-రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
-గార మండలం,కొర్నిలో గడప గడపకు మన ప్రభుత్వం
శ్రీకాకులం: ప్రజాభీష్టం నెరవేర్చడమే ప్రథమ ధ్యేయమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలంలోని కొర్ని గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు, పాలన సంబంధ లోపాలు దిద్దుకునేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరు తెలుసుకునేందుకు అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులు గుర్తించేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది అన్నవి కూడా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తమ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని అన్నారు.
నాణ్యతతో కూడిన చదువు అందించాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం
ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మూడేళ్లయింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం చేసిన పాలన మీద ఐదేళ్లకొకసారి తీర్పు అన్నది ఉంటుంది. ఆ రోజు ఏ కార్యక్రమాలనైతే చేస్తామని చెప్పామో వాటిని అన్నింటినీ నిర్వర్తించేందుకు, అదేవిధంగా హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. అక్షరాస్యత స్థానంలో దేశంలో మనం 22 వ స్థానంలో ఉన్నాం. దీనిని మెరుగు పరిచేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు. అందుకు తగ్గ విధంగా పేద వర్గాలు అందరికీ చదువు, నాణ్యతతో కూడిన చదువు అందించాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం. ప్రజాధనం వృథాకాకుండా సంక్షేమ పథకాల అమలు అన్నది ఆయన ధ్యేయం. ఇవన్నీ ఓట్ల కోసం చేస్తున్న పనులు కావు. భావి తరాలను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ఓ బృహత్తర కార్యక్రమం. చదువుకున్న వారున్న సమాజం కారణంగా దేశం పురోగతి సాధిస్తుంది. ప్రగతి ఫలాలు అందుకుంటుంది అన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వీటిపై విపక్షాలు విమర్శలు చేయడం తగని పని.
టీడీపీ అసత్య ప్రచారం
పథకాల అమలులో లంచగొండితనంకు తావేలేదు. దీనిని చాలా మంది అంగీకరించలేరు కానీ ఇదే వాస్తవం. లక్షా 65 వేల కోట్ల రూపాయలు కేవలం పథకాల అమలుకే మూడేళ్ల కాల వ్యవధిలో వెచ్చించాం. ఇవన్నీ అంగీకరించలేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది. ధరలకు సంబంధించి అసత్య ప్రచారం నిర్వహిస్తోంది. ఒక్కసారి ధరల విషయమై పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూడండి. అక్కడ ఏ మేరకు ధరలున్నాయో ఒక్కసారి అడిగి చూడండి. మన దేశానికి అవసరం అయ్యే వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఫారెన్ ఎక్సైంజ్ ద్వారానే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ధరలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉన్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. అదేవిధంగా పెట్రోల్, డీజిలు రేట్లు దేశమంతటా పెరుగుతున్నాయి. ఇవి కూడా బయట నుంచి వచ్చేవే. ఈ ధరలు కూడా ఒక్కసారి మిగతా ప్రాంతాలతో పోల్చి చూడండి. మాకు ఓటేసినా వేయకపోయినా అన్ని కుటుంబాలకూ అన్నీ వర్తింప జేస్తున్నాం. అంటే సంక్షేమ పథకాల అమలులో వివక్షకు తావే లేదు. నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తే తప్పక ప్రశ్నించండి. ఎందుకు ఓటేశాం అని చెబుతూ నిలదీయండి కానీ వీలున్నంత వరకూ నాణ్యమయిన రీతిలో ప్రమాణాలకు అనుగుణంగా పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి.
మహిళల పేరిట పథకాలు
ప్రతి పథకం వెనుకా సామాజిక దృక్పథం ఉంది. అమ్మ ఒడి ద్వారా 15 వేలు ఇస్తున్నామంటే బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండే విధంగా, కుటుంబ పరిస్థితుల కారణం చదువు అర్ధంతరంగా మానేయకుండా ఉండేవిధంగా చేసిన ఏర్పాటు. ఈ పథకాన్ని ఇప్పటికే మూడేళ్ల పాటు అమలు చేశాం. ఆ రోజు మాకు ఓటేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరువాత ఇచ్చిన మాట తప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి నిధులు విడుదల చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం బాగుంటుందన్న ఒకే ఒక్క ధ్యేయంతో ఇవాళ మహిళ ల పేరిట పథకాలు అందిస్తున్నాం.
2024 నాటికి వంశధార పూర్తి చేస్తాం
2024 వేసవికి వంశధారను పూర్తి చేసి నీరందిస్తామని మంత్రి ధర్మాన అన్నారు. అందుకు తగ్గ విధంగా గొట్టా వద్ద ఎత్తి పోతల పథకాన్ని రూపొందిస్తున్నాం. వంశధార చేరితే ఈ ప్రాంతంలో మూడు పంటలు పండడం ఖాయం. మీ స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ఇరవై లక్షల రూపాయలు సీఎం మంజూరు చేశారు. మీరు ఏం చెబితే ఆ పనులు నెరవేర్చేందుకు కృషి చేస్తాను. అదేవిధంగా ఇంకా ఏమయినా పనులు ఉంటే వాటిని కూడా పూర్తి చేస్తాం అని అన్నారు. గ్రామంలోని సమస్యలపై మంత్రి స్పందిస్తూ, వంశధార ప్రాజెక్టు పూర్తి అయితే బైరి దేసి గెడ్డా టైల్ ఎండ్ కి నీరు అందిస్తాం, త్రాగునీటి కుళాయిలు మంజూరు, గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ పనులు, హై స్కూల్ కి అదనపు తరగతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు, ఎంపిపి గోండు రఘురాం, వైస్ ఎంపిపి బరాటం రామశేషు, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, సర్పంచులు పీస గోవిందరాజులు, మార్పు పృథ్వి, పీస శ్రీహరి, యల్లా నారాయణ, కొయ్యాన నాగభూషన్, బుడ్డా ఎర్రన్న, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, నాయకులు కెప్టెన్ ఎర్రన్న, తదితరులు పాల్గొన్నారు