Suryaa.co.in

Political News

నియంత లెవరూ..విజేతలు కాలేరు

-పుంగనూరు పాకిస్తాన్‌లో ఉందా?
-విపక్ష నేత చంద్రబాబు అక్కడికి వెళ్లకూడదా?
-పోలీసుల అత్యుత్సాహం దేనికి సంకేతం?
-విపక్ష నేతకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల గతేమిటి?
-రోత పుట్టించిన జిల్లా ఎస్పీ వ్యాఖ్యలు
-ముందస్తు అరెస్టులు విపక్ష పార్టీలకే పరిమితమా?
-చంద్రబాబు పర్యటన రోజు వైసీపీ నేతలను ఎందుకు గృహనిర్బంధం చేయలేదు?
-ప్రజాస్వామ్యం పరువు తీసిన పుంగనూరు

తిరుగులేని ప్రజాభిమానంతో అధికారం చేపట్టిన ఇండోనేషియా ఒకప్పటి మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సుహార్తో, ఫిలిప్పీన్సు మాజీ అధ్యక్షుడు మార్కొస్,ఉగాండా మాజీ అధ్యక్షుడు ఈ డీ అమీన్ ,లిబియా మాజీ అధ్యక్షుడు కల్నన్ గడాఫీ మొదలైన వారికి చివరి రోజులు ఎలాగడిచాయో కళ్ళముందు కనిపిస్తున్న సజీవ సాక్ష్యాలు.

కావున అధికారం ఉందని వైసిపి నాయకులు మిడిసిపడవద్దు. అన్నిరోజులు మీవి కావన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తే , మీ పరిస్థితి ఏమిటో ఒక్క సారి ఊహించుకోండి. వైసిపి నాయకుల రాక్షస సంస్కృతి రోజు,రోజుకి విషమిస్తుంది. మూల్యం చెల్లించక తప్పదు. అధికారం శాశ్వతం కాదు. నాకు తిరుగు లేదు,ఎదురులేదు అనుకొని విర్రవీగిన వారు, కాలగర్భంలో కలిసిపోయారు.

ప్రజానీకం తిరగబడితే మహా నియంతలే నేలమట్టం అయిన విషయం గుర్తించండి.అధికార మదంతో కన్నుమిన్ను గానకుండా ఎగిరెగిరి పడుతున్న పిల్ల ఫాసిస్టులు ఎంత? ఒకటో నెంబర్ ఆర్థికనేరస్థుడు పాలకుడై , ప్రజాస్వామ్యాన్ని నుగ్గు,నుగ్గు చేస్తున్నాడు. చట్టం,న్యాయం,ధర్మం,ప్రజాస్వామ్యం,రాజ్యాంగం తో నాకు సంభంధంలేదు.నేను చేసిందే చట్టం, నేను చెప్పిందే వేదం,నేను రాసిందే రాజ్యాంగం అన్న విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు.

ప్రజాస్వామ్య,రాజ్యాంగ విలువలకు వలువలు ఊడపెరకడంలో, జగన్ రెడ్డి ప్రతిభ వెలిగిపోతుంది.ఆంధ్రప్రదేశ్ లో పౌరజీవనం పెను చీకటిలో మగ్గుతుంది. రాజ్యాంగం ప్రభోధిస్తున్న విలువలు కనుమరుగు అయ్యాయి. పౌర హక్కులకు రక్షకులుగా పనిచేయాల్సిన పోలీసులు, అధికార పార్టీ నాయకుల సేవలో తరిస్తున్నారు.

పౌరుల పీక నులమడం నరహంతక, నియంతల నైజం. ఆంధ్రప్రదేశ్ లో నేరగాళ్ల వర్గంగా పోలీసు వ్యవస్థ అప్రదిష్ట మూటగట్టుకొన్నది. దుష్ట శిక్షణ,శిష్ట రక్షణ ఏపీ పోలీసుల నిఘంటువులో మరుగున పడిపోయింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన కొందరు పోలీసులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.

మీరు అధికారంలో ఉన్నారు కనుక పోలీసులు సెల్యూట్ చేస్తారు. .అధికారులు చేతులు కట్టుకొని మీరు చెప్పినట్లు తలలు ఊపుతారు. కొందరు అధికారులు మీరు వేసే బిస్కెట్లకు ఆహా,ఓహో అంటూ భజన చేస్తారు. కానీ ప్రతి పక్షం అలా ఉండదు. ప్రజల పక్షాన నిలుస్తుంది.మీ దోపిడినీ,మీ వైపల్యాలను,మీ అసమర్ధతను,చేతకాని నిలదీస్తుంది. ప్రజా సమస్యల పై పోరాడు తుంది.ప్రతిపక్షం మీ జేబు సంస్థ కాదు.ప్రతిపక్షం మీకు భజన చెయ్యాలనుకోవడం మీ బ్రమ అవుతుంది.

ప్రతి పక్షాలు నోరెత్తకూడదు, సభలు,సమావేశాలు పెట్టుకోకూడదు, సామాజిక మాధ్యమాల్లో తమని ఎవరు విమర్శించకూడదు అనే ఉన్మాదం జగన్ రెడ్డి పాలనలో వికృత రూపం దాలుస్తుంది. చంద్రబాబు జనంలోకి వెళ్ళి ప్రభుత్వ పాపాలను, చేతకాని తనాన్ని జనానికి వివరిస్తే తన కుర్చీ కిందకి నీళ్ళు వస్తాయని, జగన్ రెడ్డి టారెత్తి పోతు చంద్రబాబు పైకి వైసీపీ నాయకులను,పోలీసులను ఉసిగొల్పుతున్నారు.

సాగు నీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో ప్రతి పక్షనాయకుడు చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు, అరాచకానికి దిగి దారుణంగా వ్యవహరించారు.చంద్రబాబు పై దాడి చెయ్యడం, కాన్వాయ్‌లోని కార్లపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయ్యడం.ప్రధాన రహదారిపై కంటైనర్‌ లారీ, వాహనాలు అడ్డుపెట్టడం వంటి చర్యలతో ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఏమిటి?

ప్రజాస్వామ్య దేశంలో ఓ రాజకీయ పార్టీ అధినేత, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పుంగనూరు పట్టణంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? పుంగనూరు భారతదేశంలో భాగం కాదా? వైసిపి నాయకులకు ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తల మీద నాలుగున్నరేళ్లుగా వైసిపి నాయకులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విసిగి పోయి తిరుగుబాటు చేశారు.

నిజానికి పుంగనూరులో రోడ్‌షోకు అనుమతి ఇచ్చి ఉంటే, అరగంటలో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేది కదా? చంద్రబాబు పర్యటన పుంగనూరు మీదుగా ఉందని తెలియగానే వైసీపీ నాయకులు పుంగనూరులోకి చంద్రబాబును అడుగు పెట్టనివ్వం అంటూ ప్రకటించారు. వారిని కట్టడి చేయాల్సిన పోలీసులు, చంద్రబాబు పర్యటన రోజు పుంగనూరు పట్టణంలో వైసీపీ నాయకుల నిరసనకు అడ్డు చెప్పలేదు.
వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నల్ల చొక్కాలు, జెండాలతో నిరసన తెలుపుతున్నా పోలీసులు మాత్రం వారికి రక్షణగా ఉన్నారే తప్ప.. కవ్వింపు చర్యలు వద్దు అని అడ్డు చెప్పలేదు. పోలీసు అధికారులు మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

అంతే కాకుండా వైసిపి వారు ప్రశాంతంగా నిరసన తెలిపారని, ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఎవరికైనా ఉంటుందని ఎస్పీ చెప్పడమే సిగ్గు చేటు. పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలను పోలీసులు శత్రువుల్లా చూస్తున్నారు. లాఠీలతో చావ బాదుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. అందుకే గదిలో పెట్టి కొట్టిన పిల్లి , పులి లా మారిన చందంగా.. తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల తీరుతో విసిగిపోయి తిరగ బడ్డారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించడంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురు తిరిగారు.

పుంగనూరు జాతీయ రహదారిపై టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, గాల్లోకి కాల్పులు జరపడంతో అనేకమంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా కొంత సహనం కోల్పోయారు. పోలీసులపైకి తిరగబడ్డారు. పోలీసులు కూడా వైసీపీ కార్య కర్తల్లా రాళ్లు విసిరారు. చంద్రబాబు కాన్వాయ్‌ లో వెళ్తున్న టీడీపీ కార్యకర్తల పై రాళ్లు, కర్రలు, చెప్పులతో దాడికి దిగి విధ్వంసం సృష్టించారు.

వైసీపీ కార్యకర్తలు.అందుకు టీడీపీ కార్యకర్తలు వారిపై తిరగబడ్డారు. ఎలక్ట్రాని‌క్‌ మీడియా కోసం ఏర్పాటు చేసిన వాహనంలోకి ఎక్కి, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనూ వైసీపీ మూకలు రాళ్ల దాడిని ఆపలేదు. పోలీసులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నమూ చేయలేదు. ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆయనకు రక్షణగా నిలిచారు. సుమారు అరగంట పాటు వైసీపీ నాయకులు ఈ దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు.

పోలీసుల సంపూర్ణ సహకారంతో వైసీపీ కార్యకర్తలు ఇష్టాను సారం భీభత్సం చేశారు. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు పర్యటన అడ్డుకోవడమే లక్ష్యoగా దాడులకు దిగడం అనాగరికం,అమానుషం.చంద్రబాబు తన సొంత జిల్లాలో పర్యటించే హక్కులేక పోతే , ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? పోలీసుల సమక్షంలో చంద్రబాబును అడ్డుకొంటుంటే, దాడులు దిగుతుంటే పోలీసులు వున్నది ఎవరికోసం?నిలువరించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?ఎన్నాళ్ళు రాక్షస పాలనకు నిర్బందాలకు,విధ్వంసానికి పోలీసులు సహకరిస్తారు?

హింసకు తావు లేకుండా వారి హక్కును వినియోగించుకునేలా తోడ్పాటు అందించడం పోలీసులు భాధ్యత కాదా? అధికార పార్టీ నాయకులు ఆడమన్నట్లు పోలీసు వ్యవస్థ ఆడటం వల్లనే , రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలిలో దీపం అయ్యాయి. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు పై రాళ్ళ దాడి చేస్తుంటే ఆయన భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా పెట్టి, చంద్రబాబుకు రక్షణ కల్పించారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి,చంద్రబాబుకు పెరుగుతున్న ఆదరణను చూసి జగన్‌రెడ్డి తట్టుకోలేక, ఫ్రస్ట్రేషన్‌తో ఇలాంటి మరగుజ్జు దాడులు చేయిస్తున్నారు.

రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ అధికార పార్టీకే ఉంటాయి.వాళ్ళే ప్రతి పక్షాల పై దాడి చేస్తారు. వాళ్ళే బందులు చేస్తారు. వాళ్ళే ప్రతిపక్షాల పై కేసులు పెడతారు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఎలాంటి హక్కులుండవు. అదే ప్రతిపక్షాలు బంద్ కి పిలుపు ఇస్తే మాత్రం, ముందు రోజురాత్రే పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు. జగన్ రాసిన రాజ్యాంగం అమలు అవుతుంది.

చిత్తూరు జిల్లాలో తంబళ్ళ పల్లె ,పుంగనూరు నియోజక వర్గాల్లో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు పర్యటనలో వైసిపి నాయకులు,పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి విధ్వంసకాండకు తెగబడటం దారుణం. పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సామ్రాజ్యం అన్నట్లు.. చంద్రబాబును అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనం. మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా, తెలుగుదేశం కార్యకర్తలల్ని చావ బాదిన వారే బంద్ కి పిలుపు ఇవ్వడం సిగ్గుచేటు.

పోలీసుల సహకారంతో బంద్ జరిపించి ప్రజాజీవనాన్ని స్తంభింప చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పై వారి ఆదేశానుసారం, పోలీసులు ప్రత్యేక అజెండా అమలు పరుస్తున్నారు.
రాష్ట్రంలో ఎంపిక చేసిన కొందరు పోలీసులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.కావునా ప్రజానీకం తిరగబడితే మహ నియంతలే నేలమట్టం అయిన విషయం గుర్తించండి. అధికార మదంతో కన్నుమిన్ను గానకుండా ఎగిరెగిరి పడుతున్న పిల్ల ఫాసిస్టులు ఎంత?

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

LEAVE A RESPONSE