Suryaa.co.in

Features

ఈ దేశంలో దళితుల్ని చంపినా శిక్షలు పడవు!

ఈ దేశంలో దళితులను చంపితే ఆధిపత్య కుల నేరస్తులకు శిక్షలు పడవు.
దళిత ఐఏఎస్ అధికారిని విధి నిర్వహణలో బీహార్ రౌడీ మూకలు కాల్చి చంపినా శిక్షలు పడవు.
నిర్భయ అత్యాచార కేసులాగా దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన చెలరేగదు.
దిశ అత్యాచార సంఘటనలాగా ఆధిపత్య పాలక ప్రభుత్వాలు తక్షణమే స్పందించి,
విచారణ లేకుండానే నిందితులను ఎన్కౌంటర్ చేయరు.
ఎందుకంటే?
వీరు దళితులు

‘జి.కృష్ణయ్య, ఐఏఎస్ అమర్ రహే’
అనే సువర్ణాక్షరాలు బీహార్‌ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ పట్టణంలోని హనుమాన్ గర్హి అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ బోర్డుపై లిఖించబడ్డాయి. ఓ నిరుపేద దళిత కూలీ కుటుంబం నుండి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన జి.కృష్ణయ్య దారుణ హత్యకు గుర్తుగా అక్కడ ఓ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డుపై రాసిన అక్షరాలు బీహార్ లోని ఎంతోమందికి అణగారిన పేద వర్గాల హృదయ స్పందనలు.సివిల్ సర్వీస్ లక్ష్యంగా ఉన్న యువతకు ఎంతో స్ఫూర్తి.అంతకుమించి ఆధిపత్య కుల దురహంకారంతో ఉన్న బీహార్ బందిపోటులు,రౌడీ మూకల గుండెల్లో ఆ మేజిస్ట్రేట్ పేరు వింటేనే చెప్పలేనంత భయం.

బీహార్‌ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఐ.ఏ.ఎస్ అధికారి జి.కృష్ణయ్య ను 1994 డిసెంబర్ 5 న సాయంత్రం ముజఫర్‌పూర్ నగర శివార్లలోని ఖాబ్రా గ్రామంలో కరుడుగట్టిన నరహంతకముఠా నాయకుడు,గ్యాంగ్‌స్టర్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ రౌడీ మూఖల దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణలోని అత్యంత వెనకబడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం జోగులాంబ గద్వాల) అలంపూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో భూమిలేని నిరుపేద దళిత కూలీ కుటుంబంలో జి.కృష్ణయ్య జన్మించారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు.అత్యంత పేదరికంలో పెరిగారు.చిన్ననాటి నుండి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.

తన చదువు, ఇతర ఖర్చుల కోసం కూలీ పనులు చేశాడు. చదువు విలువను అర్థం చేసుకొని, డా.బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో చిన్నతనం నుండే చదువులో ప్రతిభ కనబరిచి,గద్వాలలో డిగ్రీ పూర్తి చేశారు.అంతటితో ఆగలేదు.ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.కొంతకాలం లెక్చరర్‌గా ఉద్యోగం చేశాడు. ప్రజాసేవ చేయాలన్న కసితో సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్నాడు.కుల అణిచివేత,సామాజిక, ఆర్థిక అసమానతలను ధిక్కరించి వాటిని సమూలంగా రూపుమాపాలంటే IAS అధికారి కావాలనే కలలుకన్నాడు.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై ఐఏఎస్ అధికారిగా సాధించాడు. చిన్ననాటి నుండి IAS అధికారి కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. 1985లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరి, బీహార్ క్యాడర్ ఐఏఎస్ గా విధుల్లో చేరాడు.

జి కృష్ణయ్య, ఐఏఎస్ శిక్షణ అనంతరం నలంద జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.అక్కడి నుంచి హజారీబాగ్‌కు సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ (SDM) గా బదిలీ అయ్యారు. జిల్లా కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ పశ్చిమ చంపారన్‌ జిల్లాలో నియమితులయ్యారు. నాడు ఆ జిల్లా పేరు చెబితేనే భయంకరమైన డెకాయిట్‌లు,కిడ్నాపర్‌లకు కేంద్రంగా పరిగణించబడుతుండేది. స్థానిక రాజ్ పుత్, భూమిహార్ కుల భూస్వాములు ఎన్నో అడ్డంకులు కల్పించినప్పటికీ ఓ ఐఏఎస్ అధికారిగా పేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సఫలీకృతుడయ్యాడు.దళిత వర్గానికి చెందిన జి.కృష్ణయ్య, ఐఏఎస్ కు పేదల కష్టాలు, కన్నీళ్లు తెలుసు కనుక, అక్కడి పేద ప్రజల మన్నలను పొందారు.జిల్లా కలెక్టర్ గా ఎటువంటి బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భూ సంస్కరణలను అమలు చేశాడు.వేలాది ఎకరాల భూమిని భూమిలేని నిరు పేదలకు పంచాడు. అప్పటికి బీహార్ రాష్ట్రంలో అక్కడి పేద ప్రజల గుండెల్లో కష్టాలు తీర్చే
ఓ భగవాన్,
ఓ అల్లా,
ఓ జీసెస్
మరే దేవుడైనా కూడా ఆయనే.
ఇది అక్కడి పేద ప్రజల నమ్మకం.

పశ్చిమ చంపారన్‌ జిల్లాలో భూ సంస్కరణలను అమలు చేసినందుకు ఆనాటి ప్రభుత్వం 1994లో జి.కృష్ణయ్యను లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా అయిన గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు.గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ గా విధి నిర్వహణలో ఉండగా ముజఫర్‌పూర్ ప్రాంతంలో ఓ నిజాయితీ గల ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య పై గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ నేతృత్వంలో మూక దాడి జరిగింది.
జి.కృష్ణయ్య, ఐఏఎస్ ను కాల్చి చంపారు. ఐఏఎస్ అధికారిని కాల్చి చంపిన ముఠాకు నాయకత్వం వహించింది గ్యాంగ్‌స్టర్- ఆనంద్ మోహన్.ఆ తర్వాత జి.కృష్ణయ్య, ఐఏఎస్ హత్యకేసులో ఆనంద్ మోహన్ తోపాటు మరో 35 మంది దోషులుగా నిర్ధారించబడ్డాడు.

ఆనంద్ మోహన్ ఎందుకు విడుదలవుతున్నాడు.?
బీహార్ రాష్ట్ర జైలు మాన్యువల్‌ను సవరించి, దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను హత్య చేసిన దోషి,మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలను సులభతరం చేయాలని నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితమైనది. బీహార్ ప్రజల గుండెల్లో మానని పాత గాయాలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది.1994 నుండి 2007 వరకు 13 సంవత్సరాల పాటు సాగిన విచారణ తర్వాత, ఏడుగురిని దోషులుగా నిర్ధారించారు మిగిలిన 29 మందిని నిర్దోషులుగా ప్రకటించారు.

దోషుల్లో ఆనంద్ మోహన్, ప్రొఫెసర్ అరుణ్ కుమార్, అఖ్లాక్ అహ్మద్‌లకు మరణశిక్ష పడింది. కానీ ఒక సంవత్సరం తర్వాత పాట్నా హైకోర్టు మోహన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది, ఇది మరణశిక్షకు అర్హమైన “అరుదైన” కేసు కాదని కోర్టు పేర్కొంది.ఓ జిల్లా మెజిస్ట్రేట్ విధి నిర్వహణలో గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు చేతిలో అత్యంత పాశవికంగా కాల్చివేతకు గురైతే, పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. ఇంతకంటే న్యాయం బహుశా ఈ దేశంలో దళితులకు దక్కదేమో!

గత 15 ఏళ్లకు పైగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న 26 మందితో పాటు గ్యాంగ్‌స్టర్,మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ 2007 నుండి సహర్సా జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు, అయితే JD(U)లోని పలువురు రాజ్‌పుత్ నాయకులు ఆనంద్ మోహన్ ను త్వరగా విడుదల చేయాలని బీహార్ ప్రభుత్వంపై కుల పరంగా ఒత్తిడి చేశారు. ఏప్రిల్ 10న, బీహార్ ప్రభుత్వం మోహన్ విడుదలను సులభతరం చేయడానికి బీహార్ ప్రిజన్ మాన్యువల్-2012ను సవరించింది. ప్రిజన్ మాన్యువల్ లోని కఠినమైన సెక్షన్లకు మార్పులు చేస్తూ బీహార్ జైలులో 14 నుంచి 20 ఏళ్ల మధ్య జైలు శిక్ష అనుభవించిన మరో 26 మంది ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.

హార్ అంటేనే నేరస్తులు, బందిపోటు దొంగలు,రౌడీ మూకలు ఉన్న రాష్ట్రం. తీవ్రమైన నేరాలు, హత్యలకు పాల్పడిన నేరస్తులను ప్రభుత్వం విడుదల చేయడమంటే ‘న్యాయానికి-చట్టానికి’ సంకెళ్లు వేయడమే. ఆనంద్ మోహన్ తన కుమారుడు ఆర్జెడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థానికి పెరోల్‌పై జైలు నుండి విడుదల చేయడం నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం. అదే సమయంలో ఆనంద్ మోహన్ తన రాజ్ పుత్ కమ్యూనిటీ నాయకులతో సంప్రదింపులు జరిపి, తన విడుదలకు సహకరించాలని అధికార,ప్రతిపక్ష నాయకులను రాజ్ పుత్ కమ్యూనిటీ పేరుతో ప్రభావితం చేశారు.

మరో మూడు నెలల తర్వాత ఏప్రిల్ 24న బీహార్ ప్రభుత్వం 27 మంది ఖైదీలను విడుదల చేస్తూ నోటిఫై చేసింది.జాబితాలో 11వ స్థానంలో ఆనంద్ మోహన్ కూడా ఉన్నారు. ఆనంద్ మోహన్ ను జైలు నుండి విడుదల చేయడం ఇది ప్రత్యక్ష సాక్షులకే కాదు, ఐఏఎస్ జి.కృష్ణయ్యతో పాటు పనిచేసిన ఐఏఎస్‌ల లకు కూడా తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వచ్చే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజ్ పుత్ కులానికి చెందిన ఓట్లర్లను ఆకట్టుకోవడం కోసమే ఆనంద్ మోహన్ విడుదల అనేది దేశవ్యాప్తంగా చర్చజరుగుతుంది.

ఆనంద్ మోహన్ విడుదలను ఖండించిన బీఎస్పీ
బీహార్ జైలు నిబంధనల మార్పు “దళిత వ్యతిరేకం” అని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించింది.ఈ నిర్ణయంపై బీహార్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. బీహార్ ప్రభుత్వం నిర్ణయం భారతదేశం అంతటా ఉన్న దళితులకు తీవ్ర ఆగ్రహాన్ని తెస్తుందని ఆమె హెచ్చరించారు. మాజీ అడిషనల్ డీజీపీ,బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తక్షణమే స్పందించి దివంగత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యపై హత్యకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ ను జైలు నుండి విడుదల చేయడంపట్ల బీహార్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.

కరుడుగట్టిన నేరస్తులు,హంతకముఠా నాయకులను రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం జైలు నుండి విడుదల చేయడం ఆక్షేపనీయమన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్యాంగ్‌స్టర్లు, మాఫియాలు బీహార్‌ రాష్ట్రంలో లేదా మరే రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా సంచరించకుండా కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐఏఎస్ జి.కృష్ణయ్య కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం బీహార్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు.ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి విడుదల చేయడంపై పునరాలోచించాలని బీహార్ ప్రభుత్వాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం కోరింది.

తెలుగుమీడియా ప్రసారాలు ప్రత్యేక కథనాలు ఎక్కడ?
అమెరికా,ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య,ఉద్యోగం కోసం వెళ్లిన తెలుగోడిని అక్కడి పౌరులు అకారణంగా కాల్చి చంపితే ‘తెలుగు తేజం హత్య అంటూ’ రోజుల తరబడి వార్తా ప్రసారాలు చేసే తెలుగు మీడియా ఇప్పుడు ఎక్కడ? జి.కృష్ణయ్య, ఐఏఎస్ కు జరిగిన అన్యాయం కనబడుతలేదా? గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ లాంటి వ్యక్తులు సమాజంలో తిరరుగవద్దని జి.కృష్ణయ్య కుటుంబ సభ్యులు, ఐఏఎస్ అధికారుల సంఘం,ప్రజాస్వామ్య గొంతుకలు గొంతెత్తి అరిచినా కూడా తెలుగు పత్రికలు పతాక శీర్షికల్లో వార్తలు రాయడం లేదు. తెలుగు టీవీ ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్ గా వార్తలు ప్రసారం చేయడం లేదు. ఇదో విషాదం.
(ఈ వ్యాఖ్యలు కొన్ని పత్రికలు,టీవీ యాజమాన్యానికి మాత్రమే,అందరికీ వర్తించవు.ఇదీ గమనించగలరు.)
కేవలం కొన్ని నేషనల్ ఇంగ్లీష్,హిందీ చానల్స్ మాత్రమే అంటే BBC,TIMES NOW, NDTV, Aaj Tak,Times of India, The Hindu, The Print వంటి టీవీ ఛానళ్లు, పత్రికలు జి.కృష్ణయ్య కుటుంబ సభ్యులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ప్రసారం చేస్తున్నాయి,వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. కానీ తెలుగు మీడియా ఎందుకో తెలియదు కానీ, ఇటువంటి ప్రయత్నం చేయడం లేదు.

ఇది తమకున్న పత్రికా స్వేచ్చకు తమకు తాము సంకెళ్లు వేసుకోవడమే అవుతుంది.
కృష్ణయ్య కుటుంబ సభ్యులకు ఈ దేశంలో న్యాయం జరిగేనా?
పాలక ప్రభుత్వాలు కుల దురాహంకారంతో నేరస్తులకు వత్తాసు పలికితే?
ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది?
జరిగితే ఎప్పుడు జరుగుతుంది?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా?
సుప్రీం కోర్టు తీర్పు ఎటువైపు?
బాధిత కుటుంబం వైపా?
(లేక)
అగ్రకుల నేరస్తుల గుంపు వైపా?
వేచిచూద్దాం!

– చెట్టుపల్లి మల్లిఖార్జున్
పరిశోధకులు, రాజనీతి శాస్త్ర విభాగం,
ఉస్మానియా విశ్వవిద్యాలయం.
సెల్ : 99666 99801

LEAVE A RESPONSE