– అభివృద్ధి – సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు
– కళ్ళుండీ చూడలేని కబోదులు వైసిపి నాయకులు
– రూ.3 కోట్ల నిధులతో పూర్తి చేసిన బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత
పరిగి: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ రెండు రంగాలను సమానంగా అభివృద్ధి చేయడం ద్వారానే రాష్ట్రం సమగ్రంగా ఎదుగుతుందని ఆమె పేర్కొన్నారు.
పరిగి మండలంలోని బీజీగాని పల్లి గ్రామంలో రూ.1.9 కోటి, పరిగి హైవే నుంచి తిరుమల దేవరపల్లి గ్రామానికి రూ.1 కోటి, ఫ్రైడేటి రోడ్ నుండి విట్టపల్లి గ్రామంలో రూ.26లక్షలతో నిర్మించిన బీటీ రోడ్లను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ రహదారుల నిర్మాణంతో గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని స్థానికులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మంత్రికి ఘన స్వాగతం పలికారు. దశాబ్దాలుగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు రహదారి నిర్మాణంతో తమ సమస్యలు తీరాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార సమయంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలు రహదారి సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తక్షణమే పనులు ప్రారంభించి, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించామని, ఇచ్చిన మాట ప్రకారం రహదారులు పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.పరిగి మండల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే మండల వ్యాప్తంగా సుమారు రూ.45 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలులో ఉన్నాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు, పరిగి మండలంలో రూ.3 కోట్లతో బీసీ హాస్టల్ నిర్మాణం జరుగుతోందని, త్వరలో మరో రూ.3 కోట్ల నిధులతో SC హాస్టల్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు.అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో రూ.2 కోట్ల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవనం నిర్మాణం జరుగుతోందని, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.
జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. కియా వంటి ప్రముఖ కంపెనీల రాకతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగేలా మరిన్ని పరిశ్రమలను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసినా కూడా వైసీపీ నాయకులు కావాలని విమర్శలు చేయడం దురదృష్టకరమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, అయితే కళ్ళుండి చూడలేని కబోదుల్లా వైసిపి నాయకులు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వైసిపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలు నిజానిజాలను గుర్తించి అభివృద్ధికి అండగా నిలుస్తారని మంత్రి సవిత విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు అధికారుల తదితరులు పాల్గొన్నారు..