– హిందూ ధర్మ పరిరక్షణపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
– కొత్త శివలింగం ప్రతిష్టాపన కూడా శాస్త్రోక్తంగా జరగలేదు
– వైయస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ద్రాక్షారామం. తాడేపల్లి. అనంతపురం: పవిత్ర వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినం రోజున ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని వైయస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో కపాలేశ్వరస్వామి లింగం ప్రదేశం వద్ద ఎవరెవరు ఏమన్నారంటే..:
విగ్రహ ధ్వంసం బాధాకరం: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
శివలింగం ధ్వంసం చిన్న విషయం కాదు. ఇది చాలా సున్నితమైన అంశం. దేవాదాయ అధికారులు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ప్రజల విశ్వాసాలతో నమ్మకాలతో కూడిన అంశం. పోలీసులు నిబద్దతగా పనిచేసి దోషులను పట్టుకోవాలి. ఇంత పురాతన ఆలయంలో విగ్రహం ధ్వంసం జరగడం బాధాకరం.
ఇదేనా సనాతన ధర్మం అంటే?: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో శివలింగం ధ్వంసం అనేది అత్యంత బాధాకరం. పోలీసులు ఈ వ్యవహారాన్ని నీరు గారుస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అనేక చోట్ల ఆలయాలలో భక్తులు చనిపోయారు. ద్రాక్షారామంలో కొత్త లింగం ప్రతిష్టాపన కూడా శాస్త్రోక్తంగా జరగలేదు. సంప్రోక్షణ, శాంతి కార్యక్రమాలు సరిగా చేయకుండానే రాత్రికి రాత్రి మరొక శివలింగం తెచ్చి పెట్టడం దారుణం. ధ్వంసమైన శివలింగానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. హడావుడిగా కార్యక్రమం ఎందుకు చేశారు?. ఊ అంటే సనాతన ధర్మం అంటారు. మరి ఇదేనా సనాతన ధర్మం అంటే?.
హైందవ ధర్మంపై దాడులు పెరిగిపోయాయి : మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
శివలింగం ధ్వంసం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయంలో ఇలా జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించా. రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ద ఇలాంటి ఆలయాలపై లేకపోవడం బాధాకరం. వాడపల్లి ఆలయంలో కూడా ఇలా ఒకాయన డబ్బులు దోచుకున్నాడు, అతను కూడా ఇదే ఆలయం నుంచి వాడపల్లి వచ్చాడని తెలిసింది. తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయాయి. మరి ఇంత జరుగుతుంటే సనాతనం అని మాట్లాడే ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హైందవ ధర్మంపై దాడులు పెరిగిపోయాయి. ఇక్కడ అపచారం జరిగింది, విగ్రహం ధ్వంసం జరిగితే సంప్రోక్షణ చేసి ఆచార వ్యవహారాల ప్రకారం ముందుకెళ్ళాలి కానీ ఇలా హడావిడిగా చేయకూడదు.
మరోవైపు ఇదే అంశంతో పాటు, సింహాచలం ఆలయ పులిహోర ప్రసాదంలో నత్త రావడంపై తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, అనంతపురంలో ప్రభుత్వ మాజీ సలహాదారు (దేవాదాయ శాఖ) జ్వాలాపురం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు.
ఫిర్యాదు చేసిన భక్తులపైనే నాన్‌బెయిలబుల్ కేసులు: లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి
రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో ఆలయాల్లో వరసగా అపచారాలు జరుగుతున్నాయి. ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడంతో పాటు, ప్రత్యర్థులను వేధించేందుకు దేవుడి పేరు వాడుతున్నారు. దీంతో ఆలయాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఆలయాల్లో ఒకటైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పులిహోర ప్రసాదంలో నత్త రావడం అత్యంత బాధాకరం.
ఆలయ అధికారుల పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకుపోతే, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో విషయాన్ని ఆ భక్తులు వెలుగులోకి తీసుకురావడంతో, అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే దేశంలో ఎక్కడా లేని విధంగా, విషయాన్ని ఫిర్యాదు చేసిన భక్తులపైనే పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. అలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని దేవుళ్లు, భక్తుల మీద కూడా ప్రయోగిస్తున్నారు. జరిగిన తప్పును సరి చేసుకోకుండా అధికారులు తిరిగి కేసు పెట్టటం పైశాచికం.
ఆలయాల రక్షణలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం.
– జ్వాలాపురం శ్రీకాంత్. ప్రభుత్వ మాజీ సలహాదారు (దేవాదాయ శాఖ)
రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తోంది. ఆలయాలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం బాధ్యతరాహిత్యంతో వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ద్రాక్షారామంలో ముక్కోటి ఏకాదశినాడు ముక్కంటికి అపచారం జరిగింది. సప్తగోదావరి తీరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోని కపాలేశ్వరస్వామి శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
ఈ ఆలయాన్ని 7, 8 శతాబ్దాల మధ్య చాళుక్య భీముడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అంతటి ప్రాచీన శివాలయానికి కూడా కూటమి పాలనలో రక్షణ కరువైంది. ఎవరో దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేస్తే, అధికారులు హుటాహుటిన కొత్త శివలింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు. కొత్త శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాల్సి ఉంటే, అవేవీ పట్టనట్టుగా ఆలయ అధికారులు వ్యవహరించారు.