-రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి
-సున్నపురాళ్లపల్లిలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ
-కడప జిల్లా అభివృద్ధికి పునాదిరాయి
-జిందాల్ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్
వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లిలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సీఎం జగన్ మరోసారి భూమి పూజ చేశారు. 2019 డిసెంబరు 23న శంకుస్థాపన చేసిన జగన్ మోహన్ రెడ్డి సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత రెండో సారి అంకురార్పణ చేశారు. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సజ్జన్ జిందాల్ ముందుకు రావడం అభినందనీయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. మంచి వ్యక్తి చేతుల్లోకి స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. సున్నపురాళ్లపల్లిలో కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ మరోసారి అంకుర్పారణ చేశారు. ఈ పరిశ్రమ నిర్మాణం 3 మిలియన్ టన్నులతోనే ఆగిపోదని, 13 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌తో పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని వివరించారు.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో సీఎం జగన్ పర్యటించారు. ఎల్. కడప ఉక్కు పరిశ్రమకు నాలుగోసారి శంకుస్థాపన చేశారు. సీఎం హోదాలో జగన్ రెండోసారి శంకుస్థాపన
చేశారు. జేఎస్‌డబ్ల్యూ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ రెండో సారి స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ చేశారు. రూ.8,800 కోట్ల వ్యయంతో పరిశ్రమను నెలకొల్పనున్నారు. కడప ఉక్కు పరిశ్రమకు జిందాల్ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు. పరిశ్రమ వివరాలు సీఎంకు ఛైర్మన్ సజ్జన్ జిందాల్ వివరించారు.
కడప జిల్లా అభివృద్ధికి పునాదిరాయి : జిందాల్ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్
రాష్ట్రంలో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని జిందాల్ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఇది పరిశ్రమకే కాదు. కడప జిల్లా అభివృద్ధికి పునాది రాయని స్పష్టం చేశారు. అయితే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఈసారన్నా పూర్తి అవుతుందా అనే సందేహం అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు ప్రజల్లోను నెలకొంది. 2019లో భూమి పూజ జరిగి శిలాఫలకం వేసిన ప్రదేశంలోనే మరోసారి సీఎం జగన్ భూమి పూజ చేశారు. అయితే ఈ పరిశ్రమకు సీఎం జగన్ భూమి పూజ చేయకముందే అంతకు ముందు రాష్ట్రాన్ని పరిపాలించిన ఇద్దరు ముఖ్యమంత్రులు దీనికి శంకుస్థాపన చేశారు. మొదటి సారి 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే జమ్మలమడుగులో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినా కోర్టు కేసులతో ఆ పరిశ్రమ ఆగిపోయింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. సీఎంగా చంద్రబాబు గెలుపొందిన తర్వాత 2018లో ఇదే జిల్లాలో మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద రాయలసీమ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిశ్రమ నిర్మాణం మరుగునపడింది. అయితే జగన్ తొలిసారి సీఎం అయ్యాక 2019 డిసెంబర్లో సున్నపురాళ్లపల్లి వద్ద కొత్తగా మరోసారి శిలాఫలకం వేశారు. సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ రెండోసారి అదే ప్రాంతంలో భూమిపూజ చేశారు.