– బెడిసికొట్టిన వైసీపీ పెన్షన్ పాలిటిక్స్
– కూటమిపై నెపం నెట్టాలని వైసీపీ కుట్రలు
– ఆడియో, వీడియో సాక్షాలతో బెడిసికొట్టిన వైనం
– వైసీపీకి శిరోభారంగా మారిన జోగి ఓవరాక్షన్
– జోగి శవరాజకీయంతో జగన్ పాత కథలు బయటకు
– జగన్‌ను ఇరికించిన జోగి, పేర్ని
– పెన్షనర్ల ముందే వైసీపీ కుట్రను బయటపెట్టిన ఎమ్మెల్యే రామానాయుడు
– వచ్చిన పెన్షన్ డబ్బు 9 వేలేనని అందరి ఎదుటా చెప్పిన సిబ్బంది
– డబ్బులు లేకుండా వైసీపీ నాటకాలపై పెన్షనర్ల మండిపాటు
– ఇళ్లకే వచ్చి ఇవ్వాలన్న ఈసీ ఆదేశాలు పెన్షనర్లకు వివరిస్తున్న కూటమి
– వైసీపీకి పెన్షన్ టెన్షన్
(మార్తి సుబ్రహ్మణ్యం)
అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్న సామెత ఇప్పుడు వైసీపీ ఓవరాక్షన్‌కు అతికినట్లు సరిపోతుంది. పెన్షన్లు ఇంటింటికీ వచ్చి ఇవ్వకుండా, టీడీపీనే అడ్డుకుందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం.. ఎండదెబ్బకు చనిపోయిన పెన్షనర్ల శవాలను అడ్డుపెట్టుకుని చేస్తున్న శవరాజకీయాలు వర్కవుట్ కావటం లేదు. దానికితోడు పెన్షనర్లకు సరిపడా డబ్బులు విడుదల చేయకపోవడం, అది వైసీపీనే ముద్దాగా నిలబెట్టే దశకు చేరింది. తాజా పరిణామాలతో ఆ పార్టీ అభ్యర్ధులు తలపట్టుకుంటున్నారు. అటు వాలంటీర్ల కోసం చివరకు, పార్టీనే పణంగా పెడుతున్నారని జగనన్న తీరుపై పార్టీ వర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఆ విధ ంగా ఎన్నికల ముందు వైసీపీ ఉభయభ్రష్టత్వం చెందుతోందన్నది ఆ పార్టీ నేతల వాదన,వేదన.
వాలంటీర్లు సేవకులే తప్ప, ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి, ఎన్నికల కోడ్ వచ్చినందున.. వారి బదులు ప్రభుత్వ ఉద్యోగులే ఇళ్లకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, రోగులకు పెన్షన్ డబ్బు చెల్లించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ మేరకు ఈసీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే దానిని అడ్డుపెట్టుకుని..చంద్రబాబునాయుడు ఫిర్యాదు వల్లే మీకు వాలంటీర్లు ఇళ్లకు డబ్బులు తెచ్చి ఇవ్వలేకపోతున్నారని వైసీపీ కొత్త ప్రచారానికి తెరతీసింది.
పెన్షన్లు కూడా అందుకే ఆలస్యమవుతున్నాయంటూ వాలంటీర్లతో, వైసీపీ అభ్యర్ధులు చేయిస్తున్న రాజకీయం మొదటి రెండు రోజులు ఫలింలించింది. ఆ మేరకు వాలంటీర్లు కూడా చంద్రబాబు ఆపడం వల్లే తాము మీ ఇళ్లకు వచ్చి డబ్బులు ఇవ్వలేకపోతున్నామని పెన్షనర్లకు సెల్‌ఫోన్ల ద్వారా వాయిస్‌మెసేజ్ పెట్టించారు. అయితే ఆ తర్వాత ఈసీ వివరణ- పెన్షనర్లకు సరిపడా డబ్బును ప్రభుత్వం పంపిణీ చేయకపోవటంతో కథ అడ్డం తిరిగి, అది వైసీపీ మెడకే చుట్టుకునే ప్రమాదం ఏర్పడింది.
ఈలోగా ఎండదెబ్బ తగిలి చనిపోయిన పెన్షనర్ల శవాలను అడ్డుపెట్టుకుని.. వైసీపీ చేసిన శవరాజకీయాలు సోషల్‌మీడియా ద్వారా పెన్షనర్లకు తెలిసి, వైసీపీని ఈసడించుకోవడం ప్రారంభించారు. మంత్రి జోగి రమేష్ ,ఒక పెన్షనర్ శవాన్ని చంద్రబాబు ఇంటికి వూరేగింపుగా తీసుకువెళ్లాలని, అక్కడి బంధువులను రెచ్చగొట్టే ప్రయత్నం వికటించింది. జోగిపై మండిపడిన మృతుని బంధువులు.. శవంతో రాజకీయం చేస్తారా? కావాలంటే శవం తీసుకువెళ్లండి. రాజకీయాలు చేయడానికి ఇదా సమయం అంటూ తిరగబడటంతో, జోగిరమేష్ అక్కడి నుంచి జారుకున్న వైనం వీడియోల ద్వారా సోషల్‌మీడియాలో బట్టబయలయింది.
దానితో పెన్షనర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ శవరాజకీయాలు చేస్తోందన్న ప్రచారం రాష్ట్రం మొత్తానికి శరవేగంగా పాకింది. ఎక్కడ వృద్ధులు చనిపోయినా వారి కుటుంబాల వద్దకు వెళ్లి.. ఇదంతా చంద్రబాబు వల్లనే జరిగిందని, వాలంటీర్లు ఉంటే మీ ఇళ్లకే వచ్చి డబ్బులు తెచ్చి ఇచ్చేవారన్న ప్రచారాన్ని, మృతుల కుటుంబాలు ఈసడించుకుంటున్న పరిస్థితి.
మీరు ఇక్కడ కు మాకు సానుభూతి చూపించడానికి వచ్చారా? లేక మా చావుతో రాజకీయం చేయడానికి వచ్చారా? మా చావు చస్తాం. మీరు దయచేసి వెళ్లిపోండి అని తిరుగుబాటు చేస్తున్న దృశ్యాలు, రాష్ట్ర వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. దానికి తగినట్లుగానే.. పెన్షనర్లతో వైసీపీ చేస్తున్న శవరాజకీయాలకు సంబంధించి ఆ పార్టీ అభ్యర్ధులు, నేతల వీడియోలు కూడా వైరల్ కావడంతో, ఏంచేయాలో తెలియక వైసీపీ ఆత్మరక్షణలో పడింది.
పైగా చంద్రబాబు వల్లే పెన్షన్లు ఆగిపోయాయని ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు… సచివాలయాలకు వెళ్లిన పెన్షనర్లకు ఇంకా ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదన్న సమాచారం, సంకటంగా పరిణమించింది. దానితో వైసీపీ సర్కారు అడ్డంగా బుక్కవుతున్న పరిస్థితి. ఈ విషయంలోటీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన ఆపరేషన్ పెన్షన్ వీడియో, ఇప్పుడు పెన్షనర్ల కళ్లు తెరిపిస్తోంది.
స్వయంగా కార్యాలయాలకు వెళ్లిన ఎమ్మెల్యే రామానాయుడు.. ఆ వార్డు పరిథిలో పెన్షనర్లు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమందికి డబ్బులు వచ్చాయని పెన్షనర్ల సమక్షంలోనే ఆరా తీస్తున్నారు.దానితో 600మంది పెన్షనర్లు ఉంటే పదిమందికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయని, సిబ్బంది పెన్షన్లర్ల ఎదుటే ఎమ్మెల్యేకు చెబుతున్నారు. దానితో సహనం కోల్పోయిన పెన్షనర్లు, ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు మీద నిందలు వేస్తున్న జగన్ అసలు మీకు పించన్ల డబ్బులే పంపించలేదని మీకు ఇప్పటికైనా అర్ధమైందా అని ఎమ్మెల్యే నిమ్మల పెన్షనర్ల కళ్లు తెరిపించటం విశేషం.
టీడీపీ నేతలు ఇదేవిధంగా కార్యాలయాలకు వెళ్లి, పెన్షనర్ల సమక్షంలో ఎన్ని డబ్బులు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. దానికి అతి తక్కువమందికే వచ్చాయని సిబ్బంది సమాధానంచెప్పడం, దానితో పెన్షనర్లు జగన్‌ను తిట్టిపోయడం కనిపిస్తోంది.ఈ పరిణామాలు తమ కొంప ముంచేవేనని వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.
దీనితో వాలంటీర్ల కోసం పార్టీని పణంగా పెట్టి, తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ అభ్యర్ధులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేసుకునే బదులు, వాలంటీర్ల ద్వారా గెలుద్దామన్న పనికిరాని వ్యూహం అమలుచేసి, తమ రాజకీయ జీవితాలతో ఆడలాడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యూహం బెడిసికొట్టి, అది తమ పార్టీపైనే పెన్షనర్లు తిరగబడే పరిస్థితి వచ్చిందని, వైసీపీ అభ్యర్ధులు బెంబేలెత్తుతున్నారు.
పైగా అసలు సచివాలయాల పరిథిలోని పెన్షనర్లకు సరిపడా డబ్బులు పంపిణీ చేయకుండా, శవరాజకీయాలు చేయడంతో వైసీపీ వ్యూహం బెడిసికొడుతోంది. అన్ని కేంద్రాలకు ఒకేసారి డబ్బులు పంపిణీ చేయకపోవడం.. వందమంది పెన్షనర్లు ఉన్న కేంద్రాలలో ఐదుగురికి సరిపడా డబ్బులు మాత్రమే పంపించడం వల్ల, పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేనందుకే నాటకాలు ఆడుతోందన్న ప్రచారం కింద స్థాయికి చేరింది. ఫలితంగా తాము ముద్దాయిలుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని వైసీపీ అభ్యర్ధులు బెంబేలెత్తుతున్నారు. దానికితోడు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బులను… జగన్ తన పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు ఇచ్చారంటూ, టీడీపీ చేసిన ప్రచారాన్ని పెన్షనర్లు నమ్మేందుకు అవకాశం ఏర్పడిందంటున్నారు.
అసలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేసుకుని ఓట్లు సాధించే బదులు, వివాదంగా మారిన వాలంటీరు వ్యవస్థను నమ్ముకోవడం ఏమిటని అటు వైసీపీ సీనియర్లు కూడా తలపట్టుకుంటున్నారు. ఓటర్లను పోలింగ్‌బూత్ వద్దకు తీసుకువచ్చే కార్యకర్తలు, నాయకులను పక్కనపెట్టి వాలంటీర్లను నమ్ముకుని పార్టీని నట్టేట ముంచుతున్నారని వైసీపీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ‘‘వాలంటీర్లను నమ్ముకున్న జగన్ ఆశలు ఇప్పుడు ఈసీ ఆదేశాలతో ఆవిరయ్యాయి. వారి పాత్ర ఇప్పుడు లేదు.మళ్లీ పార్టీ నాయకులే కావాలి. ఇన్నాళ్లూ వారు అవసరం లేదని పక్కనపెట్టిన పార్టీ నాయకత్వానికి వాళ్లెందుకు పనిచేస్తాం? వాలంటీర్లతోనే పనిచేయించుకోమని మా ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా చెబుతున్నారు. దానితో మా పరిస్థితి దారుణంగా మారింది. అటు వాలంటీర్లతో పనిచేయించుకుంటే ఈసీ ఒప్పుకోదు.పైగా చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇటు చూస్తే నాయకులను ఐదేళ్లు పక్కనపెట్టినందుకు వాళ్లూ మాపై కోపంతో ఉన్నారు. దానితోమాకు గ్రామాల్లో పనిచేసేవాళ్లులేకుండా పోయాయ ’’ని గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్ధి ఒకరు వాపోయారు.
టీడీపీ భుజంపై తుపాకీ పెట్టి.. పెన్షనర్లతో రాజకీయం చేయాలన్న వ్యూహం వికటించిన ఫలితంగా, ఇప్పుడు తాము పెన్షనర్ల వద్దకు పోలేకపోతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసలు డబ్బులు విడుదల చేయకుండా… తమతో నాటకాలు ఆడుతున్నారని గ్రహించిన పెన్షనర్లు, చివరకు వైసీపీనే తిరుగుబాటు చేసే పరిస్థితికి, తమ నాయకత్వమే కారణమని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
తమ పార్టీ అనుకూల మీడియాలో.. పెన్షన్లు ఇళ్లకు సకాలంలో రాకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేయిస్తున్నప్పటికీ, వాస్తవాలు తెలుసుకున్న పెన్షనర్లు.. ఇప్పుడు తమ పార్టీపైనే తిరుగుబాటు చేసే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.