* మూడేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు
* ఏపి ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి విమర్శల జల్లు
విశాఖపట్నం, సెల్ఐటి న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి విమర్శల జల్లు కురిపించారు. విశాఖలో బీజేపీ నేతలతో కలిసి ఆమె పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని చెప్పారు.
అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాల్సింది పోయి, అప్పులు చేయడంలో అగ్రగామిగా ఏపీ ప్రభుత్వం నిలిచిందని ఆమె ఎద్దేవా చేశారు. రాబోయే ఆదాయాన్ని చూపెడుతూ అప్పులు తీసుకునే ప్రభుత్వం దేశంలో ఏపీలోనే ఉందని చురకలు అంటించారు. జీవీఎంసీలోని ఆస్తులను కుదవపెట్టి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారిందని ఆమె చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు నిర్మించడం లేదని ఆమె ఆరోపించారు. ఏపీ సర్కారుని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వారిని భయపెడుతున్నారని ఆమె విమర్శించారు.