-కొమురవెల్లి మండల సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు ఓటు వేసిన వారికే దళితబంధు ఇస్తామని ఆయన అన్నారు. కొమురవెల్లి మండల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ గ్రామస్తులకు దళితబంధు అందడం లేదని… అర్హులైన వారికి దళితబంధు ఇవ్వాలని రాంసాగర్ సర్పంచ్ రవీందర్ ఎమ్మెల్యేను కోరారు. దీనికి సమాధానంగా… గతంలో ఎన్నడూ లేని విధంగా నీళ్లు, విద్యుత్ ఇస్తున్నామని… ప్రసూతికి కేసీఆర్ కిట్, ఆడ బిడ్డ పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు ఓటు వేస్తామనే వారికే దళితబంధులో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదని అన్నారు.
ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డిపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండిపడింది. దళిత సర్పంచ్ ను అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ కు ఓటు వేస్తేనే దళితబంధు ఇస్తాం… నువ్వు నోరు మూసుకుని కూర్చో అంటూ అవమానించిన ముత్తిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.