– ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువు శాసనసభ, శాసన మండలి
– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆ పథకాలపై చట్ట సభల్లో సరియైన చర్చలు జరుపుతున్నాం
– శాసన సభలలో చర్చలు ఉత్సాహంగా ఉండాలి, కానీ ఎప్పుడూ అగౌరవంగా ఉండకూడదు.
– ఇటీవల కాలంలో ప్రజా ప్రతినిధులు వాడే భాష కొంత ఆందోళనకరం
– సభలను ,చట్టాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది
– తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
బెంగళూరు : బెంగళూరులో 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA), ఇండియా రీజియన్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ , లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, చైర్మన్ ఓ యస్ డి గోవర్ధన్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” శాసనసభలు నిజమైన చర్చా దేవాలయాలుగా మారినప్పుడు ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని, శాసనసభ్యులుగా మనం ఒకరినొకరని గౌరవిస్తూ శ్రద్ధగా వినినట్లయితే, విభిన్న అభిప్రాయాలను గౌరవిస్తే ,ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే, ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా వారి ఆకాంక్షలను కూడా నెరవేర్చగలమని ఆయన తెలిపారు. ప్రజా స్వామ్యానికి కేంద్రబిందువు శాసన సభ , మరియు శాసన మండలి సభలని ఆయన అన్నారు.
ప్రజలు తమ ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ కోసం మాట్లాడతారని, వారి ప్రయోజనాలను కాపాడుతారని మరియు రాజ్యాంగ విలువలను నిలబెడుతారని నమ్ముతారు. అయితే, ఇటీవలి కాలంలో, అంతరాయాలు, అర్థవంతమైన చర్చ లేకపోవడం, శాసనసభ కార్యకలాపాలలో గౌరవం లేకపోవడం గురించి పౌరులలో కాస్త ఆందోళన పెరుగుతోందన్నారు.
సభలో చర్చలు ఉత్సాహంగా ఉండాలి, కానీ ఎప్పుడూ అగౌరవంగా ఉండకూడదని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు శాసన సభలు ప్రజల అభ్యున్నతి కోసం, సరియైన చట్టాలను రూపొందించడం కోసం పని చేస్తున్నాయని, శాసన మండలి చైర్మన్ గా సభలో సభ్యులందరి హక్కులను కాపాడుతున్నానని గౌరవంగా తెలుపుతున్నానని ఆయన తెలిపారు.
ఇటీవల సంక్షేమ పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టులు మరియు విద్యా సంస్కరణలపై , బిసి వర్గాల రిజర్వేషన్లు పై అర్ధవంతమైన చర్చలు తెలంగాణ రాష్ట్ర శాసన సభలలో జరిగాయని ఆయన తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ప్రవేశపెట్టబడిన కృత్రిమ మేధస్సు, పరిశోధన, రికార్డుల నిర్వహణ మరియు సమాచారంతో కూడిన చర్చల కోసం సభ్యులకు నిజ-సమయ సమాచారాన్ని అందించడంలో సహాయపడుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని , ఆయ పథకాలపై చట్ట సభల్లో సరియైన చర్చలు జరుపుతున్నామని , ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.