• చెట్టుకు మడి గుడ్డ కట్టినంత మాత్రాన “కాయల” దొంగతనం ఆగునా…!
ఓటుకు నోటు పంచేవారు-వాటిని పుచ్చుకునే వారున్నంత కాలం
ప్రజాస్వామ్యపు మనుగడ సాగేనా? ?…
ఇలాంటి టక్కు టమర అవకాశవాద రాజకీయాల నడుమ
ప్రజాస్వామ్యమా నీవు ఎక్కడ?.. నీ జాడ ఎక్కడ? ?
• “నీతి – నీతి” అంటూనే అవినీతిని ప్రవృత్తిగా చేసే యత్నాలు..
అవినీతిని చట్టబద్ధం చేసేస్తే అదే నీతి అవుతుంది”..
ఇది నేటి కొన్ని రాజకీయ పార్టీల తీరు…!
ఇలాంటి దుష్టచతుష్ట రాజకీయ పార్టీల నడుమ
ప్రజాస్వామ్యమా నీవు ఎక్కడ?.. నీ జాడ ఎక్కడ? ?
• “లిక్కర్ స్కాములు… మభ్యపెట్టే స్కీంలు… ఫిరాయింపుదారుల వెనుక స్వాములు”..
మేడిపండు చందాన ఏ రాజకీయ పార్టీ తీరు చూసినా నేడు ఇదే తంతు..!
గురివింద గింజ సైతం సిగ్గుపడే ఇలాంటి రాజకీయ పార్టీల నడుమ
ప్రజాస్వామ్యమా నీవు ఎక్కడ?.. నీ జాడ ఎక్కడ? ?.
• “కూడు, గూడు, గుడ్డ” కల్పన వంటివి రాజకీయ పార్టీల ఒకప్పటి నినాదాలు…
“చుక్క..ముక్క..ప్రలోభత”..అనేవి నేటి రాజకీయ పార్టీల ప్రధాన ఆయుధాలు
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ విషయంలో
“రాజు గారి యజ్ఞానికి పాలు పోసిన చందానే తలపిస్తాయి” ఇలాంటి పరిణామాలు…!
వీరందరి నడుమ ప్రజాస్వామ్యమా నీవెక్కడ… నీ జాడ ఎక్కడ.!!??
• అభ్యుదయ భావాల్ని గాలికి వదిలేస్తున్నాయి ఎర్ర పార్టీలు
దరిమిలా కనుమరుగైపోతున్నాయి “పాలకుల దాష్టీకాలను ప్రశ్నించే గళాలు”…!!
మనుగడ కోసం అవకాశవాద ప్రాంతీయ పార్టీలకు అనుబంధ సంస్ధలుగా
దిగజారడమే దీనికి ప్రధాన కారణం..!
ఇలాంటీ రాజకీయ వైపరీత్యాల నడుమ ప్రజాస్వామ్యమా నీవెక్కడ… నీ జాడ ఎక్కడ??
• సాగు నీరు-త్రాగు నీరు కోసం అంటూ పోరుబాట నాడు
మచ్చుకకైన కనబడవు నేడు వాటి అనామాళ్ళు…!
“డబ్బు, మద్యం పంచని వారిని” నిలదీసే ఘటనలు మాత్రం కోకల్లలు నేడు
నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు..అనేదే వీరందరి వైఖరి…!!
ఇలాంటి విషమ పరిస్ధితుల నడుమ
ప్రజాస్వామ్యమా నీవెక్కడ… నీ జాడ ఎక్కడ??
• “ఫాం హౌస్ నుండి పాలనలు” ఒక్క పక్క….
పబ్లిక్ రంగ సంస్ధలను కార్పొరేట్ సంస్ధలకు
“పప్పుబెల్లలా ధారదత్తం చేస్తున్న పాలకులు” మరోపక్క…!
ఈ పరిణామాలను ప్రశ్నించే వారిపై దర్యాప్తు జాగీలాలను
ఉసిగొల్పి ఘటనలు కొకల్లలుగా…!…
“చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందాన” జరుగుతున్న నేటి పాలనా తీరు ఇది…!!
వీరందరి నడుమ నడుమ ప్రజాస్వామ్యమా నీవెక్కడ… నీ జాడ ఎక్కడ??
• ఓట్లకు నోట్లు కురిపించేవారు ఒకరు…
మద్యాన్ని ఏరులై పారించేవారు ఇంకొకరు…!
వాటిని తీసుకుని ఓటును మాత్రం మాకు వేయ్యండి అంటూ మరికొందరు
ప్రజాసామ్య పరిరక్షణ విషయంలో వీరందరూ “ శాకహార పాత్రదారులే”…కానీ
“బుట్టలోని రొయ్యలు ఏమయ్యాయి” అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న…!
ఈ దుష్టచతుష్టాల నడుమ ప్రజాస్వామ్యమా నీవెక్కడ… నీ జాడ ఎక్కడ??.
• నైతిక నియమాలు అనేవి ఎండమావులే
నేటి సమకాలీన రాజకీయాలలో….!
గెలిచివచ్చేది ఒక పార్టీలో నుండి అయితే…
అధికారాన్ని అనుభవించేది మరొక పార్టీలో…!
తమ వర్గం వారిని “ఉద్దరిస్తామనే తాళింపుతో” ఒకరైతే…
సమాజంపై తమ వారి “ఆధిపత్యంకోసం” రాజకీయాలను చేసేది మరొకరు…!
ఈ విధంగా అవకాశవాద విధానాలకు ఆజ్యం పోస్తున్న నేటి రాజకీయాల నడుమ
ప్రజాసామ్యామా నీవేక్కడ… నీ జాడ ఎక్కడ??
• ఊరు వాడ తగలబడుతూంటే…
“తన ఇంటి మీద నీళ్ళు జల్లుకునే దోరణి” నేటి రాజకీయ పార్టీలది…!
మందిర్ – మసీదు గొడవలు,
ఉన్నవాడు-లేనివాడు అనే అంతరాలు
ప్రాంతీయ వివాదాల వంటి వివాదాలు ఇందుకు తార్కాణాలు
ఇటువంటి తారతామ్యలతో సమాజం నిట్లనిలువునా చీలుతూ ఉంటే
“శవం మీద బొగ్గు ఏరుకునే దోరణిలో” కొన్ని రాజకీయ పార్టీల అవకాశవాద విధానాలు కోకల్లాలు నేడు
ఇలాంటి దోరణిల నడుమ ప్రజాసామ్యామా నీవేక్కడ… నీ జాడ ఎక్కడ??.
• మన రాజ్యాంగం ఘనమైనదే…
దానిని వ్రాసిన వారి అశయాలు ఉన్నతమైనవే..!
….ఎటోచ్చి నేటి అవకాశవాద రాజకీయ నాయకులే
“కడివెడు పాలల్లో విషపు చుక్కలు
గాదెకింద పందె కొక్కులు, ఇంటికి పట్టిన చెద పుట్టలు”…!
పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వాల కూల్చివేతలు, రిసార్ట్ క్యాంపు రాజకీయాలతో
హద్దుమీరి పోతున్నాయి వీరందరి ఆగాడాలు…!
దీనితో మసక బారుతున్నాయి రాజ్యాంగ స్పూర్తి, ఆశయాలు
ఇట్లాంటి రాజకీయ వైపరీత్యాల నడుమ
ప్రజాసామ్యామా నీవేక్కడ… నీ జాడ ఎక్కడ??.
• “శాంతి, సౌఖ్యం, సౌభాత్రృత్వం…” అనేవి మన విధానాలు
కానీ….
“సామాజిక వర్గీకరణ పేరిట సమాజాన్ని విడగొట్టేవాళ్ళు కొందరైతే”….
“ప్రజల్ని మతపరంగా విడగొట్టడమే తమకు రాజకీయ పునాది”…భావించేవారు ఇంకోకరు
“ఉగ్రవాద దాడులకు – ఆధ్యాత్మిక, మతపరమైన సున్నితమైన అంశాలకు మతరంగు పులిమేవారు మరి కొందరు”..
ఈ విధంగా వీరందరు తమ కబంధ హస్తలతో సమాజాన్ని ఒడిదుడికులకు గురిచేస్తున్న ఈ సమయాన
ప్రజాసామ్యామా నీవేక్కడ… నీ జాడ ఎక్కడ??.
• పేరుకు పెద్ద ప్రజాసామ్య దేశం మనది…!
దానికి శాసన, పరిపాలనా, న్యాయ వ్యవస్ధ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అనేవి
మూల వ్యవస్ధలు అంట….!
“బంధు ప్రీతి, మత మూఢత్వం.. ఇసుక మాఫీయా, డ్రగ్స్ మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫీయా,
లాండ్ మాఫీయా, విద్యా, వైద్య వంటి మాఫీయాలు క్యాన్సర్ కారకాల తరహాలో సదరు వ్యవస్థలను వెంటిలెటార్స్ పైకి నెట్టెస్తున్నాయి..!
…… ఇలాంటి తరుణాన ప్రజాసామ్యామా నీవేక్కడ… నీ జాడ ఎక్కడ??.
• ఇలాంటి జాడ్యల నడుమ “రాక్షసంగా జనానికి కీడు తలపెట్టే యంత్రాంగమే రాజకీయం”..అని ఒకరు..
“నిగ్గదీసి అడుగు సిగ్గులేని ఈ జనాన్ని…” అని మరొక మహానుభావుడు ప్రజాసామ్యవాదుల పక్షాన ఏనాడో వెల్లబుచ్చిన ఆవేదనలు కొన్ని కఠోర సత్యాలకు ఎప్పుడు అద్దం పడుతూనే ఉంటాయి…!
