Suryaa.co.in

Editorial

సీఎంఓలో మంత్రుల వేగులు?

  • ఏపీసీఎంఓపై కొందరు మంత్రుల నిఘా?

  • వ్యతిరేకంగా వచ్చే మీడియా క్లిప్పింగుల మేనేజ్

  • ఆయా మంత్రులపై ఫిర్యాదులు వచ్చినా బేఫికర్

  • సీఎం వరకూ వెళ్లకుండా మేనేజ్?

  • పార్టీ ఆఫీసు నుంచి వెళ్లిన ఓ పీఆర్వో చక్రం తిప్పుతున్న వైనం

  • గతంలో వైసీపీ నేత పేరుతో వ్యాసం రాసిన వైచిత్రి

  • ఓ ఐఏఎస్ చొరవతో సీఎంఓలో పీఆర్వో ఉద్యోగం

  • అందరికంటే ముందుగనే పీఆర్వో పోస్టింగ్

  • ఓ యువ ఐఏఎస్ వద్ద పనిచేసే మరో ‘చంటి’ ఉద్యోగి ‘శ్రమదానం’

  • ఓ తూర్పు గోదావరి మంత్రి పేషీ అత్యుత్సాహం

  • పేషీలో ఓ సాధారణ జూనియర్ అసిస్టెంట్ సాహసం

( మార్తి సుబ్రహ్మణ్యం)

సహజంగా మంత్రుల పేషీలు, కార్యాలయాలపై నిఘా దళం ద్వారా సీఎంఓ కన్నేస్తుంటుంది. కానీ ఏపీలో వ్యవహారం ఇందుకు రివర్సు. మంత్రులే సీఎంఓపై కన్నేస్తున్న వైచిత్రి. సీఎంఓకు తమకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులు సీఎం- సంబంధిత శాఖ అధికారికి చేరకుండా.. చివరాఖరకు మెయిల్స్ కూడా మధ్యలోనే మాయం చేసే.. కొత్త సంస్కృతికి తెరలేచిందన్నది ఓ సరికొత్త చర్చ.

పాలన వ్యవస్థను సమన్వయపరచి.. శాసించే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకోవడం, సమావేశాల్లో వారి పనితీరుపై పెదవి విరిచి, పద్దతి మార్చుకోకపోతే మార్చేస్తానని హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. కొందరు మంత్రుల్లో అతి తెలివి పెరిగి, అది ఏకంగా సీఎంఓపైనే నిఘా వేసేంత వరకూ వెళ్లడం ఆశ్చర్యం. అంటే.. తమపై వచ్చే వివిధ ఫిర్యాదులు సీఎం వరకూ వెళ్లకుండా సీఎంఓలోనే సొంత యంత్రాంగం ఏర్పాటుచేసుకోవడం లాంటి ముందుచూపన్నమాట!

ఇది చూడటానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఒక సాధారణ ఉద్యోగి మంత్రి గారి పేషీని శాసించడం ఏమిటి? మంత్రిగారి కుటుంబానికి నమ్మకస్తుడిగా మారడమేమిటని ఆశ్చరపోవచ్చు. ఆ సాధారణ ఉద్యోగి బడా అధికారులను బదిలీ చేయించడం ఏమిటని బిత్తరపోవచ్చు. సీఎంఓలో పనిచేసే వారితో చేతులు కలిపి, తన శాఖ మంత్రికి వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులు ఎలా అడ్డుకుంటారని నోరెళ్లబెట్టవచ్చు. కానీ ఇది నిఖార్సయిన నిజం.

ఇక వివరాల్లోకి వెళితే… ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి పేషీలో పనిచేసే ఓ ఉద్యోగి, చాలాకాలం క్రితం డిప్యుటేషన్‌పై ఆ పేషీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరాడు. ఆ శాఖ కాకినాడ, రాజమండ్రి విభాగాల్లో అతనో సాధారణ ఉద్యోగి. ఎంతోమంది దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి, టీ -కాఫీలు తెచ్చిన వ్యక్తి.. ఇప్పుడే అదే అధికారులను మంత్రి పేషీలో ఉన్న తన చుట్టూ తిప్పించుకుంటున్న వైచిత్రి ఇది.

కనిపించేందుకు ఆయన జూనియర్ అసిస్టెంటే అయినప్పటికీ, చూడ్డానికి స్వాతిముత్యం కమలహాసన్‌లా కనిపించినప్పటికీ.. పేషీలో తెరవెనుక పనులన్నీ అతగాడే చక్కబెడతారన్న విమర్శలు లేకపోలేదు. ఆయా శాఖలోని మూడు, నాలుగు విభాగాల్లో పనిచేసే అధికారులను ఎప్పుడు బదిలీ చేయాలి? ఎవరిని బదిలీ చేయాలి? దాని రేటెంత? అన్నది ‘కొసరు బావగారి’తో కలసి చర్చించి ఖరారు చేస్తారన్న పేరుంది. ఒక్కముక్కల్లో చెప్పాలంటే ‘షాడో మంత్రి’ అన్నమాట! అందుకే ఆ కుటుంబానికి తనలో నాలుకయిపోయారట!!

ఇటీవల గుంటూరులో ఉన్న టుబాకో కంపెనీలకు ‘ప్రభుత్వ ఉత్తర్వుల వెసులుబాటు’ ఇచ్చిన సందర్భంగా వచ్చిన ముడుపులు, ఏదైనా పేలుళ్లు జరిగితే మళ్లీ వాటిని తెరిపించేందుకు దక్షిణ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారట. దానితో అతగాడిపై అందరికీ నమ్మకం పెరిగిన ఫలితంగా, ఇప్పుడు ఆ శాఖలో ‘చక్ర’ం తిప్పే స్థాయికి ఎదిగారట. తన ‘గోదావరి’ తెలివితేటలతో, అందరినీ బోల్తా కొట్టించడంలో నిష్ణాతుడన్న పేరుంది.
అయితే ఇటీవలి కాలంలో మంత్రి పేషీ వ్యవహారాలు మీడియాకెక్కడంతో, అందరి దృష్టి ఆ పేషీపై పడింది. మంత్రి గారి నియోజకవర్గంలో ఆ కథనాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే ‘కొసరు బావగారు’ పేషీలో సేదదీరుతున్నారు. మళ్లీ మధ్యలో ‘రామచంద్రాపురం ఆత్మ’ రాకపోకలు అదనం. అసలు పేషీలో ఏం జరుగుతోందో తెలియని గందరగోళం. ఈలోగా సదరు జూనియర్ అసిస్టెంట్.. తనకు సరిపడని అధికారులపై, తానే ఒక ఆకాశరామన్న ఉత్తరం రాయిస్తుంటాడు. ఫలానా అధికారి ఫలానా సంవత్సరంలో అవినీతికి పాల్పడ్డారుకాబట్టి విచారణ చేయాలని ఆ లేఖలో ఫిర్యాదు చేయిస్తుంటారు.

అవి మంత్రి గారికి చేరిన తర్వాత.. తనకు నచ్చిన మరో అధికారితో విచారణ చేయించి, ఆకాశరామన్న ఫిర్యాదు చేసిన అధికారిని సస్పెండ్ చేయిస్తారు. తర్వాత ఆయన స్థానంలో తాను కోరుకున్న అధికారికి, పోస్టింగ్ ఇప్పించడం సదరు జూనియర్ అసిస్టెంట్ స్పెషాలిటీ. ఆరకంగా ఆ శాఖను, తన సామాజికవర్గానికి చెందిన వారితో నింపేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయం తెలియక ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటున్న మరో వైచిత్రి. చివరకు ఆ ఆకాశరామన్నల పేర్లు, అడ్రసులు కూడా ఒకటే కులానికి చెందిన వారివే కావడం విశేషం.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మతప్రచారం చేయకూడదు. కానీ మంత్రి పేషీలో పనిచేసే ఈ జూనియర్ అసిస్టెంట్ ఏకంగా చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తుండటం విశేషం. పైగా తాను ప్రతి ఆదివారం తన ఎదురుపాక గ్రామ ప్రజలకు వాక్యం చెబుతానని అందరికీ ధైర్యంగా చెప్పడం మరో విశేషం. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆ శాఖలో నష్టపోయిన కమ్మ, బీసీ ఉద్యోగులు, అధికారులు.. చివరకు ఆ కులాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఏజెన్సీలు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోషపడ్డారు. ఎందుకంటే ఐదేళ్లు వారు ఆ శాఖలో తృతీయ పౌరులుగా మిగిలిపోయారు కాబట్టి.

కానీ పాపం టీడీపీ వచ్చిన తర్వాత కూడా, తమ పరిస్థితిలో మార్పు రాలేదని.. జగన్‌ను అమతంగా ప్రేమించే మతానికి చెందిన వారు, మంత్రి పక్కన చేరడమే దానికి కారణమని వాపోతున్నారు. ప్రధానంగా కమ్మ వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ఫ్యాక్టరీ యజమానులు తమను పిండి పిప్పి చేస్తున్న వైనంపై అసంతృప్తితో రగిలిపోతున్నారట.

మంత్రి పేషీపై ఇలాంటి చిల్లర చేష్టలు మీడియాలోకి ప్రముఖంగా రావడంతో పేషీ అప్రమత్తమయింది. నష్టనివారణపై చర్చల తర్వాత.. మంత్రి లోకేష్ వద్దకు వెళ్లి తమను మీడియా బెదిరిస్తోందని ఫిర్యాదు చేద్దామని తీర్మానించిందట. అయితే తమపై మీడియాలో కథనాలు వస్తున్న క్రమంలో.. సీఎంఓలో పనిచేసే ఓ పీఆర్‌ఓను మేనేజ్‌చేయడం ప్రారంభించినట్లు మంత్రి పేషీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ ప్రకారంగా.. విపక్షంలో ఉండగా పార్టీ ఆఫీసులో పీఆర్వోగా పనిచేసి, ఇప్పుడు సీఎంఓలో పీఆర్వోగా చేరిన వ్యక్తి ద్వారా.. తమ శాఖపై మీడియాలో వచ్చిన కథనాలను సీఎం దృష్టికి వెళ్లకుండా, మేనేజ్ చేసే బాధ్యతను సదరు జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకోసం ఇంత శ్రమదానం చేస్తున్నందుకే.. సదరు జూనియర్ అసిస్టెంట్‌కు మంత్రిగారు మొత్తం పేషీని అప్పగించారన్నది జరుగుతున్న ప్రచారం!

సదరు పీఆర్వో.. టీడీపీ విపక్షంలో పార్టీ కార్యాలయంలో పనిచేస్తూనే, గుంటూరు వైసీపీ దళిత నేత పేరుతో ఆర్టికల్ రాస్తూ పట్టుబడ్డాడని, తర్వాత ఓ ఐఏఎస్‌ను ప్రసన్నం చేసుకుని సీఎంఓలో పీఆర్‌ఓగా అందరికంటే ముందే ఆర్డర్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి అప్పటికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు పీఆర్వోలను కూడా అధికారికంగా నియమించకపోవడం, వారికి కాకుండా ఆ ఐఏఎస్ తన దగ్గర ఉన్న వారికి ఆర్డరు ఇప్పించడం వివాదమైన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ పీఆర్వోనే సదరు తూర్పు గోదావరి జిల్లా మంత్రికి వ్యతిరేకంగా వచ్చే కథనాలను.. సీఎం- సంబంధిత అధికారుల వరకూ వెళ్లకుండా, మేనేజ్ చేస్తున్నారన్న ప్రచారం సదరు మంత్రి పేషీలో వినిపిస్తోంది. చివరకు సీఎంఓకు మంత్రికి వ్యతిరేకంగా వచ్చే మెయిల్స్‌ను కూడా డిలీట్ చేసేంత నెట్‌వర్క్ ఏర్పాటుచేసుకోవడం గొప్పనే! బహుశా… తమ మంత్రికి వ్యతిరేకంగా ఏమి రాసినా, అవి సీఎంఓ వరకూ అవి చేరవన్న ధీమాకు అసలు కారణం ఈ ధీమానే కావచ్చు!

ఇక సీఎంఓలో కొత్తగా చేరిన ఒక యువ ఐఏఎస్ దగ్గర పనిచేసే మరో ‘చంటి’ ఉద్యోగి సైతం.. సదరు మంత్రి గారి పేషీకి, నిరంతర ‘శ్రమదానం’ చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. సీఎంఓలో జరిగే విశేషాలతోపాటు, సదరు మంత్రిపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు..తూ.గో.జి మంత్రిగారి పేషీకి చేరవేస్తున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు. అన్నట్లు.. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని, లేచిపోయే వికెట్లలో సదరు తూ.గో.జి మంత్రి ఉన్నారన్న పుకార్లు మొదలైన తర్వాతనే, సీఎంఓపై ఈ తరహా స్పైయింగ్ మొదలయిందట. అదీ సంగతి!

LEAVE A RESPONSE