రెడ్డి నాయకులు ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శించలేదే?

-ఈ ప్రభుత్వం మారితే… ఇంతకంటే రెట్టింపు సంక్షేమం
-సంక్షేమంతో పాటు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ది సాధ్యం
-చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే మనకెందుకు ఉలుకు
-ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల చేత తిట్టించడం ఎందుకు?
-మీ రంగు సిద్ధాంతం తప్పు
-ఈ అ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలన్నదే పవన్ లక్ష్యం
-ముసుగు వేసుకున్నది ఎప్పుడు?… ఇప్పుడు ముసుగు తొలగడానికి??
-పొత్తులపై సకాలంలో స్పష్టత ఇస్తామని ఇరువురు స్పష్టం చేశారు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఒకవేళ ఈ ప్రభుత్వం మారితే, అధికారంలోకి రానున్న ప్రభుత్వం ఇంతకంటే రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు . ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలలో అణా, కాని కూడా ఎవరికి తగ్గదనేది సుస్పష్టం… ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు మార్జిన్ మనీ అందజేసి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకు , రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే, ఈ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలి. ఎలుకల్లా అధికారంలోకి వచ్చినవారు, ప్రస్తుతం పందికొక్కుల్లా మారి ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

పతనం అంచున పోలీస్ ప్రభుత్వం
పతనం అంచుల్లో పోలీసు ప్రభుత్వం ఉన్నదని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. గతంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ని, మాస్క్ పెట్టుకోలేదని మరొక వ్యక్తి ని ఈ పోలీసు ప్రభుత్వం హత్య గావించింది. అధికార పార్టీ ఎంపీని పోలీసు కస్టడీలో చితకబాదడం ద్వారా, పోలీసుల దమన కాండ పరాకాష్టకు చేరుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ఇప్పుడు 1861 పోలీసు చట్టానికి వక్ర భాష్యం చెబుతూ చీకటి జీవోను తీసుకువచ్చారు. తమ పార్టీ నాయకత్వం ర్యాలీలు నిర్వహించిన ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ర్యాలీలను నిషేధిస్తూ జీవో నెంబర్ 1 ని జారీ చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఆరు నూరైనా ఈ జీవో మారదని పేర్కొన్నారు. జీవో మారకపోతే ఈ ప్రభుత్వమే మారిపోతుంది. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, న్యాయస్థానమే ఈ జీవోను కొట్టివేస్తుంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఆగడాలని ఇంకా భరించే స్థితిలో లేరని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఈ ప్రభుత్వం సమాజానికి ఇస్తున్న సంకేతం ఏమిటి?
ప్రధాన ప్రతిపక్ష నేత, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఏడుసార్లు కుప్పం నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చంద్రబాబు నాయుడుని ఆయన నియోజకవర్గంలోకి వెళ్లనివ్వకుండా రోడ్డుపైనే కూర్చోబెట్టి స్థాయికి పోలీసు గూండాలు దిగజారారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం ఉంటుందా?. ప్రధానమంత్రి పర్యటన లో పాల్గొనే వారి జాబితా నుంచి ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరునే తొలగించామని, ఆయన్ని నియోజకవర్గంలోనే అడుగుపెట్టనివ్వలేదని తమ పార్టీ నేతలు భావిస్తున్నారు. విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హోటల్ గదికే పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్డు షో కోసం వినియోగించే వాహనాన్ని సీజ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం సభ్య సమాజానికి ఇస్తున్న సంకేతం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులతోనే ఎందుకు మాట్లాడించారు?
ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల తోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇవే మాటలను రెడ్డి నేతల చేత ఎందుకు మాట్లాడించలేదని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారు స్పందించలేదు. ముల్లులు ముళ్ళు తోటే తీయాలంటే, ఒక కులం వారిని ఆ కులం వారిచేతనే తిట్టించడం కాదు. మొన్న ఒక మహిళను ఎవరినో మీటింగు రమ్మని అడిగితే… వారు ఆలస్యం అవుతుందని పేర్కొనగా , మా పార్టీ వారు డైపర్లు వేసుకోవాలని సదరు మహిళను అపహస్యం చేశారట. ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించగానే ఇప్పుడు మా పార్టీ వాళ్లు డైపర్లు వేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో నిన్నటి నుంచి డైపర్లకు డిమాండ్ పెరిగిందట. ఎస్సీ, ఎస్టి, బీసీ నాయకుల చేత పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడించడం ద్వారా ఆయన్ని కవ్వించాలని మా పార్టీ నాయకత్వం చూసింది. జన సైనికులు చదువు సంస్కారం ఉన్నవారు కాబట్టి, గతంలో మా పార్టీ వాళ్లు అతిగా స్పందించినట్లుగా స్పందించడం లేదు. టిడిపి నాయకుడు ఒకరు ప్లోలో అన్న మాట కు వారి పార్టీ ఆఫీస్ పై మా పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. తమ నాయకుడిని అంటే అభిమానులు ఊరుకుంటారా? అని గతంలో ముఖ్యమంత్రి జగనే అన్నారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎంతో ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ ను అంతకంటే ఎక్కువగానే అంటున్న ఆయన అభిమానులు ఊరుకుంటున్నారు. సభలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడి, పరదాల మాటుకు వెళ్లిపోతారని, జెడ్ కేటగిరి సెక్యూరిటీ కలిగిన ఆయన్ని ఎవరూ తాకలేరు. కానీ ఇతర నాయకుల పరిస్థితి ఏమిటి? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

భయం లేదంటూనే చలి జ్వరం వణికి పోతున్నారు
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిస్తే మాకేంటి అంటూనే తమ పార్టీ నాయకులు, చలి జ్వరం తో వనికి పోతున్నారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. మరి పేపర్లో ఎందుకురా ఇన్ని స్టేట్మెంట్లు అంటూ ప్రశ్నించారు. ఎలుకలు పందికొక్కులు కలిస్తే మాకేంటి అని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తీరు లో ఏమాత్రం లాజిక్ లేదు. ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందని అనడం హాస్యాస్పదం. యధా ముఖ్యమంత్రి , తథా సలహాదారు అన్నట్టుగా ఉంది. ఎరుపు, పసుపు కలిస్తే కాషాయం తయారు అవుతుంది. ఎరుపు, పసుపు కలిస్తే కాషాయం తయారవుతుందని సజ్జల పొరబడ్డారు. జనసేన ఒకపక్క బీజేపీతో సంసారం చేస్తూనే, టిడిపి తో వ్యవహారం చేయడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. దానికి జన సైనికులు సోషల్ మీడియాలో స్పందిస్తూ… బిజెపితో మాది వైవాహిక సంబంధం అంటున్న వారే, మాతో వైవాహిక సంబంధంలో ఉన్న వారితో అనైతిక సంబంధం నెరపడం ఎంతవరకు సబబు… సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తనని అడుగుతుండడంతో, ఈ అక్రమ సంబంధం నిజమేనా? అని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించి తెలుసుకుంటానని చెప్పాను. కాషాయం ప్రాపకం కోసం అనునిత్యం ఢిల్లీ వీధుల వెంట తిరుగుతూ, బ్రతిమాలు కొని కేసులను వాయిదా వేయించుకుంటూ, ఆ పార్టీని విమర్శించడం అనైతికమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ముసుగు వేసుకున్నది ఎప్పుడు?
తెలుగుదేశం పార్టీ, జనసేనల ముసుగు తొలగిందని మంత్రులు, తమ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమని రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు నివాసానికి, పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించడం జరిగింది. పొత్తుల గురించి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతామని వారిరువురూ స్పష్టం చేశారు. మేము ముందే చెప్పాము ముసుగు తొలగిందని తమ పార్టీ నాయకులనడడం వారి అజ్ఞానానికి నిదర్శనం. ముసుగు వేసుకున్నది ఎప్పుడు… ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని గతంలోనే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను తమ పార్టీ నేతలే ఎన్నోసార్లు కవ్వించాలని చూశారు. వాళ్లు వీళ్ళ చేత వాగించిన, ఆయన స్థిత ప్రజ్ఞుడు, తన లక్ష్యం ఏమిటో తెలిసిన వాడు కాబట్టే ఈ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని నిశ్చయించుకున్నారు. తాత్కాలికంగా పక్కన పెట్టడం కాదని, ప్రజాస్వామిక విధానాలను అవలంబించే వారిని శాశ్వతంగా సమాధి చేయాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఒక్క సినిమా చేస్తే 100 కోట్లు… మామూళ్లు అడుక్కోవలసిన అవసరం ఆయనకు ఏమిటి?
ఒక్క సినిమాలో నటిస్తే పవన్ కళ్యాణ్ కు 100 కోట్ల రూపాయలు పారితోషికం రూపంలో వస్తుందని, ఆయన వాళ్లను వీళ్లను మామూలు అడుక్కోవలసిన అవసరం ఏముందంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన ఎటువంటి త్యాగాన్ని చేస్తున్నారో అర్థం చేసుకోకుండా అడ్డమైన ట్విట్ల ను పెడుతున్నారు. ఎవరినైతే తమ పార్టీ నాయకత్వం అవమానించాలని చూస్తుందో, అది రివర్స్ అవ్వడం ఖాయం. కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ను పరిమితం చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై పిచ్చి పిచ్చి కామెంట్ల ద్వారా లేని కాపు సామాజిక వర్గాన్ని మనకు ఉన్నది అనుకుంటున్నట్లుగానే, మనకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉందని పార్టీ నాయకత్వం గ్రహించాలి. అమ్మ ఒడి ద్వారా నిధులు ఇస్తున్నామని చెప్పి, ఎస్సీ కార్పొరేషన్ నిధులను స్వాహా చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక గందరగోళ పరిస్థితుల వల్ల ఒక కాంట్రాక్టర్ తనకు రావలసిన నాలుగు కోట్ల బిల్లులు రాకపోవడంతో, తన మేనత్త ఇంట్లోనే దొంగగా మారినట్టు తెలిసింది. ఇక హనుమాన్ జంక్షన్ లో ఒక రైస్ మిల్లు అధినేత ఆత్మహత్యాయత్నం చేయగా వికటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపారం చేసేవారు అయితే దొంగలుగా మారడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితి నెలకొంది. కరెంటు బిల్లును చెల్లించకపోతే ప్రభుత్వం కరెంట్ కట్ చేస్తోందని, మీరు సకాలంలో డబ్బులు చెల్లించకపోతే ప్రజలు మీ పవర్ ను ( అధికారం) కట్ చేస్తారంటూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సబబే. రాష్ట్ర ప్రభుత్వం పతనపు అంచుల్లో ఉంది. ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు తమ పార్టీకి ఒక్క సీటు వచ్చే అవకాశం లేదు. 1,75 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగులు పెడితే, ప్రజలు తిరగబడత ఏమి చేస్తారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

జీతాల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న ఉద్యోగులు
జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్ల కోసం విశ్రాంత ఉద్యోగులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు అందలేదు. పోలీసు సిబ్బందికి మాత్రమే జీతాలు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందజేస్తోంది . ప్రభుత్వ ఉద్యోగు లకు జీతాలు చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. అలాగే విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లను సకాలంలో అందజేయాలి. పెన్షన్ల పై ఆధారపడి విశ్రాంత ఉద్యోగులు జీవిస్తారు. విశ్రాంత ఉద్యోగులని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లను దొంగలుగా మారమని ఈ చెత్త ప్రభుత్వం సమాజానికి సందేశం ఇస్తోందా? అని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలే చెల్లించడం లేదని, ఇక అడ్వాన్సుల మాట దేవుడెరుగు.. ఇప్పటికే 7 డి ఏ లను ఉద్యోగులకు ప్రభుత్వం బాకీ ఉంది. పోలీసుల కు సకాలంలో జీతాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, రేపు పాలకులు మారి… అధికారంలోకి వచ్చిన పాలకులు తన్నమంటే అదే పోలీసులు మిమ్మల్ని కూడా తంతారు జాగ్రత్త అంటూ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

కాకి లెక్కలు చెబుతున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై కాకి లెక్కలు చెబుతోందని రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటూ అప్పులు చేసింది. అలాగే కొన్ని అప్పులను గ్యారెంటీగా లేకుండా చేసింది. రెండు లక్షల 50 వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ల పేరిట అప్పులు చేయగా, ప్రభుత్వం మాత్రం 40 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా తప్పుడు లెక్కలు చెబుతుంది. ప్రభుత్వం చేసిన అప్పుల గురించి తాను గతంలోనే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సోమనాథన్ కు లేఖ రాశాను. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, దృశ్యం చిత్రంలో వెంకటేష్ తన కుటుంబ సభ్యుల చేత అబద్ధం చెప్పించినట్టుగా, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధిపతులతో అబద్ధం చెప్పిస్తున్నారు. తాను మరో లేఖ రాస్తున్నానని, ఈ లేఖలో ప్రభుత్వం చేసిన అప్పులన్నింటినీ అణా పైసలతో వివరిస్తాను. ఏఏ కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులను చేసింది, ఏ బ్యాంకర్ల వద్ద నుంచి ఎంత రుణం తీసుకుంది… ఈ లేఖలో వివరిస్తాను. బ్యాంకర్లు ఒకవేళ తమ వద్ద కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోలేదని చెబితే, ఆ రుణాన్ని సదరు బ్యాంకర్ మాఫీ చేయాలి. బ్యాంకర్లు అలా చెప్పే అవకాశమే లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

Leave a Reply