– పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల బాబుకు వచ్చే నష్టం ఏమిటి?
– సీఆర్డీఏను చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంటు అథారిటీగా మార్చాడు
– కోర్టు తీర్పులను గౌరవిస్తాం.. మూడు అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన వెనకడుగు వేసినట్టు కాదు
– వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల నిర్ణయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టాక, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. 13 జిల్లాల ప్రజలకు మేలు జరగాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అనేక సందర్భాల్లో ఏపీకి జరిగిన నష్టం, కొత్తగా ఏర్పడిన విభజిత ఆంధ్రప్రదేశ్ కు మరోసారి జరగకూడదు అనే ఉద్దేశంతో పాలనా వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
గతంలో చెన్నై నగరాన్ని, ఆ తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ మహా నగరాన్ని మనం కోల్పోయాం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి అనేది జరిగితే మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతుందనే ఉద్దేశంతో వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మూడు రాజధానుల అంశాన్ని విధాన నిర్ణయంగా తీసుకుని, దానిపై బిల్లు ప్రవేశపెట్టాం. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి నేటి వరకూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వర్గం, ఆయనకు తోడు-నీడగా నిలుస్తున్న వర్గాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని ఏవిధంగా అడ్డుకోవాలని చూశారో అందరూ చూస్తున్నారు.
బాబుకు వచ్చే నష్టం ఏమిటో చెప్పాలి
పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల చంద్రబాబు నాయుడుకు వచ్చిన నష్టం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే చంద్రబాబుకు కానీ, రాష్ట్రానికి కానీ వచ్చే నష్టం ఏంటో ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని కోరుతున్నాం. రాష్ట్ర విభజన జరగాలని ఉద్యమాలు జరుగుతున్న సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తే.. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని, ఆ కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదికను అందించింది.
ఆ నివేదికను చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల్లో అత్యంత వెనుకబాటుతనంలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న నాలుగు జిల్లాలు ఉన్నాయని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు మరింత వెనుకబాటుతనంతో ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలని తెలిపింది. అటువంటి ప్రాంతాలకు మేలు జరగాలని, ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే గిరిజనులకు మేలు చేద్దామంటే… చంద్రబాబు సహించలేని పరిస్థితి. రాష్ట్రంలోని 13 జిల్లాలు ఏమైపోయినా పర్వాలేదు, అయిదు కోట్లమంది ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. తాను, తన బినామీలు అమరావతిలో కొన్న భూములు, 29 గ్రామాలు తప్పితే రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్న చందంగా గతంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ, ఆయన సామాజిక వర్గం ప్రవర్తించిన తీరును ఉత్తరాంధ్ర వాసిగా తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఉత్తరాంధ్ర ఏం పాపం చేసింది బాబూ..?
ఉత్తరాంధ్ర ప్రజలు ఏం పాపం చేశారు? ఏం తప్పు చేశారు? ఈ ప్రాంత ప్రజల కడుపు కొట్టాలనే ఆలోచనతో చంద్రబాబు ఎందుకు ఉన్నాడో చెప్పాలి. రాయలసీమ ప్రాంత ప్రజలు ఏం తప్పు చేశారో, ఎందుకు వాళ్లపై కక్ష కట్టారో చెప్పాలి. ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.
ఉత్తరాంధ్రపై ఎందుకు విషం..?
తమ పెట్టుబడిదారుల తాలుకా రాజధాని ప్రాంతానికి మంచి జరిగిందని చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, తెలుగుదేశం పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు అండ్ కో పెట్టుబడిదారుల తాలూకా రాజధాని అని వైయస్సార్ సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతి సందర్భంలోనూ చెబుతున్నాం.
సీఆర్డీయే అంటే అమరావతి కేపిటిల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ కాదు… చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంటు అథారిటీగా మార్చారని, మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ చెబుతున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదని, విశాఖపై విషం చిమ్మాలని, ఈ ప్రాంతానికి మేలు జరగకూడదని చంద్రబాబు కుట్రలు పన్నారు. రాష్ట్ర విభజన జరిగాక ఏర్పాటు చేసిన కమిటీలు వాస్తవాలతో కూడిన నివేదికలు ఇస్తే… వారిపై కూడా చంద్రబాబు, టీడీపీ నేతలు అభాండాలు వేశారు.
విశాఖే రాజధానికి అనువైన నగరం
విశాఖ అన్నివిధాలుగా అభివృద్ధి చెందిన నగరం. అన్నిరకాలుగా రాజధానికి అనువుగా ఉండే నగరం. ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా, చిన్న తోడ్పాటును అందిస్తే విశాఖ నగరం దేశంలోని ఇతర నగరాలకు దీటుగా పోటీ పడుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కానీ విశాఖలో కొనడానికి భూములు లేవు, తాము కొనే పరిస్థితి లేదని, ఇప్పటికే అమరావతిలో కొన్న భూములతో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని వేల కోట్లకు అధిపతులు కావాలనేదే వీళ్ళ దురుద్దేశం. అందుకే అమరావతే రాజధాని కావాలని అంటున్నారు. భూముల రేట్లు తగ్గిపోతున్నాయని పోరాటాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా చూశామా..?. అది అమరావతిలోనే చూస్తున్నాం.
– విశాఖ నగరానికి ఒకవైపు రైల్వే లైన్, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం, నేషనల్ హైవే కనెక్టవిటీ, అంతర్జాతీయ పోర్టులు, పెద్ద పెద్ద ఎస్‌ఈజెడ్‌లు.. అన్ని రకాలుగా, అన్ని అవకాశాలు కలిగిన నగరం. ఇలాంటి నగరంపై విషం చిమ్మి, నష్టం కలిగించేలా, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా టీడీపీ కుట్రలు పన్నుతుంది.
అన్నం పెట్టిన విశాఖకు రామోజీ అన్యాయం
ఈనాడు దినపత్రికలో వస్తున్న వార్తల్ని చూస్తున్నాం. ఈనాడు పత్రిక పుట్టిందే విశాఖపట్నంలో. 40ఏళ్ల క్రితం రామోజీరావు ప్రస్థానం విశాఖలోనే మొదలైంది. డాల్ఫిన్ హోటల్స్‌ను కూడా ఇక్కడ నుంచే ప్రారంభించారు. రామోజీకి అన్నం పెట్టిన నగరానికి మేలు చేయకపోగా నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు.
ఇక ఏబీఎన్ రాధాకృష్ణ విషయానికి వస్తే… కృష్ణుని రాజ్యం ద్వారక ఏ రకంగా మునిగిపోయిందో… రాబోయే రోజుల్లో విశాఖపట్నం కూడా మహా సముద్రంలో మునిగిపోతుందంటూ.. మరో 50, 60 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో అంటూ వీరబ్రహ్మేంద్రస్వామిలా కాలజ్ఞానం చెప్పేస్తున్నారు. నగరంలో ఉన్న ప్రజలంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు, బ్రహ్మదేవుడు వచ్చి రాధాకృష్ణతో మాట్లాడినట్లే.. ఇక్కడ రూపాయి పెట్టుబడి పెట్టినా దండుగే.. అన్నట్లుగా రాధాకృష్ణ రోత రాతలు రాస్తున్నాడు.
విశాఖలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఎంపీలతో బాబు లేఖలు రాయించాడు
చంద్రబాబు నాయుడు ఏకంగా తన ఎంపీలతో విశాఖలో ఏ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం కాదంటూ కేంద్రానికి లేఖలు రాయించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న పెట్టుబడిదారులు అంతా కలిసి ఎందుకు విశాఖపై విషం చిమ్మి, కక్ష కట్టారని అడుగుతున్నాం. మీరు వ్యాపారాలు చేసుకోవడానికి విశాఖ కావాలి, మీ వ్యాపార సామ్రాజ్యపు పునాదులు కట్టుకునేందుకు, మీ రాజకీయ అవసరాలకు మాత్రం విశాఖ కావాలి కానీ విశాఖకు మేలు జరిగితే మాత్రం అడ్డుకుంటామంటూ మీరు చేస్తున్న కార్యక్రమాలు సమంజసం కాదని చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చెబుతున్నాం. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకు వచ్చి ఓటు హక్కు అడిగే అర్హతను కూడా చంద్రబాబు నేటితో కోల్పోయాడు.
విశాఖకు టీడీపీ చేసింది శూన్యం -మేలు చేసింది వైఎస్ఆర్, జగన్ గార్లే
చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన పెట్టుబడిదారులు, మీ బినామీలు, మీ సామాజిక వర్గం, అక్కడ ఉన్న 29 గ్రామాలు ప్రజలే తప్ప, మిగతావాళ్లు ప్రజలు కాదా? మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా? ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు కేంద్రం సాయం అందిస్తే, ఆ నిధులు కూడా మీ టెంపరరీ సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్ కోసం దారి మళ్లించి అమరావతిలో ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కాదా?విశాఖపట్నం అభివృద్ధి జరగడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణం. మళ్ళీ ఈ నగరానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది జగన్ మోహన్ రెడ్డి.
మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకుంటే ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలేంటో చెప్పాలి. డా. వైయస్సార్, జగన్ గార్ల ఏడున్నరేళ్ల పరిపాలనలో మాత్రమే ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగిందే తప్ప టీడీపీ అధికారంలో ఉన్న 20ఏళ్లలో జరిగిన మేలు శూన్యం.
రాజశేఖర్ రెడ్డి కుటుంబం కంటే విశాఖకు తామే ఎక్కువ అభివృద్ధి చేశామని టీడీపీ నిరూపించగలిగితే.. రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా వైదొలగుతాను. మరో 25ఏళ్లు రాజకీయ భవిష్యత్ ఉన్న నాయకుడిగా సవాల్ చేస్తున్నాను. వైయస్సార్ గారి కుటుంబం మాత్రమే ఉత్తరాంధ్రకు, విశాఖకు మేలు చేశారు తప్ప, చంద్రబాబు, ఎన్టీఆర్ పాలనలో టీడీపీ చేసిన మేలు ఏంటో సూటిగా సమాధానం చెప్పాలి. మీ హయాంలో మేలు జరిగిందని చెప్పే సాహసం టీడీపీలో ఎవరికైనా ఉందా అని అడుగుతున్నాం. విశాఖలో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. విశాఖ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చింది కూడా జగన్.
కోర్టు తీర్పులను గౌరవిస్తాం.. మూడు అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన వెనకడుగు వేసినట్టు కాదు. కోర్టుల తాలుకా నిర్ణయాలు, తీర్పులను గౌరవిస్తాం. ఈరోజు వచ్చిన తీర్పు, మాకు ప్రత్యేకంగా ఆశ్చర్యం కలిగించే తీర్పు కాదని మా భావన. మూడు రాజధానుల బిల్లును గత అసెంబ్లీ సమావేశాల్లో వెనక్కి తీసుకున్నాం. మూడు అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన వెనకడుగు వేసినట్లు కాదని.. పది అడుగులు ముందుకు వేయడానికే మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామన్న మాటను మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం.
అమరావతి భూముల అభివృద్ధిపై గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. రాజధాని రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇస్తాం. దీనిపై వచ్చిన తీర్పు మాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అయితే ఇదంతా జరగడానికి కుట్ర చేసిన చంద్రబాబు నాయుడును మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ, రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పు 307 పేజీలు ఉంది, పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. సమాజంలో గౌరవం, బాధ్యతగల వ్యక్తులుగా న్యాయస్థానం తీర్పును శిరసావహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు రాజధానుల అంశానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి ఏరకంగా ముందుకు వెళ్లాలనేది ముఖ్యమంత్రిగారు న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళతారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అడ్డుకట్ట వేసిన చంద్రబాబు నాయుడును ఉత్తరాంధ్ర, రాయలసీమ, రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాత్రం సూటిగా చెప్పదలచుకున్నాం.