– కోర్టు ఏమన్నది … సాక్షి ఏమి రాసింది…?
– చంద్రబాబుకు, ఈ కేసుకు అసలు సంబంధం ఏమిటి ?
– చంద్రబాబుతో తనని జతకడితే భయపడే ప్రశ్నే లేదు
– హవ్వ … సుబ్బారాయుడు పై సస్పెన్షన్ వేటా?
– ప్రతిరోజు ప్రభుత్వ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్న నా పై సస్పెన్షన్ వేటు వేస్తారా?
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రిషికొండ పై టూరిజం ముసుగులో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భిన్నంగా సాక్షి దినపత్రిక కథనాలను రాసిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. సుప్రీంకోర్టు కాఫీ తీర్పు ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, బెండమూడి విద్యార్థులకు మాత్రమే అర్థమవుతుందని, సాక్షి దినపత్రిక యాజమాన్యానికి అర్థం అయినట్లు లేదని ఆయన ఎద్దేవా చేశారు.
బుధవారం రచ్చబండ కార్యక్రమం లో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… రిషి కొండ పై నిర్మాణాల విషయంలో ఎన్ జీ టి స్టే ను సుప్రీంకోర్టు కొట్టివేసి, నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని సాక్షి దినపత్రిక తన కథనంలో పేర్కొన డాన్ని రఘురామ కృష్ణంరాజు తప్పుపట్టారు. గతంలో ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో, అక్కడే నిర్మాణాలను చేపట్టాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొందనీ వెల్లడించారు. చదునుగా ఉన్న మైదాన ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టేందుకు సుప్రీం కోర్ట్ అవకాశం ఇచ్చిందన్న ఆయన, అంతే తప్ప వీళ్లు గుండు కొట్టినట్టుగా చదును చేసిన మైదాన ప్రాంతంలో కాదని రఘురామ పేర్కొన్నారు.
రిషికొండ పూర్వపు చిత్రాన్ని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, చాలా మంది నెటిజన్లు భిన్నమైన వ్యాఖ్యలు చేశారని అని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. కొంతమంది అరగుండు కొట్టారని, మరికొంతమంది మిలటరీ కటింగు చేశారనీ అపహాస్యం చేశారని ఆయన పేర్కొన్నారు. రిషి కొండ పై 30 శాతం ప్రకృతి, పచ్చదనాన్ని మిగిల్చి, 70 శాతం విధ్వంసానికి పాల్పడ్డారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. గతంలో 20 వేల చదరపు అడుగుల లో నిర్మాణాలను చేపట్టగా, వాటిని అడ్డంగా బద్దలుకొట్టి, రెండు లక్షల చదరపు అడుగుల లో రాష్ట్ర ప్రభుత్వం టూరిజం ముసుగులో నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
20 వేల చదరపు అడుగుల్లో, అదనంగా మరో రెండు అంతస్తుల భవనాలను నిర్మించిన కూడా రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను చేపట్టే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. రిషికొండ కోస్టల్ ప్రాంతంలో జీరో నుంచి 100 మీటర్ల వరకు తట్టెడు మట్టి ని తీసిన వారు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిందే నని హెచ్చరించారు. 2006 లో నిర్మించిన భవనాలను డబ్బున్న వాడైనా బద్దలు కొట్టారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి డబ్బులేని వారైతే అసలు బద్దలు కొట్టారని అన్నారు. రిషి కొండ పై 180 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న ఆయన, 180 కోట్ల రూపాయల వ్యయంతో 250 గదుల ఐదు నక్షత్రాల హోటల్ ను కట్ట వచ్చునని పేర్కొన్నారు. అంతటి నిర్మాణం కేవలం 20 వేల చదరపు అడుగుల లో వస్తుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
ఇక అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు కుయుక్తులు అంటూ సాక్షి దినపత్రికలో పేర్కొనడంపై రఘురామకృష్ణంరాజు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ కేసుకు చంద్రబాబునాయుడుకు సంబంధం ఉందా? అంటూ ప్రశ్నించారు. అలాగే చంద్ర బాబు, రఘురామ ద్వయానికి గట్టి ఎదురుదెబ్బ అని సాక్షి దినపత్రిక తన కథనంలో రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. తనకు ఎదురు దెబ్బ తగల లేదని, రాష్ట్ర ప్రభుత్వానికే సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీటీడీసీ, మున్సిపల్ కమిషనర్, రుషికొండ నిర్మాణాలపై ముందుకు వెళితే కఠిన చర్యలు తప్పవన్నారు.
రిషికొండ నిర్మాణాలపై ఎన్ జీ టి స్టేను ఎత్తి వేస్తూ, ఎన్ జీ టి కంటే హైకోర్టు పెద్దదని, తనను హైకోర్టుకు వెళ్లాలని సూచించారు తప్పితే, తనకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని తప్పుడు కథనాలు రాయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు నాయుడుతో తనను సాక్షి దినపత్రిక కలప డం పట్ల తానేమీ భయపడడం లేదన్న ఆయన, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి తో తన పేరు జత కలిపితే నష్టమేమీ లేదన్నారు. రిషి కొండ పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాలను చేపట్టలేదని, ఒకవేళ చేపడితే విశాఖ వాసులు కోర్టుకు నివేదించడానికి సిద్ధంగా ఉన్నారని అని రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఢిల్లీ యాత్ర సక్సెస్ కావాలి
విదేశీ, ఆర్థిక, విహార పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన విజయవంతం కావాలని, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఉద్దేశించి, ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశంలో ప్రదర్శించారు.. ప్రత్యేక హోదా పై మోడీని నిలదీస్తానన్న చంద్రబాబు, వంగి వంగి దండాలు పెట్టారని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసిన వీడియో క్లిప్పింగ్ తో పాటు, మోడీ కాళ్లకు నమస్కరించ బోయిన జగన్మోహన్ రెడ్డి వీడియో క్లిప్పింగ్ ను కూడా మీడియా సమావేశంలో ప్రదర్శించి… భవిష్యత్ ముందే తెలిసి, జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేశారు.
రెండు మూడు నెలలకు ఒకసారి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను, ఆరు నెలలకు ఒకసారి ప్రధానమంత్రి మోడీ ని కలుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఖర్చు చేసిన మూడు వేల కోట్ల నిధులు, నిర్వాసితుల ప్యాకేజీ, బొగ్గు కొరత, రుణ పరిమితి పెంపు వంటి అంశాలపై ప్రధానితో మాట్లాడినట్టుగా సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురిస్తారనీ రఘురామకృష్ణంరాజు తన దైన శైలిలో చురకలు అంటించారు.. ఇక తన బంధువులను, తనను కేసుల నుండి తప్పించాలని, క ఏడేళ్లుగా తమ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న కేంద్ర సర్వీస్ అధికారి, కాల వ్యవధిని పొడిగించాలని , తనపై వేటు వేయాలని కోరే అవకాశం ఉందన్నారు.
అయితే తాను రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ లో పేర్కొన్నట్టుగా ఎక్కడ నిబంధనలను ఉల్లంఘించలేదని, తనపై చర్యలు తీసుకునే అవకాశం లేనేలేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి, బిజెడి మద్దతు ఇస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, ఆదాయ వనరులను పెంచుకునే వారైతే కేంద్రాన్ని భయపెడతారో, బ్రతిమాలు తారో, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల స్థాయికి దిగజారిన, ఏపీకి ప్రత్యేక తరగతి హోదా ప్రకటించాలని కేంద్రాన్ని పట్టుబట్టాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. ఏమి సాధించిన రాష్ట్రపతి ఎన్నికల ముందే నని, ఎన్నికలు ముగిసిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వర ని హెచ్చరించారు. ప్రధాని మోడీ తో ముఖ్య మంత్రి చర్చలు సఫలీకృతమై, రాష్ట్రానికి మేలు జరగాలని ఆకాంక్షించారు.
సీఎం ఆఫీస్, ఎమ్మెల్యే కార్యాలయాలను చేర్చండి
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఏసీబీ యాప్ లో కేవలం ప్రభుత్వ కార్యాలయాలనే కాకుండా, ముఖ్యమంత్రి ఆఫీస్ , ఎమ్మెల్యే కార్యాలయాలను కూడా చేర్చాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయం లో ఆర్థిక కార్యదర్శి వచ్చిన బిల్లులకు వరుస క్రమంలో చెల్లింపులు చేసేవారిని, కానీ ఈ ప్రభుత్వం లో తమ వారికి మాత్రమే 20 నుంచి 30 శాతం కమిషన్లు తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారన్న టాక్ వినిపిస్తోందని పేర్కొన్నారు. పారదర్శకంగా బిల్లులు ఇవ్వనప్పుడు అనుమానాలు తలెత్తడం సహజమని, అందుకే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, సెక్రటేరియట్ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా ఏ సి బి యాప్ పరిధిలోకి తీసుకురావాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎమ్మెల్యేలపై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయనీ, ఇందులో ప్రధానంగా ఇసుక ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పారదర్శకత కోసం సీఎం ఆఫీస్, ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మొదలుకొని అన్ని ప్రభుత్వ ఆఫీసులను ఏ సి బి యాప్ పరిధిలోకి తీసుకురావాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
సుబ్బారాయుడు పై వేటా?
నరసాపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు.. తాను ప్రతి రోజు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నా నీ, తను కూడా సస్పెండ్ చేస్తారేమోనని అని అనుమానం వ్యక్తం చేశారు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆహ్వానం మేరకు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు ని తానే పార్టీలోకి ఆహ్వానించానని పేర్కొన్నారు. ఐదు సార్లు శాసన సభ్యునిగా, ఒకసారి ఎంపీ గా విజయం సాధించిన సుబ్బారాయుడు , సుదీర్ఘకాలం మంత్రిగా పదవి పనిచేశారని గుర్తు చేశారు.
లయ రాజు…ఇళయరాజా
ప్రముఖ సంగీత దర్శకుడు పద్మ విభూషణ్ ఇళయరాజా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రఘురామకృష్ణంరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. దక్షిణాది భాషల లోనే కాకుండా, హిందీలోనూ అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన ఇళయరాజా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.