– విజయశాంతి
ధరణి పోర్టల్ సమస్యలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూ ప్రక్షాళన కోసమే ధరణి పోర్టల్ తెచ్చామని కేసీఆర్ గప్పాలు కొట్టారని ఎద్దేవా చేశారు. భూ సమస్యలు తీర్చకపోగా కుటుంబాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టి కోర్టు మెట్లు ఎక్కేలా చేశారని ఆమె విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సమస్యలపై 5 లక్షలకు పైగా దరఖాస్తులు కలెక్టర్లకు వచ్చాయంటే ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో స్పష్టమవుతోందని ఆమె చెప్పారు. ఇదే విషయమై కలెక్టర్లు గగ్గోలు పెడుతున్నా కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర సమగ్ర భూ సర్వే కోసం వందల కోట్ల నిధులు కేటాయించదని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ మాత్రం భూ సర్వేపై ముందడుగు వేయడం లేదని ఆమె విస్మయం వ్యక్తం చేసారు. ఆ నిధులను దారి మళ్లిస్తూ తన కుటుంబానికి, బినామీ సంస్థలకు ఉపయోగపడేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దారని ఆమె ఆరోపించారు.
నిజాం కాలం నాటి భూముల వివరాలు రికార్డుల ప్రకారం ధరణి పోర్టల్‌లో ఎక్కించగా… 40 ఏళ్ళ క్రితం కొనుగోలు చేసిన రైతుల పేర్లు మాయమై అంతకుముందున్న పేర్లు దర్శనమివ్వడంతో పట్టా రైతులు బెంబేలెత్తుతున్నారని విజయశాంతి తెలిపారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూముల రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ పెడచెవిన పెట్టి దళిత, గిరిజన పేద రైతుల ఉసురు తీస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ నిర్వహణ సంస్థపై ఎన్నో మీడియా కథనాలలో ఆరోపణలు వచ్చినా సీఎం కేసీఆర్ మాత్రం ఆ సంస్థకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
భూముల ప్రక్షాళన పేరిట రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి, మోసగిస్తూ వేల కోట్లు దోచుకుంటున్న దగాకోరు ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికల్లో ప్రజలు గద్దె దించడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు.