Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో హిందూ ధర్మపరిరక్షణే లక్ష్యంగా ధర్మ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం

• రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా విజయవాడలో లక్ష్మీ సుదర్శన రాజ శ్యామల యాగం
• ప్రముఖ దేవాలయాల ప్రచార రధాల ద్వారా జిల్లా,మండల కేంద్రాల్లో ప్రచారం
• ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన,నైతిక విలువలను పెంపొందించడమే ప్రచార రధాల లక్ష్యం
• సనాతన ధర్మ రక్షణ,పురాణ ఇతిహాస ప్రాముఖ్యతను సాటిచెప్పడమే ఆశయం
– ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

అమరావతి,21 మార్చి:రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రధాల ద్వారా పెద్ద ఎత్తున ధర్మ ప్రచార కార్యకమాన్నిచేపట్టనున్నట్టు రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.మంగళవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ కమిటీ 3వ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో రోజువారీ జరగాల్సిన నిత్య పూజా కార్యక్రమాలన్నీసక్రమంగా జరగాలని ఆవిషయంలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని స్పష్టం చేశారు.రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవాలయాలకు చెందిన అనగా సింహాచలం,అన్నవరం,ద్వారకా తిరుమల,విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం,శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల ప్రచార రధాల ద్వారా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్నిచేపడు తున్నట్టు చెప్పారు.

ప్రజల్లో హిందూ ధర్మ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను,నైతిక విలువలను పెంపొందించడం,కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ ధర్మప్రచార కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అంశం పైన పురాణ ఇతిహాసాలకు సంబంధించి చిన్నచిన్నపుస్తకాలను ప్రచురించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా వారిలో హిందూ ధర్మ పరిరక్షణపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. ఈ ప్రచార రధాలు ఆయా గ్రామాలు,పట్టణాల సందర్శనకు సంబంధించిన తేదీలు,సమయాలు ముందుగానే తెలియజేసి వివిధ దేవాలయాలు,ఆధ్యాత్మిక సంస్థలు,ఆధ్యాత్మిక వేత్తలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ అధికారులకు సూచించారు.అంతేగాక ప్రతి ప్రచార రధానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఈధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

రాష్ట్ర శ్రేయోభివృద్ధే లక్ష్యంగా అనగా సంపద,రక్షణ,శక్తి పెంపొందాలనే ఆశయంతో విజయవాడలో లక్ష్మీ సుదర్శన రాజ శ్యామల సుదర్శన సహిత మహాలక్ష్మీ యజ్ణాన్ని నిర్వహించాలని సంకల్పించామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఈసమావేశంలో పాల్గొన్న ఆగమ మరియు జ్యోతిష్య పండితుల నుండి పలు సూచనలు,సలహాలను స్వీకరించారు. అదే విధంగా వీడియా లింక్ ద్వారా పెద్ద జియంగార్ పీఠాధిపతి,పుష్పగిరి పీఠాధిపతి తోపాటు టిటిడి ఇఓ ధర్మారెడ్డి పాల్గొని ఈయజ్ణం నిర్వహణకు సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు.ఈయజ్ణం నిర్వహణకు సంబంధించిన తేది,ముహూర్తం తదితర ఏర్పాట్లపై దేవాదాయశాఖతో పాటు సంబంధిత శాఖల సమన్వయం తో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.

ఈసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ హిందూ ధర్మప్రచార కార్యక్రమం,త్వరలో నిర్వహించనున్నయజ్ణం నిర్వహణకు సంబంధించి పలు సూచనలు,సలహాలను అందించారు. ఇంకా ఈ ధార్మిక పరిషత్ సమావేశంలో అర్చకులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, వివిధ ట్రస్ట్ బోర్డుల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు,కారుణ్య నియామకంలో చేరిన వారికి తగిన శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమీషనర్ మరియు కార్యదర్శి హరి జవహర్ లాల్, అదనపు కమీషనర్ రామచంద్ర మోహన్,రీజనల్ జాయింట్ కమీషనర్లు ఆజాద్,భ్రమరాంబ, రాణా ప్రతాప్,సురేశ్ బాబు,సాగర్ బాబు,త్రినాధరావు,చంద్ర శేఖర్ రెడ్డి,డిప్యూటీ కమీషనర్ విజయరాజు,స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రామచంద్ర రావు,ఆగమ పండితులు చక్రవర్తి,ఇంకా పలువురు ఆగమ పండితులు,ఆగమ సలహాదార్లు,ధార్మిక పరిషత్ సభ్యులు,అధికారులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE