-లిక్కర్కేసును నిర్వీర్యం చేసే కుట్రలంటూ సీనియర్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణ
– లిక్కర్ కేసు నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు సిట్ ఎస్జీపీపై దమ్మాలపాటి ఒత్తిడి
– దానిని నిరూపించేందుకు సిద్ధమే
– జగన్ అనుచరులకు లంచాలకు ఆశపడి లబ్ది చేకూరుస్తారా?
– ఆ రక్తపు కూటితో అతిథులకు వడ్డన చేస్తారా?
– సిట్ ఆఫీసులో దమ్మాలపాటి ఆఫీసు జూనియర్‌కు పనేంటి?
– ఏజీ పదవిని అడ్డుపెట్టుకుని దమ్మాలపాటి దందాలు
– దీనిని నిరూపించేందుకు నేను సిద్ధం
– గవర్నర్, సుప్రీంకోర్టు సీజేకూ ఫిర్యాదుచేస్తా
– సీఎం, మంత్రుల దృష్టికీ తీసుకువెళతా
– దమ్మాలపాటి దందాను ఎమ్మెల్యేలందరికీ లేఖ ద్వారా వివరిస్తా
– తెలంగాణ, మహారాష్ట్ర, ర్నాటక, తమిళనాడు ఏజీలు ఇలాగే వాదిస్తున్నారా?
– ద మ్మాలపాటి మాదిరిగా వాళ్లు వాయిదాలతో కాలం గడుపుతున్నారా?
– వెంటనే దమ్మాలపాటి ఫోన్‌ను సీజ్ చేసి ప్రిజర్వ్ చేయాలి
– పోలీసు అధికారులకు వివి లక్ష్మీనారాయణ సూచన
– దమ్మాలపాటి దందాలన్నీ బట్టబయలుచేసేందుకు రె‘ఢీ’
– ఇది కోట్లాదిమంది రెక్కలకష్టం, కార్యకర్తల త్యాగాలతో ఏర్పడిన ప్రభుత్వం
– దాన్ని దమ్మాలపాటి లాంటి వారి పాలు కానిద్దామా?
– మళ్లీ జగన్‌కు అవకాశం ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకుందామా?
– నా వాదనకు లక్షలాదిమంది కార్యకర్తలు, పార్టీ లాయర్ల మద్దతు
– దమ్మాలపాటితో తాడో పేడో తేల్చుకుంటానన్న ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై తెలుగుదేశం పార్టీ లాయర్లు తిరుగుబాటు జెండా ఎగరవేయడం కలకలం రేపుతోంది. జగన్ జమానాలో ఐదేళ్ల పాటు.. అవిశ్రాంతంగా ఆయన సర్కారు అరాచకాలపై, అలుపెరుగని న్యాయపోరాటం చేసిన వారిలో ఒకరైన ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ.. ఇప్పుడు సొంత పార్టీ నుంచి ఏజీగా నియమితులయిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై, తిరుగుబాటు బావుటా ఎగరవేయడం సంచలనం సృష్టించింది.
ఏజీ పదవిని అడ్డుపెట్టుకుని దమ్మాలపాటి చేస్తున్న దందాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, సీఎం, మంత్రులకు ఫిర్యాదు చేస్తానంటూ తాజాగా లక్ష్మీనారాయణ చేసిన సంచలన వ్యాఖ్యలు, ఇప్పుడు ప్రభుత్వ-రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
లక్ష్మీనారాయణ ఆరోపణలకు మూలకారణ ం.. లిక్కర్ కుంభకోణంపై వేసిన సిట్ దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు దమ్మాలపాటి.. మాజీ సీఎం జగన్ అనుచరుల వద్ద లంచాలు తీసుకుని, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై ఒత్తిడి చేస్తున్నారన్నది ఆయన పేల్చిన బాంబు సారాంశం.
వివి లక్ష్మీనారాయణ.. అన్ని వ్యవస్థలూ ప్రభావానికి లోనయి, విపక్షానికి నిరాశ మిగిల్చిన జగన్ జమానా దారుణాలపై.. కోర్టుల ద్వారా చర్యల కొరడా ఝళిపించిన నాటి వార్తలు చదివి-విన్న వారికి.. ఆరోజుల్లో వాటిని టివి చర్చల ద్వారా తెలుసుకున్న వారికి పరిచయం అవసరం లేని పేరు!
ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు ధైర్యంగా రోడ్డెక్కలేని భయాందోళన సమయంలో.. ఈ టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులే, ధైర్యంగా కోర్టుగుమ్మమెక్కి జగన్ సర్కారుకు ముచ్చెమటలు పోయించారు. అందులో ఒకరు లక్ష్మీనారాయణ, ఆయన సహచరులు మరికొంతమంది.
సూటిగా చెప్పాలంటే.. ఇప్పుడు ప్రభుత్వ పదవులు పొందిన డజన్ల మందిలో ఎవరూ కనిపించని సమయంలో ఓ పది, పదిహేను మంది టీడీపీ న్యాయవాదులే జగన్ జమానాపై న్యాయాస్త్రం సంధించారు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అలాంటి వారితో గంటలపాటు భేటీ అయి, న్యాయసమరంపై సమీక్ష నిర్వహించేవారన్నది తెలిసిందే. విచిత్రంగా ఇప్పుడు.. నాడు బాబుతో భేటీ అయన వారంతా తెరవెనక్కి.. జగన్ జమానాలో పనిచేసిన వారే తెరముందు కనిపిస్తుండటం విచిత్రం. అది వేరే ముచ్చట.
టీడీపీకి ఆ స్థాయిలో అవిశ్రాంత శ్రమదానం చేసిన వివి లక్ష్మీనారాయణ వంటి న్యాయవాదులే ఇప్పుడు.. అదే టీడీపీ ద్వారా అడ్వకేట్ జన రల్ పదవి పొందిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై, తిరుగుబాటు జెండా ఎగరవేయడం విస్మయానికి గురిచేసింది. కొద్దిరోజుల క్రితం సుబ్బారావు అనే న్యాయవాది ప్రదర్శించిన కులంహకారాన్ని ప్రశ్నించిన దళిత న్యాయవాదులు, ఆయనను హైకోర్టు బార్ అసోసియేషన్‌లోనే ఎదిరించి, సీజేకి ఫిర్యాదు చేసిన వైనం కలకలం సృష్టించింది. అదే సమయంలో నాటి వైసీపీ హయాంలో ఉన్న లా ఆఫీసర్లనే ఇప్పటికీ కొనసాగిస్తున్న వైనం కూడా విమర్శల పాలయింది.
అవన్నీ మీడియాకు వచ్చినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ఏజీపై ఎవరెన్ని ఆరోపణలు-ఫిర్యాదులు చేసినా, ఆయనను ఏమీ చేయలేరన్న సంకేతం వెళ్లింది. దానికంటే కొద్ది వారాల ముందు.. దమ్మాలపాటిపై ఆరోపణలు చేస్తూ, 76 పేజీల నివేదికను స్వయంగా సీఎం చంద్రబాబుకు ఇచ్చారు.
సీన్ కట్ చేస్తే.. జగన్ జమానాలో టీడీపీ బాధితుల పక్షాన నిలబడి.. రఘురామకృష్ణంరాజు లాంటి వారిపక్షాన వాదించి.. అర్ధరాత్రి సైతం పోలీసుస్టేషన్లకు వె ళ్లి, నాయకులను విడిపించిన అదే వివి లక్ష్మీనారాయణ.. హటాత్తుగా తన పార్టీకే చెందిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై తిరుగుబాటు చేయడంతో టీడీపీ వర్గాలు ఖంగుతిన్నాయి.
ఆ రక్తపు కూడుతో అతిథులకు విందు ఇస్తారా?
‘‘పాన్ ఇండియా క్రిమినల్ కేసయిన లిక్కర్ స్కాంలో ప్రధాన ముద్దాయిలకు యాంటిసిపేటరీ మరియు రెగ్యులర్ బెయిల్ ఇప్పించుటకు సహకరించాల్సిందిగా సంబంధిత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై అడ్వకేట్ జనరల్ ఒత్తిడి. ఇది వాస్తవం. నిరూపించేందుకు నేను సిద్ధం. 30 వే లమంది కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు. వేలకోట్లు దోచుకున్న జగన్, అతని అనుచరులకు లబ్ది చేకూరిన కేసులో రక్తపు కూటికి ఆశపడి, లంచాలకు ఆశపడి సదరు అడ్వకేట్ జనరల్ గారు ఈవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడటం నేరం. త్వరలో తన కుటుంబంలో జగనబోయే శుభకార్యంలో ఈ రక్తపుకూడుతో అతిధులకు వడ్డన చేస్తారా? ఈ విషయంపై నేను గవర్నర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తాను. దీనిపై తక్షణం ఏజీగారి ఫోనును సీజ్ చేసి, అతని కాల్రికార్డ్సు, వాయిస్ రికార్డ్సును ప్రిజర్వు చేయాల్సిందిగా పోలీసు అధికారులను కోరుతున్నా’’- ఇదీ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ, తాజాగా సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టు.ఇప్పుడు ఇదే ఆటంబాబులా పేలింది.
లిక్కర్ కేసులో వేలకోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన జగన్, ఆయన అనుచరులను జైలుకు పంపించాల్సిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి.. అందుకు విరుద్ధంగా వారికి ప్రయోజనం చేకూర్చేందుకు, సిట్‌పై ఒత్తిళ్లు చేయడం న్యాయధర్మానికే కాదు. నైతికంగా కూడా నేరమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. దమ్మాలపాటిపై ఎంతో నమ్మకంతో ఆ పదవి ఇచ్చిన చంద్రబాబు నమ్మకానికి, దమ్మాలపాటి తూట్లు పొడిచారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.
‘‘ దమ్మాలపాటి వె న్నుపోటు పొడిచింది ఒక్క చంద్రబాబుగారినే కాదు. కోటిమంది టీడీపీ కార్యకర్తల నమ్మకాన్ని. ఐదేళ్లు జగన్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేసిన మా లాంటి వందలాది మంది పార్టీ లాయర్ల పోరాటాన్ని. ఆయన జాతకం అంతా మా దగ్గర ఉంది. నేను ప్రారంభించిన ఈ పోరాటం వెనక ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ లాయర్లు, కార్యకర్తలున్నారు. నేనీమీ పదవులు ఆశించి ఈ పోరాటం చేయడం లేదు. నేను ఇప్పటికే ప్రొఫెషనల్‌గా బిజీగానే ఉన్నా. నా పోరాటం నా కోసం కానే కాదు. ఐదేళ్లు జగన్‌పై పోరాటం చేసి, అన్ని విధాలుగా నష్టపోయిన పసుపు కార్యకర్తల త్యాగాన్ని కాపాడేందుకు. ఇది అందరి చెమట చుక్కలు, కార్యకర్తల రక్తం, చంద్రయ్య లాంటి కరుడుగట్టిన సైనికుల ఆత్మత్యాగాలతో ఏర్పడిన ప్రభుత్వం. దాన్ని దమ్మాలపాటి లాంటి వారు దందాలు చేసుకునేందుకు అనుమతిస్తామా? కష్టపడి గెలిపించుకున్న ఈ ప్రభుత్వాన్ని, నిలబెట్టుకోవడం కూడా మా లాంటి వారి బాధ్యతనే’’ అని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
దమ్మాలపాటి దందాల చిట్టా విప్పుతా
ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్.. ఆయన సహచర, అనుచరుల అక్రమాలు చట్టం ముందు నిరూపించి, వారిని జైళ్లకు పంపించాల్సిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్.. వారిచ్చే లంచాలనే రక్తపుకూటికి ఆశపడి, లిక్కర్ కేసును నిర్వీర్యం చేసి, నిందితులకు బెయిల్ ఇప్పించే స్థాయికి దిగజారడం దారుణమని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పార్టీ.. పార్టీ కోసం ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్న త్యాగధనులను అవమానించడమే. ఒకరకంగా ఇది పార్టీని అమ్మేయడం లాంటిదేనని విరుచుకుపడ్డారు.
పక్కనే ఉన్న కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు అడ్వకేట్ జనరల్స్ ఎవరైనా దమ్మాలపాటిగా ఉన్నారా? వాళ్లంతా కేసులు ఎంత బలంగా బిగిస్తున్నారు? వారెవరైనా దమ్మాలపాటిలా కోర్టులో వాదించకుండా వాయిదాలు అడుగుతున్నారా? ఇప్పటిదాకా ఆయన వాదనతో గెలిచిన ఒక్క కేసు చూపండి. అసలు ఆయన అడ్వకేట్ జనరలా? అడ్జెన్మెంట్ అడ్వకేటా అని సాటి లాయర్లు మమ్మల్ని అడుగుతుంటే మాకే సిగ్గుగా ఉంది.
ఏపిపిఎస్సీ కేసుకు దమ్మాలపాటి ఇప్పటివరకూ ఎందుకు హాజరుకావడం లేదు? అంటే నిందితులకు పరోక్షంగా సాయం చేస్తున్నారా? దమ్మాలపాటి తన కేసుకు సంబంధించి ఢిల్లీలో జగన్ అడ్వకేట్లనే ఎందుకు నియమించుకున్నారు? తెలంగాణ హైకోర్టులో దమ్మాలపాటి ఆఫీసు లాయరు గాలి జనార్దన్‌రెడ్డికి ఎలా బెయిల్ పిటిషన్ వేస్తారు? చెవిరెడ్డికి తెరవెనక సాయం చేస్తుందెవరు? తిరుమల లడ్డు కేసులో నిందితుల తరఫున పార్టీ న్యాయవాదులు వాదించడం వెనక ఎవరున్నారు?
వైసీపీ ప్రభుత్వంలో నియమించిన లా ఆఫీసర్లను దమ్మాలపాటి ఎందుకు తొలగించడం లేదు? అసలు దమ్మాలపాటి సిఫార్సుతో పదవులు పొందిన వారిలో ఎంతమంది విపక్షంలో పార్టీకి పనిచేశారు? ఆ సమయంలో ఈయన ఎప్పుడైనా పార్టీ కోసం కోర్టుకు వచ్చి వాదించారా? ఇవన్నీ సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఏ బంధువుల పేరుతో వ్యాపారాలు చేస్తున్నారు? హైదరాబాద్‌లో ఏం జరుగుతోందన్నది బయటపెట్టేందుకు నేనేమీ భయపడను. ముందు అడ్వకేట్ జనరల్ హోదాను అడ్డుపెట్టుకుని దమ్మాలపాటి చేస్తున్న దందాలను సుప్రీంకోర్టు-హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్, సీఎంకు ఫిర్యాదు చేస్తా. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపిలకు లేఖల ద్వారా వివరిస్తా.
ఇప్పుడు మాలాంటివాళ్లు కొత్తగా నష్టపోయేది లేదు. మేమేమీ ఎవరినీ అడ్డుపెట్టుకుని దందాలు చేయడం లేదు. కోటిమంది కార్యకర్తల రెక్కల కష్టంతో ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుని, మళ్లీ ఆ భూతం రాకుండా ఉండేందుకే మా ఈ పొరాటం. ఇందులో నాతో సహా నా వెనుక ఉన్న న్యాయవాదులు, నాయకులెవరికీ ఎలాంటి స్వార్ధం లేదని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.