Suryaa.co.in

Telangana

త్వరలో ధరణి ఫైల్స్ విడుదల చేస్తాం

-ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం
-ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్రం నిగ్గు తేల్చాలి
-రాజేందర్ ను బీజేపీ మోసం చేసింది
-రాజేందర్ కు భద్రత పెంచినా… అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదు?
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

“ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోంది. కానీ దీని వెనక పెద్ద మాఫియా దాగుంది. అందుకు సంబంధించి ధరణి ఫైల్స్ ను ఆధారాలతో సహా సీరియల్ గా బయటపెడతాం. దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్న” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ధరణి రూపేణా ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. “ధరణి పోర్టల్ లో బ్రిటిష్ ఐల్యాండ్ కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. ధరణి మొత్తం యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉంది. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ జరుగుతోంది. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయి.. ఇది అత్యంత ప్రమాదకరం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లు. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న వారిలో విదేశీయులు ఉన్నారు. ధరణి పోర్టల్ ఏ దేశ పౌరుడి చేతిలో ఉందో, అతడు ఎలాంటివాడో, దావూద్ ఇబ్రహీం కంటే పెద్ద మాఫియా నాయకుడో, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముకునే డ్రగ్ లార్డో మనకు తెలియదు.

ఈ పోర్టల్‌ ద్వారా మన వివరాలన్నీ విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయి. అనేక చేతులు మారి చివరకు.. ధరణి పోర్టల్‌ బ్రిటిష్‌ ఐల్యాండ్‌ చేతికి వెళ్లింది. ధరణిలోని అనేక లోటుపాట్లను ఆసరాగా తీసుకొని నిషేధిత జాబితాలోని భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్‌ చేసి వెంటనే ప్రొహిబిషన్‌ లాక్‌ చేస్తున్నారు. ధరణి పోర్టల్‌ మొత్తం కేటీఆర్‌ మిత్రుడు శ్రీధర్ గాదె చేతిలో ఉంది.

శ్రీధర్ గాదె వద్ద ఉన్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవొచ్చు, ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద మార్చేయొచ్చు అని వివరించారు. ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించడం, అనంతరం ఆ భూములను బదలాయించడం, ఆ తర్వాత వాటిని లే అవుట్లు వేసి అమ్ముకోవడం… ఈ తతంగం ఇలా నడుస్తోందని రేవంత్ వెల్లడించారు. ధరణి పోర్టల్ సాయంతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని అన్నారు.

దీనికంతటికీ కారకుడు శ్రీధర్ గాదె అలియాస్ గాదె శ్రీధర్ రాజు. హైటెక్ సిటీ ప్రాంతంలో క్వాంటెల్లా అనే సంస్థ పేరిట ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోదండరెడ్డి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనేక భూ అక్రమాలు జరుగుతున్నట్టు ప్రాథమిక వివరాలు రాబట్టింది అని రేవంత్ రెడ్డి వివరించారు.

దేవాదాయ భూములను అక్రమంగా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తానంటే కేసీఆర్‌ భయపడుతున్నారు. ఈ విషయంలో సీఎం.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తాం. కేసీఆర్‌ భూ అక్రమాలను కూడా బయటపెడతాం. ధరణిలో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత బయటపెడతాం. కేంద్రం తలచుకుంటే ధరణి వెనకున్న ఆర్థిక నేరాలను బహిర్గతం చేయొచ్చు’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

గజ్వేల్ లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను చట్టవిరుద్దంగా ప్రభుత్వం గుంజుకుందన్నారు. అమూల్ డైరీకి వందల ఎకరాల కట్టబెట్టారు. మంత్రి గంగుల కమలాకర్ కు భూములు కేటాయించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారన్నారు.

కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపాం. పేదల పక్షాన కాంగ్రెస్ ఉందని చాటే ప్రయత్నం చేసే దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ఈటల రాజేందర్ అన్నను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారు.

రాజేందర్ ను బీజేపీ మోసం చేసింది. రాజేందర్ కు భద్రత పెంచినా… అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారు.. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదు? నా రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం…రాజేందర్ అన్నకు భద్రత ఏర్పాటు చేయడం సంతోషమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ భూమి డిక్లరేషన్
గురువారం గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో భూమి డిక్లరేషన్ విడుదల చేశారు. డిక్లరేషన్ లోని అంశాలు

1. ధరణిలో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ -వ్యవస్థను రద్దు చేసి దీని స్థానంలో భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టి, తప్పులు లేని, అందరికీ అందుబాటులో ఉండే కొత్త కంప్యూటర్ రికార్డును రూపొందిస్తాం. ఇప్పుడున్న రికార్డు సమస్యలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం.
2. నిషేధిత జాబితా లో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోగా తొలగిస్తాం.
3. అన్ని రకాల భూముల సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందిస్తాం. వ్యవసాయ భూములకు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు ఇస్తాం. భద్రమైన హక్కులు కల్పిస్తాం.
4. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే తొలి శాసన సభా సమావేశంలోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మేరకు టైటిల్ గ్యారంటీ చట్టం చేసి ప్రభుత్వమే భూమి హక్కులకు పూర్తి హామీ ఇచ్చే వ్యవస్థను తెస్తాం.
5. వందకు పైగా ఉన్న భూచట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తెస్తాం.
6. కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తాం.
7. కాంగ్రెస్ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన పాతిక లక్షల ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తాం.
8. 2006లో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తాం.
9. కేంద్రం లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తాం. రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించం. అసైన్డ్ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చెయ్యడానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యం లో కమిషన్ ఏర్పాటు చేస్తాం.
10. భూపరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ నుండి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా చేస్తాం.
11. భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం.
.

బీజేపీని, బీఆర్ఎస్ ను వేరుగా చూడొద్దు : రేవంత్ రెడ్డి

“బీజేపీని, బీఆర్ఎస్ ను వేరుగా చూడొద్దు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమం. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలి” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

గురువారం ఇందిరా భవన్ లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఎల్.డి.ఎమ్.. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో రేవంత్ ప్రసగించారు. గాంధీ భవన్ నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలి అని సూచించారు. బీజేపీ, బీఆరెస్ ను ఎదుర్కొనేందుకు శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలన్నారు.

మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందన్నారు. ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అని ఆరోపించారు. రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఓటరు జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్‌ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. బూత్ లు మార్చి ఓటరును గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొవడంలో బూత్ లెవెల్ ఎజెంటే కీలకమన్నారు. ఓటరు జాబితా సరిగా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లే అన్నారు. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలి. 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE