Suryaa.co.in

Andhra Pradesh

ఓటు వేసి ఆశీర్వదించండి

  • మీ భవిష్యత్తుకు నాది భరోసా
  • నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి
  • తాగు, సాగు నీరు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
  • చిత్రాడ రోడ్ షోలో జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి  పవన్ కళ్యాణ్
  • పిఠాపురంలో జనప్రభంజనం మధ్య రోడ్ షో

‘మీ ఆశీస్సుల కోసం వచ్చా.. ఓటు వేసి ఆశీర్వదించండి.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నా కష్టం, నా శ్రమ.. మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అండగా నిలబడుతుందని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం నుంచి భారీ రోడ్ నిర్వహించారు. ప్రతి అడుగు జన ప్రభంజనం మధ్య ఈ రోడ్ షో సాగుతోంది. యావత్ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రోడ్ల మీదకు రాగా, దారిపొడుగునా మహిళలు హారతులు, పూల వర్షంలో తడిసి ముద్దవుతూ ముందుకు సాగారు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతూ రోడ్ షో కొనసాగించారు. ఈ సందర్భంగా చిత్రాడలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే అజెండా
కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం నేను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే యావత్ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం నాకు అండగా నిలబడినందుకు ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నేను నిలబడతాను. ఈ ప్రాంత అభివృద్ధే అజెండా, ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దేలా పని చేస్తా. ప్రజల ప్రాణాలు తీస్తున్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాల రద్దుకు కృషి చేస్తాం. 2047 నాటికి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిచడం, తాగు, సాగునీటి సౌకర్యం కల్పించడం, లా అండ్ ఆర్డర్ పటిష్టపరిచే విధంగా కూటమి కృషి చేస్తుంది.

ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో తాగునీరు, సాగునీటి సౌకర్యాల కల్పన కోసం, ఎస్ఈజెడ్ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి నాయకులంతా సమష్టిగా పని చేస్తాం. నేను ఒక్క ఎన్నికల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఒక తరం భవిష్యత్తు కోసం వచ్చాను. మీ అందరి ఆశీర్వచనాలు నాకు కావాలి” అన్నారు. ఈ రోడ్ షోలో మాజీ శాసనసభ్యులు, టీడీపీ పిఠాపురం నియోజక వర్గం ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాకినాడ పార్లమెంటు అభ్యర్ధి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బీజేపీ ఇంఛార్జ్ కృష్ణంరాజు, పార్టీ స్టార్ క్యాంపెయినర్లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE