-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: ప్రజా భవన్‌లో నిర్వహించిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక విషయాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, “లెక్కలు కాదు, ఆత్మ ఉండాలి” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 18,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చేర్చినా, ఇప్పటివరకు వారికి కేవలం 7,500 కోట్ల రూపాయలే చేరాయని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియలో ఆలస్యాన్ని అధిగమించి వేగంగా రైతులకు సహాయం అందించాలని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నందున, రుణమాఫీ, రైతు భరోసా పథకాల ద్వారా పెట్టుబడులకు సాయం చేయాలని తెలిపారు. అలాగే, 24 గంటల ఉచిత విద్యుత్తు, రెండు లక్షల రూపాయల రుణమాఫీ ద్వారా రైతులకు రుణ విముక్తి కల్పిస్తున్నామని, ఇది వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి దోహదం చేస్తుందన్నారు.
పారిశ్రామిక రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని, ఇన్నోవేటివ్ పాలసీలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల అమెరికా, కొరియా పర్యటనలో 36 వేల కోట్ల విలువైన ఎంఓయూలను కుదుర్చుకున్నారని తెలిపారు.
సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమలకు విస్తృత రుణ సౌకర్యాలను అందించి, ఉపాధి కల్పనను ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో బ్యాంకుల సానుకూల పనితీరు శ్లాఘనీయమని, ప్రాథమిక రంగం కింద 40.62% రుణ ప్రణాళికలో లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రం నగదు నిల్వల నిష్పత్తి 127.29 శాతానికి మెరుగుపడడం గమనార్హమని పేర్కొన్నారు.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వరి ఉత్పత్తిలో పెరుగుదలతో ఎఫ్‌సీఐకి ప్రధాన సరఫరాదారుగా తెలంగాణ ఎదుగుతోందని, ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందన్నారు.
రాబోయే క్వార్టర్‌లో బ్యాంకులు నిర్దేశిత రుణ ప్రణాళికను అధిగమించేందుకు కృషి చేస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.