న్యూఢిల్లీ: ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏఐసిసి కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, విధానాలు మరియు రాజకీయ నిర్ణయాలు రూపొందించడంలో డ్రాప్టింగ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. 15 మంది సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీని ఈనెల 24న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేజీ వేణుగోపాల్ ప్రకటించారు.డ్రాప్టింగ్ కమిటీ మొదటి సమావేశం శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఏసిసి కార్యాలయంలో జరగ గా డిప్యూటీ సీఎం హాజరయ్యారు.
కీలక కమిటీలో పార్టీ పట్ల నిబద్ధత, రాజకీయ నైపుణ్యం, అనుభవం, ఉన్నత విద్యావంతుడైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లుకు స్థానం కల్పించారు. ఏప్రిల్ 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది, ఆ తర్వాత ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు గత ఏడాది డిసెంబర్ లో కర్ణాటకలోని బెల గావిలో జరిగిన “నవ సత్యాగ్రహం” సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయని ఎసిసి కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సమావేశాల్లో పార్టీ రాజకీయ మ్యానిఫెస్టో, సంస్థాగత మార్పులు మరియు రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను డ్రాఫ్టింగ్ కమిటీలో చర్చించనున్నారు.
2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నాటి సీఎల్పీ నేతగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా కీలక పాత్ర పోషించారు. జార్ఖండ్ 2024 శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించడంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కమల్లు కీలక పాత్ర పోషించారు.