– తప్పుడు మార్గంలో పవన్
– బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి పవన్ ఏం సాధించాడు?
– పవన్ కేవలం సినిమాల్లోనే హీరో.. పొలిటికల్ గా కాదు అన్నది గుర్తెరగాలి
– నేను ఎక్కడైనా గూండాగిరి చేశానని నిరూపిస్తే.. రాజీనామా చేస్తా, లేకుంటే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా?
– ప్రత్యేక హోదా ఇవ్వొద్దని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయమని బీజేపీని రూట్ మ్యాప్ అడిగావా పవన్ కల్యాణ్..!?
– రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్(అవంతి)
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ నిన్న సభలో అసత్యాలు మాట్లాడారు. అవన్నీ సత్యదూరాలు. ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శలు చేయను అంటూనే పవన్… నా మీద, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుగారు మీద విమర్శలు చేశారు. వాటి జోలికి నేను వెళ్లను. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నాను. మేము మంత్రులు అవడం దౌర్బాగ్యం అన్న పవన్ కల్యాణ్ ను సూటిగా అడుగుతున్నాను. ఆయన పార్టీ పెట్టడం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం అనుకోవాలా?
ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనే పవన్‌ను నేను కూడా సామాన్య వ్యక్తిగా ప్రశ్నిస్తున్నాను. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంది తెలంగాణలోనా? ఆంధ్రప్రదేశ్‌లోనా? తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో, ఏపీలో బీజేపీతో పొత్తు ఉంటుందా?.
బీజేపీని రోడ్ మ్యాప్ ఏమని అడిగారు? విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మేయమని అడిగారా? విశాఖ రైల్వే జోన్ వద్దని అడిగారా? లేకుంటే ప్రత్యేక హోదా వద్దని అడిగారా? బీజేపీ మీకు ఏ రోడ్ మ్యాప్ ఇస్తుంది?
మీరు పార్టీ ఎవరి కోసం పెట్టారు? చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడం కోసం పెట్టారా? మా పార్టీలో ఉన్న మంచివాళ్లందరికీ నమస్కారం అని పవన్ అన్నాడు. అలాగే మీ పార్టీలో ఉన్న మంచివాళ్లందరికీ మేము నమస్కారం చెబుతున్నాం. నేను ఎలాంటి వ్యక్తినో.. నా గురించి నాగబాబుకు బాగా తెలుసు. పవన్ తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు.
చంద్రబాబు ఎంత మోసకారి, వెన్నుపోటుదారుడు అనేది ఆరేళ్ల పిల్లాడి నుంచి 60ఏళ్ల ముసలివాళ్లు వరకూ ఎవరైనా చెబుతారు. ప్రపంచం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్‌కే బాబు వెన్నుపోటు పొడిచారు… అలాంటిది పవన్ కల్యాణ్ ఎంత? ఈ విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. పవన్ కల్యాణ్‌కు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ.
అందుకే ఆయన సినీ కెరీర్ తీసుకుంటే హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ ఉంటాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మీరు బెదిరిస్తారా? భీమ్లానాయక్ ట్రీట్‌మెంట్ ఇస్తామని వార్నింగ్ ఇస్తావా? మీ పార్టీ కుర్రాళ్లు ఆయన ఇంటిపై దాడికి వెళితే వాళ్లు ప్రతిదాడి చేశారు. అందరూ నా మాదిరిగా మంచివాళ్లు ఉండరు కదా? దేవుడు, భక్తి ఎవరి మార్గం వాళ్లదే. మీరు మాత్రం ఎవరిమీద అయినా దాడి చేయొచ్చు అంటే ఎలా..? మిమ్మల్ని ఏమీ అనకూడదు.. మమ్మల్ని మాత్రం మీరు నోటికొచ్చినట్లు అంటామంటే పడాలా?
నేను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గం వెళ్ళి మీరు అడగండి. ఈ మూడేళ్ల కాలంలో జనసేన శ్రేణులపైనగానీ, మరెవరిపైనైనా నేను ఎప్పుడైనా గూండాగిరి చేశానా? మీరు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా? నిరూపించకుంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? మేం ఏం గూండాగిరి చేశామో చెప్పాలి. నాపై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకోను. నేను దేవుడిని నమ్మే వ్యక్తిని. నా జోలికి రావద్దు..
సినిమాల్లో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లడం మినహా పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసు? మీరు ఏనాడు అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే కదా.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో… 13 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలిసేది. హైదరాబాద్ నుంచి టూరిస్ట్‌లా రావడం, ఎవరో రాసిచ్చిన నాలుగు డైలాగులు టప్ టప్‌మని మాట్లాడి వెళ్లిపోతారు. రాష్ట్రంలో ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. రోడ్డు ప్రమాదాలు ఇప్పుడే జరుగుతున్నాయా..?. తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదా?. అప్పుడెందుకు మాట్లాడలేదు?.
టీడీపీ హయాంలో అవినీతి, గూండాగిరి పవన్‌కు కనిపించలేదా? గతంలో తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్? ఎందుకు విడిపోయావ్? మళ్లీ ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావనేది నీవే సమాధానం చెప్పాలి కదా?. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి మీరు ఏమైనా సాధించారా? అంటే లేదు.