విద్య తోనే అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ లోని వెస్లీ బాలుర జూనియర్ కాలేజి గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన, ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో వెస్లీ కళాశాల 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గడిచిన 50 సంవత్సరాలలో ఎంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దిన ఘనత వెస్లీ కళాశాల కే దక్కుతుందని, వీరిలో అనేక మంది రాజకీయ నాయకులుగా, క్రీడాకారులుగా, ఉన్నతమైన విద్యావంతులుగా స్థిరపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసి ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.
వెస్లీ కళాశాల అభివృద్ధి కి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మోసస్ పాల్, ప్రొఫెసర్ విమల్ సుకుమార్, భాస్కర్, చార్లెస్ వెస్లీ, సత్యానందం, జాన్ సుందర్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.