Suryaa.co.in

Telangana

డిగ్రీ పట్టా తో పాటు నైపుణ్యాలు కావాలి

– హెచ్ సి యు ‘వి సి’ ప్రొఫెసర్ బి . జె రావు
-ఘనంగా నిజాం కళాశాల మూడవ స్నాతకోత్సవం
– గోల్డ్ మెడల్స్ తో పాటు డిగ్రీల పట్టాల ప్రదానం

రవీంద్ర భారతి: విద్యార్థులు డిగ్రీ పట్టాలతో పాటు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నప్పుడే అవకాశాలను అందుకోగలరని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ బాసుత్కర్ జగదీశ్వర్ రావు ( ప్రొఫెసర్ బి . జె రావు ) పేర్కొన్నారు. రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిజాం కళాశాల మూడవ స్నాతకోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ బి . జె రావు మాట్లాడుతూ ఆకాశమే హద్దుగా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఉన్నత అవకాశాలు ఉన్నాయని వాటిని దక్కించుకునే విధంగా విద్యార్థులు కృషి చేయాలని కోరారు. తమకు విద్యను అందించిన విద్యాసంస్థలను, తమ ప్రాంతాన్ని , తల్లిదండ్రులను మరచిపోవద్దని ఆయన విద్యార్థులను కోరారు. ఉన్నత స్థానాల్లోకి ఎదిగిన విద్యార్థులు తమ వంతు బాధ్యతను సమాజం పట్ల చూపాలని సూచించారు.

మరో ముఖ్య అతిథిగా హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ మాట్లాడుతూ విద్యార్థులే భావి భారత నాయకులని, ఆలోచన పరులని, నూతన ఆవిష్కర్తలని పేర్కొన్నారు. అందువల్ల విద్యార్థులు సామాజిక మార్పు కోసం, దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. విద్యతోపాటు వివిధ రంగాల్లో నిజాం కళాశాల పాత్ర ఎంతో చెప్పుకోదగినదని పేర్కొన్నారు.

అలాగే నూతన ఆవిష్కరణలకు, సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో, ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి ఉస్మానియా యూనివర్సిటీ విశేషంగా కృషి చేస్తుందని వివరించారు. నిజాం కళాశాలతో పాటు ఓయూలో పెరుగుతున్న విద్యార్థినిల ( అమ్మాయిలు) సంఖ్యకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి హాస్టల్ వసతితోపాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని వి సి చెప్పారు.

నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. బీమా మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా వివిధ కోర్సులను తమ కళాశాలలో ప్రవేశపెడుతూ ఉత్తమమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. అలాగే కళాశాల ప్రగతి నివేదికను ఆయన ప్రవేశపెట్టారు. వివిధ యూజీ కోర్సుల్లో మెరిట్ మార్కులు సాధించినందుకు గాను 49 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ ఎంపిక కాగా ఇందులో 80% అమ్మాయిలేనని చెప్పారు.

ఇందులో ఒక అమ్మాయి 6 గోల్డ్ మెడల్స్ సాధించిందని పేర్కొన్నారు. ఇక వివిధ యూజీ కోర్సుల్లో కలిపి 520మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందుతుండగా వీరిలో 60 శాతం అమ్మాయిలు 40 శాతం అబ్బాయిలని తెలిపారు. తమ కళాశాల నుంచి అమ్మాయిలే అధిక భాగంగా ఉండడం గర్వంగా ఉందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీమా హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువమంది జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటి లు, సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో సీటు పొందుతున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఓయూ ఎగ్జామ్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ ఎం రాములు, నిజాం కళాశాల ఎగ్జామ్స్ కంట్రోలర్ డాక్టర్ చాంద్ పాషా, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి . ఉపేందర్ రెడ్డి, నిజాం కళాశాల ఎగ్జామ్స్ ఎవల్యూఏషన్ ఆఫీసర్స్ డాక్టర్ పసునూతి మనోహర్, డాక్టర్ ఆవుల ఏడుకొండలు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ యూజీ ( అండర్ గ్రాడ్యుయేట్) కోర్సుల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ముఖ్య అతిథులైన ప్రొఫెసర్ బి . జె రావు, ప్రొఫెసర్ ఎం. కుమార్ లు గోల్డ్ మెడల్స్ ను ప్రధానం చేశారు. అలాగే బి .ఏ, బీకాం , బి బి ఏ, బి సి ఏ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.

LEAVE A RESPONSE