– పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి
– పోలీసుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు
– మాచర్ల ఘనపై జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ కు లేఖ ద్వారా పిర్యాదు చేసిన తెదేపా నేత వర్ల రామయ్య
మాచర్ల ప్రాంతంలో శాంతిభద్రతల క్షీణించడానికి పోలీసు డిపార్ట్ మెంటులోని కొంతమంది ఉన్నతాధికారులే కారణం.ఇంటలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, ఎస్పీ రవిశంకర్ రెడ్డి లు అధికార పార్టీ నేతలను సంతోషపెట్టడానికి శాంతిభద్రతలను పణంగా పెట్టారు. పోలీసుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి.అధికారపార్టీతో కొంతమంది పోలీసులు కుమ్మక్కవడంతో రాష్ట్రంలో పౌరుల రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయి.మాచర్ల ఘటనే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
స్థానిక ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి తన ప్రైవేటు గూండాలతో దాడికి పాల్పడ్డాడు.ప్రతిపక్షపార్టీ సభ్యుల గృహాలపై దండెత్తి మహిళలు, పిల్లలు అని తారతమ్యం లేకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇళ్లను తగుబెట్టారు. టిడిపి ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి చేస్తున్న శాంతియుత ర్యాలీపై దాడి చేయడంతో ఈ దుర్మార్గాలకు ఒడిగట్టారు.
ప్రతిపక్షనేతల ఇళ్లల్లోని విలువైన ఆభరణాలు సైతం దొంగిలించుకుపోయారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ ఘోరకలిని చూస్తూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. పోలీసులు కార్డెన్ సర్చ్ చేసిన తర్వాత కూడా వైసీపీ గూండాలు ప్రతిపక్షనేతలపై మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది.
ప్రతిపక్ష పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి మాచర్ల టౌన్ వదిలి వెళ్లాలని హుకుం జారీ చేశారు. గత కొన్ని నెలలుగా ప్రజలు మాచర్లను వదిలి బయటకు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్లలో అధికార పార్టీ నాయకుల ప్రైవేటు గూండాలు 16 మందిని హత్య చేసినా పోలీసులు హంతకులను అరెస్టు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు.మాచర్ల ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నివాసాలు విడిచిపెట్టి జిల్లా హెడ్ క్వాటర్ గుంటూరులో తలదాచుకున్న రోజులు ఇంకా మరిచిపోలేదు.
మాచర్ల ఘటనపై, పోలీసుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరిపి దోషులకు శిక్షపడేలా చూడండి. రాజ్యాంగ విలువలను కాపాడండి. రాజ్యాంగపరమైన తమ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి.