( దివి కుమార్)
మిత్రమా!
ఇది అబద్ధాల ఫ్యాక్టరీ వంటకం అని మీకు తెలియకపోతే మీ లోకజ్ఞానపు స్థాయిని నేను అర్థం చేసుకుంటాను.
దీనిపై చాలా వివరమైన వ్యాసం రాయవచ్చు. ,(33 సంవత్సరాల క్రితం ఇలాంటి వాటిపై నేను ఒక పుస్తకమే రాసి ఉన్నాను) కానీ అబద్ధాల ఫ్యాక్టరీ వ్యూహంలో ఒకటి ఏమిటంటే… చర్చలు ఎప్పుడూ మతోద్వేగాల చుట్టూ, ఉన్మాదాల చుట్టూ తిరిగేటట్లు చేయటం. ప్రజలు ఎదుర్కొంటున్న రోజు వారి జీవన సమస్యలను ఉదాహరణకు నిరుద్యోగాన్ని, అధిక ధరలను, మహిళలపై అత్యాచారాలను , దళితులపై వివక్షలను, రైతాంగపు ఆత్మహత్యలను, విపరీతoగా పెరిగిపోతున్న జీవన అభద్రతను… పెట్రోలు డీజిల్ గ్యాస్ విద్యుత్తు తదితర ఇంధన ధరల పెరుగుదలను… చర్చనీయాంశాల్లోకి రానివ్వకుండా చేయడం.
వినిపించుకోని వారి అబద్ధాలకు జవాబులిస్తూ నా శక్తిని జ్ఞానాన్ని వృధాగా వెచ్చించదల్చుకోలేదు.
మీరు సొంతంగా ఏదైనా రాస్తే దానికి ఖచ్చితంగా జవాబు ఇస్తాను. వివరిస్తాను.
ఇందులోని blatent lies ఒకటి రెండింటితో సరిపుచ్చుతాను.
1. నేను ఒక అబద్ధం చాలాకాలంగా చూస్తున్నాను. అదేమిటంటే చైనాకు వీటో పవర్ రావడం గురించి. ఇంత simple విషయం కూడా తెలియని వాళ్ళు చరిత్ర పాఠాలు మనకు బోధిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పడిన 1945 అక్టోబరు 24వ తేదీ నుండి చైనాకు వీటో పవర్ ఉన్నది. అప్పుడు భారతదేశం బ్రిటిష్ వారి వలస రాజ్యంగా ఉన్నది. అయితే చాలా పెద్ద చైనా దేశంలో, ఒక చిన్న భాగమైన, బహుశా (మనకు శ్రీలంక అంత) తైవాన్ కు, దాన్ని ఏలుతుండే అమెరికా తొత్తు ప్రభుత్వం కొమింగ్ టాంగ్ చైనాకు ఆ వీటో పవర్ ఉండేది.
చైనా ప్రధాన భూభాగం, దాన్ని main land అంటారు, అక్కడ అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఆ దేశ రైతులు ప్రజలు పోరాడుతున్నారు. 1945 నుండి 49 దాకా సాగ ఆ పోరాటం విజయవంతమై అమెరికా వాడు చైనా ప్రధాన భూభాగాన్ని వదిలి పారిపోయేదాకా, అనగా 1949 అక్టోబర్ 1 న చైనా వారికి స్వాతంత్రం వచ్చేదాకా అది సాగింది.
వాళ్లు మొదట జపాన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన సాయుధ పోరాట యుద్ధం చేశారు. పెద్ద చైనాను అమెరికా వాడు 1970ల దాకా అసలు గుర్తించనే లేదు. రాయబార సంబంధాలు కూడా ఉండేవి కాదు. వాడు స్వతంత్ర చైనాను గుర్తించక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు, 1972- 73 కాలంలో, ఐక్యరాజ్యసమితిలో వీటో పవర్ ఉన్న దేశంగా, దానిని అంటే నేటి చైనాను గుర్తించక తప్పలేదు.
చైనా విషయంలో అమెరికా వాడి కుట్రలు ఆ విధంగా వీగిపోయినాయి. వాళ్లు సామ్రాజ్యవాదoతో రాజీ పడకుండా పోరాడి, యుద్ధం చేసి సాధించుకున్న లేక పొందిన అవకాశం అది. భారతదేశానికి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో కూడా ఇప్పటివరకు సభ్యత్వం లేదు.
భారతదేశం 1949లోనే బ్రిటిష్ కామన్వెల్త్ లో ఒక సభ్య దేశంగా చేరింది. ఎవరి నుండి అయితే స్వాతంత్రం పొందామని చెప్పుకుంటున్నారు వారి చంకలోకే తిరిగి చేరింది. వీటో పవర్ సంగతి అలా ఉంచి, కనీసం ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లోనైనా దానికి సభ్యత్వం లేక పోవడానికి కారణం ఏమిటో దేశభక్తి పరులoదరూ నిజాయితీగా ఆలోచించుకోవాలి.
అందుకు ఇంకా కొనసాగుతున్న పరాధీన ఆర్థిక రాజకీయాలు ఒక ముఖ్య కారణం. సామ్రాజ్యవాదులకు ప్రయోజనం బాగా కలిగితే ఒకప్పుడు తైవాన్ కు వీటో పవర్ ఇచ్చినట్లుగా భారతదేశానికి సెక్యూరిటీ కౌన్సిల్లోనైనా అలాంటి అవకాశం రావచ్చు. మనకు లేని అవకాశం చైనా వారికి ఉండటం అనేది నిజంగా ఆందోళన చెందవలసిన విషయమే. అయితే వారు పోరాడి సాధించుకున్నది మనం లొంగుబాటు తనంతో పొందలేకపోయినది అని అర్థం చేసుకోవడమే అసలైన కష్టం. మనకు అసలు కారణాలు తెలుసుకోవడం మీద కంటే ఉడుకు మోతు తనంతో జీవించడం ఒక సరదా!
మన దేశాన్ని అనేక సామ్రాజ్యవాద దేశాలు… అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్ , జర్మనీ… ఇవన్నీ విడివిడిగానే కావచ్చు మన ఆర్థిక రాజకీయాలను ఏదో ఒక మేరకు ప్రభావితం చేస్తూ తర తమ స్థాయిలలో శాసిస్తూ ఉన్న దేశాలే! రేపో మాపో చైనా కూడా ఆ స్థితికి చేరవచ్చు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం చైనా తో జరిపే వాణిజ్యపు మోతాదు పెరుగుతూ వస్తోంది. అంతేకాదు వారి ఎగుమతులు ఎక్కువ మన ఎగుమతులు తక్కువ అంటే చైనా వారికే ఎక్కువ లాభదాయకంగా ఉండే వాణిజ్యం జరుగుతోంది.
(అబద్ధాల ఫ్యాక్టరీలో చైనా వ్యతిరేక ప్రచారం అంతా ఒక బూటకం! పై అసమాన వాణిజ్య స్థితిగతులను మన ఆత్మవంచన మధ్య తరగతి జనాలకు ఉన్మాదమే దేశభక్తిగా భావించే వర్గాలకు తెలియనివ్వకుండా చేయడానికి)
ప్రస్తుతం రష్యా దేశం నుండి చమురు దిగుమతి చేసుకొని, వారికి మన రూపాయలలో ధర చెల్లించటం కాకుండా, చైనా వారి యువాన్ లలో చెల్లిస్తున్నారు.మన పరాధీన స్థితికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఈ పరాధీన దురవస్థకు చింతించని వారు దేశభక్తులుగా చలామణి అవటం ఈ దేశం చేసుకున్న
దురదృష్టం.
2. కాశ్మీర్లో దేవాలయాలు – 50 వేలట- మూసివేతకో విధ్వంసానికో గురైన విషయం
ఎల్ కె అద్వానీ రథయాత్ర సాగుతుండగా 1990..91 లలో , కాశ్మీర్లో 42 హిందూ దేవాలయాలను పడగొట్టారు అని ఆయన ఒక ప్రకటన చేశారు. దానిపై పత్రికల వారు ఆయనను విచారించి ఆ దేవాలయాల పేర్లను, ఊర్లను అడిగి తెలుసుకున్నారు. కొద్ది నెలల తర్వాత ఆయన చెప్పిన దేవాలయాలన్నీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయని Front Line లాంటి పత్రికలలో, దేవాలయాలు ఉండే స్థానికుల ఇంటర్వ్యూలు, ఫోటోలతో సహా పెద్ద అక్షరాలలోనే రాశారు. నేను అప్పుడు చదివాను.
ఏడు సంవత్సరాల క్రితం వెంకయ్య నాయుడు గారు మార్చి 23 నాటి ప్రసంగం ద్వారా, భగత్ సింగ్ వారి బృందం ఉరికంబం పై నుండి వందేమాతరం! భారత్ మాతాకు జై!! అనే నినాదాలు ఇచ్చినట్లు వెలువడిన పత్రికా వార్తను ఖండిస్తూ నేను రాసిన వ్యాసం బహుశా మీ దృష్టికి ఇంతకుముందే తెచ్చినట్లు గుర్తు. ఒకసారి పరిశీలించి చూసుకోండి.
సారాంశం ఏమిటంటే… ఎంత పెద్ద వాళ్ళు అయినా అబద్ధాలు చెప్పటానికి ఇసుమంత కూడా వెరవటం లేదు. ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడు లాంటి వాళ్లే అలా చెబుతుండగా ఇక వారి అనుచర భక్త బృందం అంతకంటే మరేం చేస్తుంది?
ఫిబ్రవరి 14వ తేదీని (వాస్తవానికి అది వాలంటైన్స్ డే) భగత్ సింగ్ ని ఉరి తీసిన దినంగా సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుండి అబద్ధాల ఫ్యాక్టరీ వార్తగా నేను చూస్తూ ఉన్నాను. ఆరంభంలో ఎవరో తెలియని వాళ్ళు అలా రాశారు అనుకునేవాడిని. అబద్ధాలు సృష్టించే ఒక ఫ్యాక్టరీ ఉంటుందనే ఊహ అప్పటికి నాకు లేదు. వాళ్లకు నిజాలు తెలుసుకోవడం మీద ఇసుమంత ఆసక్తి కూడా ఉండదు. తమ సంకుచిత ప్రయోజనానికి తోడ్పడే దేనినైనా వారు ప్రచారంలో పెడతారు.
నిజాలు తెలుసుకోవాలనే సీరియస్ దృష్టి ఉంటే దాదాపుగా గూగుల్లో దొరకటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు పైన నేను రాసిన ఐక్యరాజ్యసమితి – చైనా విషయం పరిశీలించి చూసుకోండి.
అబద్ధాల ఫ్యాక్టరీ వారికి విద్వేష రాజకీయాలను ప్రచారం చేయడమే ఏకైక కార్యక్రమం. అదే వారికి అందించిన మహత్తర దేశభక్తి కర్తవ్యం. అందుకు ఎన్ని అడ్డగోలు వార్తలైనా వారు వండి వారుస్తారు. అవి రాసిన వారి పేర్లు ఉండవు. పొరపాటున వుండినా అవి కూడా Fake అయి ఉంటాయి. వాటిని లొట్టలు వేసుకుంటూ ఆరగించే వారికి, వాటిని కాపీ పేస్ట్ చేయడం ఒక పవిత్ర కర్తవ్యం గా భావించే వాళ్లకు ఆత్మ వంచన, పరవంచనే మిగులుతాయి.
అన్నమాచార్యుడి పదాలలోనూ, రామదాసు కీర్తనలలోనూ, త్యాగరాజు కృతులలోనూ లేని హిందూ అనే పదం అనాదిగా ఉన్నట్లు, అలాంటి మతం కూడా ఒకటి ఏనాటి నుండో ఉన్నట్లు భావించడమే పెద్ద ఆత్మవంచన. అబద్ధాలతో జీవించదలచుకున్న వారికి అవి భ్రమాత్మకమైన సంతోషాన్ని ఇవ్వవచ్చు.
ప్రస్తుతం మణిపూర్ దురాగతాల గురించి పెద్దగా చర్చ జరగనివ్వకుండా చేయడానికి అబద్దాల ఫ్యాక్టరీ వ్యాప్తి చేస్తున్న విద్వేష ప్రచార పోస్టింగుల వ్యూహంలో ఇది కూడా ఒకటి అయి ఉండవచ్చు…
దివికుమార్, 27-7-2023
[27/07, 12:35] xxxxxxxxxxxxxx: Why I am posting to you is I want to know the other side of the coin . I feel you are the best and trust worthy . I don’t know history much …
I know what’s app messages become fake most of the time .
What I believe is at the end of the day Marks shows results …. Like country development, people living standards are more impartant who ever ruled . Tq 🙏🏼
[27/07, 19:24] దివి కుమార్:
ప్రియ మిత్రులు xxxxxx గారికి
జ్ఞానానికి అవధి ఉంటుంది. అజ్ఞానాన్ని కొలవటానికి సరిపోయే పరికరం ఈ భూ ప్రపంచంలో లేదు.
మీరు నాణేనికి రెండవ వైపు తెలుసుకుందామని అంటూ రాశారు.
నాణేనికి రెండు వైపులా ఉండే బొమ్మ – బొరుసు రెండు సత్యాలే. అంటే అర్థం, సత్యం రెండింటి యొక్క కలయికగా ఉంటుంది అని. ఒకటిగా ఉండదు అని. ఉదాహరణకు కరెంటులో ఫేస్ & న్యూట్రల్ అని రెండు వైర్లు ఉంటాయి. ఇందులో ఒకటి మాత్రమే సత్యం కాదు. రెండు కలిసి ఉండటమే సత్యం. అవి రెండూ కలిస్తేనే మనకు విద్యుత్ ప్రసరణ జరిగి వెలుగు వస్తుంది, ఫ్యాన్లు తిరుగుతాయి. విత్తనం రెండుగా ఉంటుంది. ఒక్కటే ఉంటే అది మొలకెత్తదు. దాన్ని సగం విత్తనం అనకూడదు. రెండు కలిసి ఉంటేనే అది అవుతుంది. అంటే ప్రకృతిలో సత్యమే రెండుగా ఉంటుంది అని అర్థం.
పుట్టుక ఎంత సత్యమో మరణము అంతే సత్యం. వెలుతురు ఎంత సత్యమో చీకటి అంతే సత్యం. మీరు అనుకుంటున్నట్లు నిజానికి రెండవ వైపుది అబద్ధం కాదు. నిజం యొక్క మరొక కోణం లేక పార్శ్వం అది. నిజమే రెండుగా ఉంటూ మనకు ఒకటిగా కనబడటం అని దాని అర్థం. ఆదాయం ఎంత సత్యమో వ్యయం కూడా అంతే సత్యం గదా!
మీరు ఏమనుకుంటున్నారంటే అబద్దాల ఫ్యాక్టరీ వారిది ఒకవైపు సత్యం అనీ , నేను రాసేది సత్యం యొక్క రెండవ వైపు అనీ అనుకుంటున్నారు. రెండు వైపులా తెలిస్తేనే కదా అని అబద్ధాన్ని, నిజాన్ని ఒకే తూకంలో కొలుస్తున్నారు. తూకంలో వేరు వేరు రూపాల వాస్తవ వస్తువుల బరువులను రెండు వైపులా ఉంచి తూస్తారు. రెండూ సత్యాలే! అందులో ఏ ఒకటి అబద్ధం కాదు. ఒక వేపన కూరగాయలు ఉంటే రెండవ వైపున తూకం రాళ్లు ఉంటాయి. అందులో ఏ ఒక్కటి అబద్ధం కాదు. రెండూ కలిస్తేనే తూకం అనే నిజం అవుతుంది.
మీరు అబద్ధాల ఫ్యాక్టరీ వారి పోస్టింగులు ఒకవైపు నిజం అనుకుని, నన్ను రెండవ వైపు నిజాన్ని తెలుపమని కోరుతున్నారు.
ఎండమావిలో నీటిని నిజమైన నీటితో కొలిచే ప్రయత్నం ఎంత హాస్యాస్పదం!
అబద్ధాలు అదేపనిగా చెప్పుకుంటూ పోతే అవే నిజం అవ్వవు.
కొంతకాలం అవే నిజమన్నట్లు భ్రమ కలిగించగలుగుతాయి.
వాటిని నమ్మే సమాజమే ఆత్మ వంచనతో ఆత్మహత్యా సదృశ్యంగా మారుతుంది. సాంస్కృతికంగా పతనమై తీరుతుంది.
ఆ మధ్యన అమిత్ షా హైదరాబాద్ వచ్చి, తెలంగాణ విముక్తి కోసం అల్లూరి సీతారామరాజు తన జీవితాన్ని త్యాగం చేశాడు అని చెప్పి వెళ్ళాడు. ఆయనకు ఆ పరిజ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది?
RRR అనే సినిమా నుండి!!
వాళ్లు తీసిన ఒక అభూత కల్పనను ఆయన వాస్తవ చరిత్రగా నమ్మాడు!
ప్రజలు ఎవరూ దానిని నమ్మలేదు. ఆయన చారిత్రక పరిజ్ఞానానికి నవ్వుకున్నారు. అంతే!
అబద్ధాల ఫ్యాక్టరీ వారిని నమ్ముకున్న వారు ఏదో ఒక రోజుకి నవ్వుల పాలవుతారు.