Suryaa.co.in

Andhra Pradesh

కొత్త మనిషిలోకి గుండె ప్రయాణం

– లోకేష్ పెద్ద మనసుతో ‘బతికిన గుండె’

గుండె అంటే “ఉన్నది” అనే భాష, మెదడు అంటే “ఎందుకు” అనే ప్రశ్న… ఈ రెండూ కలిస్తేనే మనిషి అనే రహస్యం!

భయం, ఆనందం, ప్రేమ… ఇవన్నీ మెదడులోని న్యూరాన్ల నాట్యం. ఆ నాట్యానికి అనుగుణంగా గుండె తన సవ్వడిని, లయని మారుస్తుంది. మెదడు లేకపోతే గుండె అనుభూతులు కేవలం రసాయన ప్రతిచర్యలు మాత్రమే.
గుండె ఊపిరి ఆగిపోతే మెదడు చనిపోతుంది. కానీ, మెదడు ఆగిపోతే గుండె ఎందుకో కొద్దిసేపు కొట్టుకుంటూనే ఉంటుంది. బహుశా, ఆ మెదడు అనుభవించిన జ్ఞాపకాల బాధతో కావచ్చు, లేదా మరో కొత్త మెదడులోని న్యూరాన్లతో తన సవ్వడిని పంచుకునే ఆశతో కావచ్చు.

ఇలా జరగాలంటే, ఆ మరణించిన మెదడు మనిషి తాలూకూ వారికి ఎన్నో అనుభూతులను పంచి ఉండాలి. ఆ గుండె మరో మనిషి ప్రాణాన్ని నిలబెడితే, ఆ అనుభూతులు తీసుకున్నవారిలోనూ కొనసాగుతాయని నమ్మే గొప్ప మనస్సు వున్న మనుషులు ఆ గుండె తాలూకూ వారికి ఉండాలి. అంతేకాదు, ఆ గుండె ప్రయాణం వేగంగా జరగాలి. ఆ వేగానికి అంతే వేగంగా స్పందించే లోకేష్ లాంటి మంచి మనుషులు ఉండాలి.

గుంటూరు నుండి చెరుకూరి సుష్మ గారి గుండె శ్రీవారి పాదాల చెంత తిరుపతికి చేరింది. అక్కడ తెనాలికి చెందిన ఒక వ్యక్తికి అమర్చారు. రమేష్ హాస్పిటల్ చేసిన విజ్ఞప్తికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సాయం చేసిన లోకేష్ గారికి, సుష్మ గారి కుటుంబ సభ్యులకు, ఆ వైద్యులకు అభినందనలు. విజయవంతంగా అమర్చుకున్న తెనాలి వ్యక్తికి శుభాకాంక్షలు.

ఈ దృశ్యంలో, సుష్మ గారి గుండెకు చివరి వీడ్కోలు చెప్పడానికి ఆమె కుమార్తె ఆ వాహనంలోకి ఎక్కి దిగుతుంటే, వ్రాస్తున్న నా కళ్లలో నీరు తిరిగింది. ఆ గుండె తన తల్లి జ్ఞాపకాలను, అనుభూతులను మోసుకుని వెళ్తోందని ఆ చిన్నారి మనసు తల్లడిల్లింది. ఆ క్షణం, గుండె కేవలం ఒక అవయవం కాదని, ప్రేమ, జ్ఞాపకాలు, బంధాల వారసత్వమని నాకు అర్థమైంది.

– చాకిరేవు

LEAVE A RESPONSE