలానా కులంచేతిలో భూములున్నాయని సిగ్గులేకుండా మాట్లాడిన విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డికి అధికారం ఇచ్చింది దోపిడీకోసమో.. ప్రజలకోసమో చెప్పాలి. విశాఖనగరపరిధిలోని కొన్నివందల ఎకరాలను నిషేధితభూముల జాబితా నుంచి తొలగించడంగానీ, అక్కడసాగిన భూదందాలపై రాజ్యసభ్య సభ్యుడిగా విజయసాయి సీబీఐ విచారణ కోరగలడా? ఆయనకు నిజంగా అంత చిత్తశుద్ధేగనక ఉంటే, కచ్చితంగా మరలా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లకతప్పదని హెచ్చరిస్తున్నాం. అరబిందో సంస్థ షేర్ రూ.500లకు దిగజారితే, ఏపీ ప్రభుత్వం నుంచి దోచుకున్న ఆస్తులు, భూములు బ్రహ్మండంగా పెరిగాయి. తనకు రెండు బెడ్ రూమ్ ల ఇల్లు, ఒకప్లాట్ తప్పఏమీలేదన్న విజయసాయి, రూ.1000కోట్లతో ఒక పత్రిక, ఛానెల్ ఎలా పెడతాడో చెప్పాలి. తనదోపిడీని ఎత్తిచూపేవారిని బెదిరిస్తూ, బుకాయిస్తూ విజయసాయిరెడ్డి ఎంతకాలం తప్పించుకుంటారు. దోపిడీసొమ్ముతో ఛానెల్, పత్రిక పెట్టిన జగన్ రెడ్డి ఏం సాధించాడు? విజయసాయి ఏం ఊడబెరుకుతాడు” అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

Leave a Reply