– హిందూ స్మశాన వాటిక లేదు/.. నీటి సమస్యలు పరిష్కరించండి
– ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ కు ప్రజల విజ్ఞప్తులు
– బత్తలపల్లి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం
– సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్
బత్తలపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపైనే విద్యుత్ బల్బులు వెలగడం లేదని.. స్థానికులు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. బత్తలపల్లి టీడీపీ కార్యాలయంలో శ్రీరామ్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బత్తలపల్లితో పాటు మండలంలోని పలు గ్రామాల వారు తరలివచ్చి శ్రీరామ్ కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇందులో ప్రధానంగా బత్తపల్లిలోని జాతీయ రహదారిలో ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఆర్డీటీ ఆసుపత్రి వరకు వీధి లైట్లు వెలగడం లేదని శ్రీరామ్ కు తెలిపారు.
ప్రతినిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో వెళ్తుంటాయని.. నిత్యం జన సంచారం ఉంటుందని.. ఇలాంటి చోట వీధి లైట్లు వెలగడం లేదన్నారు. దీనిపై పంచాయతీ అధికారులు కానీ, జాతీయ రహదారి వారు కానీ పట్టించుకోవడం లేదన్నారు. అలాగే బత్తలపల్లి మండల కేంద్రంలో 10వేలకు పైగా జనాభా ఉందని.. ఇక్కడ హిందూ స్మశాన వాటిక లేదన్నారు. వేసవి నేపథ్యంలో పలు కాలనీల్లో నీటి సమస్య నెలకొందన్నారు.
ముఖ్యంగా చౌదరి కాలనీ, పాత ఊరిలో నీటి సమస్యలు ఉన్నట్టు తెలిపారు. పలు గ్రామాల్లో భూ సమస్యలపై కూడా శ్రీరామ్ కు అర్జీలు ఇచ్చారు. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అవి పరిష్కారం కాలేదన్నారు. ప్రజలు చెప్పిన అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని శ్రీరామ్ హామీ ఇచ్చారు
మరోవైపు బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన పెరిమోల లోహిత్ కు రూ.25.79వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. లబ్ధిదారుని కుటుంబసభ్యులు శ్రీరామ్ కు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు..