Suryaa.co.in

Political News

నాయుడే నాయకుడయ్యారు!

(భూమా బాబు)

ఓ స్టూడెంట్ ఇవాళ మద్రాస్ ఐఐటీకి వచ్చాడు..!
గతంలో రావాల్సిన ఆయన, డెబ్బై ఏళ్లకు పైగా వయసులోనూ యువకుడిలా వచ్చాడు.
మండే మద్రాస్ ఎండలు, పార్లమెంట్ సభ్యత్వాల పునర్విభజన, భాషా రాజకీయాల వేడి మద్రాసులో ఉన్నప్పటికీ…
మూడు వేల మందికి పైగా పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు, ఐఐటీ ఫ్యాకల్టీ బృందం లేచి నిలబడి ఘన స్వాగతం పలికారు.
‘మా కార్యక్రమానికి ఎవరిని పిలవాలా అని ఆలోచించినప్పుడు మీ పేరు తప్ప మరో ఆలోచన రాలేదు’ అని ఐఐటీ పాలక అధికారి గర్వంగా చెప్పగానే కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

వచ్చింది నిత్య విద్యార్థి, ప్రపంచ వ్యాప్తంగా గౌరవించే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. దేశంలో వచ్చిన పాలసీలు, వాటి ఫలితాల గురించి ఆయన చెబుతున్నారు. పబ్లిక్ పాలసీల వల్ల 90వ దశకం వరకు దేశం ఎలా నష్టపోయింది, సంస్కరణలతో ఎలా పురోగమించిందో ఉదాహరణలతో వివరించారు.

20 స్కూళ్లు లేని రంగారెడ్డి జిల్లాలో వందకు పైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఎలా వచ్చాయో, దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఎలా సాధించిందో చెబుతుంటే ప్రతి తెలుగువాడి గుండె గర్వంతో నిండిపోయింది.

పాలసీల వల్ల కొన్ని దేశాలు బాగుపడవచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ ప్రజల కోసం ఉత్తమ పాలసీలు తెచ్చే మా రాజకీయ పార్టీని మర్చిపోవద్దని ఆయన అన్నారు.

మీరు ఏది కనిపెట్టినా మా ఆంధ్రప్రదేశ్‌కు రండి. యూజ్ కేసులు, పీఓసీలతో మేము సహకరించి ధ్రువీకరిస్తాం. మీకు అది ప్రపంచ గుర్తింపు తెస్తుంది అని ఆయన చెప్పగానే దేశ వ్యాప్తంగా హాజరైన పరిశోధకుల హర్షాతిరేకాలు మిన్నంటాయి.

ఉత్తర భారత జనాభా ఎక్కువ, మీరు కూడా పిల్లల్ని కనండి. ముఖ్యంగా ఇక్కడి యువతకు చెబుతున్నా. లేదంటే ఉత్తర భారత జనాభా ఇక్కడికి వస్తారు అని సిగ్గుపడుతున్న యువతకు మొహమాటం లేకుండా అర్థమయ్యేలా చెప్పారు.

ప్రపంచంలో భారతదేశం మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుంది. ఎవరికైనా అనుమానాలు ఉంటే వదిలేయండి అని దేశం పట్ల యువతలో గౌరవాన్ని, నమ్మకాన్ని నింపుతుంటే విద్యార్థులు ఆనందంతో, గర్వంగా చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు.

ఐఐటీకి రెండు వందల కోట్లకు పైగా విరాళం ఇచ్చిన తెలుగు దాత పేరును ప్రస్తావిస్తూ విద్యకు ఇచ్చే వితరణతో కలిగే సంతృప్తి సంపాదన కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని దాతృత్వానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తూ అభినందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తయారు చేస్తానని, యువకులు అడిగిన గ్రీన్ ఎనర్జీ నుంచి విద్యలో తెస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి ఓపికగా వివరించారు.

చివర్లో పరిశోధకుల ఆవిష్కరణలను ఆసక్తిగా తెలుసుకుంటానని వెళ్లి, ఆవిష్కర్తలు వివరిస్తుంటే విద్యార్థిలా వింటూ.. సైబర్ కమాండో విద్యార్థులుగా ఉన్న ఆంధ్ర పోలీసులతో కలిసి ఫోటోలు దిగారు.

పాలకులు ఐఐటీలకు వెళ్లడం అరుదు. కానీ నాయుడు లాంటి నిత్య విద్యార్థి వెళితే వారిలో వచ్చే ఉత్సాహం, భవిష్యత్తు పట్ల కలిగే నమ్మకం అక్కడి విద్యార్థుల మొహాల్లో స్పష్టంగా చూస్తుంటే నా భావోద్వేగాన్ని వర్ణించడానికి పదాలు దొరకడం లేదు. ఆంధ్రా అదృష్టం ఈ స్టూడెంట్.

LEAVE A RESPONSE