Suryaa.co.in

Andhra Pradesh

సీబీఐ అదుపులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అలియాస్‌ దొండ్లవాగు శంకర్‌ రెడ్డిని హైదరాబాదులో బుధవారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆరోగ్య సమస్యలతో రెండు రోజుల క్రితం శివశంకర్‌రెడ్డి హైదరాబాదుకు వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ బృందం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.
అయితే అటు సీబీఐ.. ఇటు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. వివేకా హత్య కేసులో సీబీఐ పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ప్రిలిమినరీ చార్జిషీట్‌లో ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరైన డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి ప్రొద్దుటూరు న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన సీఆర్‌పీసీ 161 వాంగ్మూలంలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వాంగ్మూలం రిపోర్టు ఇతర నిందితుల న్యాయవాదుల ద్వారా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అలియాస్‌ దొండ్లవాగు శంకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఈయన హైదరాబాదుకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడే సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకొని పులివెందులకు తీసుకొస్తున్నట్లు సమాచారం.
లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన దేవిరెడ్డి మల్లారెడ్డి కుమారుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి. చిన్నప్పుడే పులివెందుల పట్టణానికి వచ్చిన శివశంకర్‌రెడ్డి వైఎస్‌ కుటుంబానికి చేరువయ్యారు. పట్టణంలోని సుజాత సినిమా థియేటర్‌ వెనుక వైపున పాల్‌రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమైన వైసీపీ నాయకుల్లో ఈయన ఒకరు.

LEAVE A RESPONSE