• మొగల్తూరు, చెరుకుపల్లి జడ్పీ హైస్కూళ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
• మన బడి – మన భవిష్యత్తు కార్యక్రమంలో పనులు
• మొగల్తూరు పాఠశాలకు రూ.1.71 కోట్లు, చెరుకువాడ పాఠశాలకు రూ.1.49 కోట్లతో ప్రణాళికలు
•ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో పడుతున్న అభివృద్ది అడుగులు
గ్రామాల అభివృద్ధి స్వరూపం మార్చాలనే దృఢమైన సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ నెల 28వ తేదీన మొగల్తూరు, పెనుగొండ గ్రామాల్లో చేపట్టిన గ్రామ అభివృద్ధి సభల ప్రతిఫలాలు వెంటనే కనిపిస్తున్నాయి. రెండు సభల్లోనూ గ్రామస్థులు పాఠశాలలను బాగు చేయాలని కోరారు. దీనికి సంబంధించి అధికారులకు వినతులు అందజేశారు.
ఇందుకు సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ మొగల్తూరు, చెరుకుపల్లి హైస్కూల్స్ అభివృద్ధి అంశం తెలియచేశారు. నారా లోకేష్ దిశా నిర్దేశంతో అధికారులు సత్వరం స్పందించారు. మొగల్తూరు జడ్పీ హైస్కూలు సమగ్ర అభివృద్ధికి రూ.1.71 కోట్లు, పెనుగొండ మండలం, చెరుకువాడ జడ్పీ హైస్కూలు అభివృద్ధి కోసం రూ.1.49 కోట్లతో విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు.
అభివృద్ధి సభలో పాఠశాలలను బాగు చేయాలని ప్రజల నుంచి వినతులు అందిన వెంటనే ‘మన బడి – మన భవిష్యత్తు’ కార్యక్రమం కింద విద్యా శాఖ అధికారులు రెండు పాఠశాలలను సందర్శించి, అక్కడ పెండింగ్ లో ఉన్న పనులు, కావాల్సిన సౌకర్యాలను గుర్తించారు. దీనికి సంబంధించి వెనువెంటనే ఆయా పనులకు ఎంత మేర నిధులు అవసరమవుతాయో ప్రతిపాదనలు సిద్దం చేసి, నివేదికలు పంపారు. త్వరలోనే ఈ రెండు పాఠశాలల్లోనూ అభివృద్ది పనులు మొదలు కానున్నాయి. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ , ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఈ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సహకరించనున్నారు.