ప్రజాస్వామ్యమా..
నువ్వెక్కడ…
ఉన్నావని తెలుసు..
కాని..ఇంకా బ్రతికి
ఉన్నావో..లేదో తెలవదు..!
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన
భారతావనిలో
నీ ఉనికి కోసం వెతికా..
ఢిల్లీలో..రాష్ట్రాల్లో..
ఎక్కడా తేలని నీ ఆచూకీ..
ఆనవాలైనా మిగలని
నీ వ్యవస్థ..అదెంత అవస్థ!
ప్రశ్నించే హక్కు..
వాక్ స్వాతంత్రం..
ప్రజలే పాలకులు..
ఆ ప్రజల పేరునే పాలన..
ఇలాంటివేగా ప్రజాస్వామ్య
ప్రాథమిక సూత్రాలు..
ఈ దేశం తానే రాసుకున్న
రాజ్యాంగం..ఓ ఉద్గ్రంధం..
ఎప్పటికప్పుడు అధీకరణలు..
నీ కోసం నా కోసం కాదు
పాలకుల సౌకర్యం..
వారి కైంకర్యం..
ఇంకెక్కడి సామాన్యుడి
కలల సాకారం..
శిథిలమైపోయిన
ప్రజాస్వామ్య ప్రాకారం!
నాలుగు స్తంభాలన్నారు..
నాలుగు స్తంభాలాట
ఆడేస్తున్నారు..అడిస్తున్నారు
సమధర్మం,సమన్యాయం
సమసమాజం..
అవి ఎండమావులై..
పాలకులు వాటిని నవ్యంగా
వర్ణించే కవులై..
తిరగ రాసేస్తున్నారు రాజ్యాంగం..
యధేచ్చగా సాగిస్తూ
వీరంగం..!
పెద్దోడు మరీ పెద్దోడై..
పేదోడు ఇంకా పేదోడై..
అన్నట్టు..వాడి పేరే పీడితుడు..
ఉచితాలు నేర్పి..
మందు మప్పి..
వ్యవస్థల్ని ఏమార్చి..
ధర్మాన్ని..న్యాయాన్ని పరిమార్చి…పార్టీలు మార్చి..
రాజ్యాంగానికి పొడిచేస్తున్నారు తూట్లు..
న్యాయవ్యవస్థ కునికిపాట్లు..
మొత్తంగా ఈ దేశంలో
ప్రజాస్వామ్య హననం..
విలువల ఖననం..!
ఇంకెక్కడని వెతకను
నీ కోసం..
నువ్విప్పుడు
కుళ్ళిన శవం..
నీ పేరు చెప్పుకుని
గొప్పలు పోయే ఈ దేశం
వ్యవస్థల శవాల గుట్టలతో
నిండివున్న స్మశానం..!
నా దేశ ఉన్నత ప్రజాస్వామ్యానికి.. పవిత్ర రాజ్యాంగానికి క్షమాపణలతో..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286