– గిరిజనులకి ఉద్యోగాలిప్పిస్తామంటూ లక్షలు వసూలు చేసిన వైసీపీ నేత
– ఉద్యోగాలు రాకపోవడంతో విక్టర్‌బాబుని నిలదీసిన గిరిజనులు
– అప్పులు చేసి ఇచ్చిన సొమ్ముతో విక్టర్‌బాబు విలాసాలు
– అనంతబాబు అండతో ఏజెన్సీ ప్రాంతాల్లో విక్టర్‌బాబు అరాచకాలు
– గిరిజనులకు న్యాయం చేసి, వైసీపీ నేత విక్టర్‌బాబుపై దర్యాప్తు చేయాలని నారా లోకేష్ డిమాండ్
అమాయక గిరిజనుల్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తోన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరుడు దూడ విక్టర్‌బాబు దందాలపై దర్యాప్తు చేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. మోసపోయిన గిరిజనులు ఆందోళన సమాచారం తెలుసుకుని వారికి న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చెట్లవాడ గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు దూడ విక్టర్ బాబు ఎమ్మెల్సీ అనంతబాబు కీలక అనుచరుల్లో ఒకరని, అనంతబాబు, వైసీపీ పేరు చెప్పుకుని గిరిజనుల్ని మోసగిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు వేయిస్తానని ఏడుగురు గిరిజనుల వద్ద పది లక్షల రూపాయలు వసూలు చేసిన విక్టర్ బాబు..వాళ్లకీ ఉద్యోగాలు వేయించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా దారుణంగా మోసగించారని, దీనిపై కేసు నమోదు చేయాలన్నారు.
నిరుపేద గిరిజనులైన బొజ్జరాయిగూడేనికి చెందిన కాక మహేష్, బొగ్గ లక్ష్మణ్, బొగ్గ రవి, పులి ధర్మయ్య, రేపాకకి చెందిన కరక దారయ్య, రేగులపాడు వాసి సోడే లక్ష్మి, వేగితోటకి పండా అశోక్ ల నుంచి ఒక్కొకరి నుంచి 1.50 లక్షలు చొప్పున దండుకున్న విక్టర్‌బాబు ..మర్డర్‌చేసి డెడ్‌బాడీని డోర్‌డెలీవరీ చేసి పోలీసులతో గౌరవమర్యాదలు పొందిన అనంతబాబులాగే దర్జాగా తిరుగుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యేలు తనకు బాగా తెలుసునని..ఉద్యోగాలు వేయిస్తానని రెండున్నరేళ్లు కాలం వెల్లబుచ్చిన విక్టర్‌బాబు ఇప్పుడు చేతులెత్తేసి డబ్బులు కూడా ఎగ్గొట్టడంతో గిరిజనులు లబోదిబోమంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. కూలీ పనులు చేసుకునే గిరిజనులు ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో 5 రూపాయల వడ్డీకి తెచ్చి విక్టర్ బాబుకి ఇచ్చారని, ఉద్యోగాలు రాక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటామని విలపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి మోసపోయిన గిరిజనులకి వెంటనే వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇప్పించాలని, మోసం చేసిన విక్టర్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.