– ఉడికించరా…?
– మారేడుబాకలో ఘటన…
– చిన్నారులకు బాలింతలకు పంపిణీ…
మండపేట:-అంగన్ వాడిలో సరఫరా అయ్యే కోడిగుడ్ల నాణ్యత పై ఎన్నో ఆరోపణలు వస్తూఉంటాయి. వీటిని సరఫరా చేసే కమిషన్ ఏజెన్సీ ల నిర్వాకం ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అనారోగ్యం కలగజేస్తుంది. ఏకంగా ఉడకబెట్టి ఇచ్చిన గుడ్డు లో కోడి పిల్ల ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగినా ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారులు పత్తా లేకపోవడం గమనార్హం.
ఈ గుడ్లు ఘటన మండపేట మండలం మరేడు బాక పరిధిలో పార్వతి నగర్ లో మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు ప్రభుత్వం అంగన్ వాడి పరిధిలో చిన్నారులతో బాటు గర్భిణీ, బాలింత లకు ప్రతి రోజు ఉడకబెట్టిన కోడి గుడ్లు అందిస్తుంది. పౌష్టికాహారం గా పేదలకు ప్రభుత్వం ఇది అందిస్తుంది. దీనికి సంబంధించి ఏజెన్సీ లు గుడ్లు సరఫరా చేస్తాయి. ఈ నేపథ్యంలో మండపేట మండలం మరేడు బాక పంచాయితీ పరిధిలోని పార్వతి నగర్ ఏరియా పెట్రోల్ బంక్ వెనుక వీధిలో సుమారు 30 మంది చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఇంటింటికి వెళ్లి అంగన్ వాడి టీచర్ గుడ్లు అందజేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
వాటిని తీసుకున్న వారు ఆ గుడ్డు పై పెంకు తీస్తే లోపల ఉడికి పోయిన కోడి పిల్ల కనిపించింది. దీంతో తక్షణమే టీచర్ ను నిలదీశారు. దీంతో వెంటనే ఆమె అందరి నుండి గుడ్లు వెనక్కి తీసుకున్నట్లు స్థానిక మహిళలు చెబుతున్నారు. దీనిపై స్థానిక పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా నిల్వ గుడ్లు కావడం తో పిండం మాంసం రూపంలో తయారై పిల్ల గా మారిందని వైద్యులు చెబుతున్నారు.
నిల్వ గుడ్లు తింటే పౌష్టికాహారం మాట అటుఉంచితే లేనిపోని రోగాల బారిన పడటం ఖాయమని పేర్కొన్నారు. వీటిని సరఫరా చేసిన ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై వివరణ కు ప్రయత్నం చేయగా సంబంధించిన ఐ సి డి ఎస్ ప్రాజెక్టు(కపీలేశ్వరపుం) అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధించిన అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.