– రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
– పాత వారికి పాతరేసి, వైసీపీ వారిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు
– బంధువులు, వైసీపీ వారికే ఇసుక రీచ్‌లు, జనరిక్ షాపులు, అన్న క్యాంటీన్లు ఇస్తున్నారని ఫిర్యాదులు
– బంధువులకు జనరిక్ షాపు ఇచ్చారంటున్న తమ్ముళ్లు
– సీనియర్లను పక్కనపెట్టారన్న అసంతృప్తి
– రామచంద్రాపురం నేతలకు అవమానంపై రగిలిపోతున్న సీనియర్లు
– అమలాపురం అనుచరులకే అందలమంటూ ఆగ్రహం
– తండ్రి పెత్తనంపై తమ్ముళ్ల ఫిర్యాదు
– అధికారుల సమీక్షలో ఎలా పాల్గొంటారని ప్రశ్నలు
– తమను పట్టించుకోవడం లేదంటున్న కాపులు
– నీటి సంఘాల చైర్మన్లుగా ఇంకా వైీసీపీ వారినే కొనసాగిస్తున్నారని ఆగ్రహం
– సొంత పార్టీ వారినే జైలుకు పంపించారంటూ పల్లాకు ఫిర్యాదు
– పార్టీ పదవుల్లో మంత్రి సూచించిన వారికి పదవులివ్వవద్దని వినతి
– ఫైవ్‌మెన్ కమిటీ వేయాలన్న సూచన
– రామచంద్రాపురంలో మంత్రి సుభాష్‌కు ఇంటి కష్టాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మంత్రివర్గ మార్పుల నేపథ్యంలో ఏపీ కార్మికమంత్రి వాసంశెట్టి సుభాష్‌కు సొంత గూటిలోనే అసమ్మతి సెగ తలనొప్పిలా పరిణమించింది. గత ఎన్నికలకు నెలరోజుల ముందు వైసీపీ నుంచి, పక్క నియోజక వర్గమైన అమలాపురం నుంచి.. నాన్ లోకల్ అభ్యర్ధిగా రంగంలోకి దిగి, రామచంద్రాపురం టీడీపీ అభ్యర్ధిగా టికెట్ సాధించిన సుభాష్‌కు నాడు సహకరించిన శెట్టిబలిజ, కాపు వర్గాలే.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఏకమవడం చర్చనీయాంశమయింది.
వీరంతా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కలసి.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని మంత్రి సుభాష్ అమలాపురం నియోజకవర్గంలోని తన అనుచరులకు ధారాదత్తం చే శారంటూ ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇటీవలి ఉద్యోగుల బదిలీలల వ్యవహారంలో కూడా పలువురు మంత్రులు-ఎమ్మెల్యేల సిఫార్సులు పక్కనబె ట్టిన వైనంపై ఇప్పటికే పలువురు పల్లాకు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రి సుభాష్ వ్యక్తిగతంగా మంచివాడేనని, ఆయన సమీప బంధువులే ఆయనను తప్పుదోవపట్టిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో శెట్టిబలిజ వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు కాకుండా… ఎన్నికలకు నెలరోజుల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి గెలిచిన రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌కు మంత్రి పదవి ఇచ్చిన టీడీపీ నాయకత్వం, ఇప్పుడు తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి పితానికి ఉభయగోదావరి జిల్లాల్లోని శెట్టిబలిజ వర్గంలో ఇమేజ్-క్రేజ్ ఉన్న విషయం తె లిసిందే.
అయితే యువకుడికి ఒక అవకాశం ఇద్దామన్న నాయకత్వ అంచనాలు దెబ్బతిని కాపు-శెట్టి బలిజను దూరం చేసుకోవలసిన ప్రమాదం ఏర్పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన నాయకత్వం తనపై పెట్టుకున్న అంచనాలు-నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారంటున్నారు.
తన సొంత అమలాపురం నియోజకవర్గం నుంచి, రామచంద్రాపురం నియోజకవర్గానికి వలస వచ్చిన మంత్రి, అక్కడి పార్టీ సీనియర్లను కాదని.. తన పాత అమలాపురం నియోజకవర్గానికి చెందిన పాత వైసీపీ బంధుమిత్రులను ప్రోత్సహిస్తున్న వైనం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్లడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా నియోజకవర్గంలో టీడీపీకి మద్దతుదారులైన కాపు, శెట్టిబలిజ నేతలను పక్కనపెట్టి.. మంత్రి తన సొంత వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్నది వారి ఫిర్యాదు.
రామచంద్రాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరిక్ షాపును మంత్రి తన బంధువుకు ఇచ్చారని, ఇసుక రీచ్‌లు, అన్నా క్యాంటీన్లను అమలాపురం నియోజకవర్గానికి చెందిన ఆయన సన్నిహితులకు కట్టబెట్టారంటూ పల్లా శ్రీనివాసరావుకు.. కొందరు రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ సీనియర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ మేరకు తమ వద్ద ఉన్న ఆధారాలను, పల్లా దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
నాన్నకు ప్రేమతో…
నియోజకవర్గంలో పార్టీ స్థాపించిన నాటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని, మంత్రి తన తండ్రికి పెత్తనం ఇచ్చారని.. ఆయన అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్న ఫొటోలు రోజూ మీడియాలో వస్తున్న విషయాన్ని, వారు పల్లాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ‘ఆయనకు పార్టీ-ప్రభుత్వంలో ఎలాంటి హోదా లేదు. అయినా ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రారంభోత్సవాలు-శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. ఇది కుటుంబసభ్యులు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సీఎం గారి విధానాలకు వ్యతిరేకమే కదా’ అని వారు పల్లా వద్ద వ్యాఖ్యానించినటు చెబుతున్నారు.
‘ ఒకవైపు సీఎం చంద్రబాబుగారు బంధువులకు పెత్తనం అప్పగించవద్దని చెబుతున్నారు. వారి జోక్యం వద్దని ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారు. అయినా మా రామచంద్రాపురంలో సీఎం మాట కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదు. మంత్రి గారి తండ్రికి పార్టీ-ప్రభుత్వంలో ఎలాంటి హోదా లేదు. కానీ ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. శంకుస్థాపనలు-ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో పిల్లి సుభాష్ గతంలో సాగించిన అవినీతి కార్యక్రమాలపై విచారించడం లేదు. కానీ మేం గతంలో ఇదే సుభాష్, తోట త్రిమూర్తులను ఎదిరించి పార్టీని కాపాడాం. జిల్లాను శాసించే తోటత్రిమూర్తులపై భౌతిక దాడి చేసి సంచలనం సృష్టించిన ఇజ్రాయెల్ అనే టీడీపీ నాయకుడిపై, అక్రమ కేసులు పెట్టి ఆయనను జైల్లో వేయడం దారుణం. ఇలా సొంత పార్టీ వారిని ఎవరైనా జైల్లో వేయిస్తారా? మంత్రి గారు తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్‌ను ఎందుకు విమర్శించరు? వారిపై ఎందుకు ఎదురుదాడి చేయరు’’ అని పల్లా వద్ద, తమ ఆక్రోశం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రి సుభాష్ తండ్రి పెత్తనాన్ని తగ్గించి, తొలి నుంచీ పార్టీకి పనిచేసిన వారికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకులు కోరినట్లు సమాచారం.
సొంత పార్టీ వారినే జైలుకు పంపించిన వైనం
తమపై మీడియాలో ఎన్ని వ్యతిరేక కథనాలు వచ్చినా, చానెల్స్‌లో ఎన్ని వార్తలు వచ్చినా.. తాము మంత్రి లోకేష్, ఆయనకు సన్నిహితుడైన మరో వ్యక్తికి, ఎంపి సాన సతీష్‌కు చెప్పే చేస్తున్నామని చెప్పడంతో.. నియోజకవర్గ వాస్తవ పరిస్థితులను వారికి వివరించలేపోతున్నామని శెట్టిబలిజ, కాపు నేతలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
పల్లాను కలిసిన వారిలో జడ్పీ మాజీ వైఎస్ చైర్మన్ సహా 20 మంది సీనియర్లు ఉన్నట్లు రామచంద్రాపురం నేతలు చెబుతున్నారు. కొద్ది దశాబ్దాల నుంచి ఇప్పటివరకూ పనిచేస్తున్న తమకు మంత్రి ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని వివరించినట్లు తెలిసింది. తాజాగా మంత్రి ఒకనాటి మిత్రుడు, మంత్రిపై తిరుగుబాటు చేసిన ఫలితంగా జైలుపాలయిన.. టీడీపీ నేత ఇజ్రాయిల్ అనే శెట్టిబలిజ నేత కూడా పల్లాను కలసి, నియోజవర్గంలో నెలకొన్న పరిస్థితులు వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వైసీపీలో ఉన్న మంత్రి సుభాష్, ఇజ్రాయిల్ ఒకేసారి టీడీపీలో చేరటం విశేషం.
ఈ నేపథ్యంలో రామచంద్రాపురంలో పార్టీ మళ్లీ గెలవాలంటే.. పార్టీ-ప్రభుత్వ పదవుల్లో మంత్రి సుభాష్ సిఫార్సు చేసిన వారికి కాకుండా.. ఫైవ్‌మెన్ కమిటీ వేసి, పార్టీ కోసం పనిచేసిన వారికే అవకాశం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా తనపై మంత్రి పెట్టించిన అక్రమ కేసులను కొట్టివేయాలని ఇజ్రాయిల్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావును కోరినట్లు సమాచారం.
దీనిపై శెట్టిబలిజ నేత ఇజ్రాయిల్‌ను వివరణ కోరగా ‘ నేను తోట త్రిమూర్తులను ఎదుర్కొని భౌతికంగా గాయపడిన వాడిని. ఆప్పుడు ఈ ప్రముఖులెవరూ ఈ నియోజకవర్గంలో లేరు. రామచంద్రాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి మా పార్టీ అధ్యక్షులకు వివరించా. నియోజకవర్గంలో పార్టీలో మొదటినుంచి పనిచేస్తున్న శెట్టిబలిజ-కాపు సీనియర్ల మనోభావాలు, వారికి జరుగుతున్న అన్యాయాలను మా అధ్యక్షుడికి వివరించా. నాపై అన్యాయంగా పెట్టిన కేసులు, దానికి కారణాలు ఆయనకు వివరించాను. తమకు వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని, పార్టీకి పనిచేసిన వారికి ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం జరగదని పల్లా గారు హామీ ఇచ్చారు. ఆయన మా సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఇదంతా మా పార్టీ అంతర్గత వ్యవహారం’’ అని ఆయన బదులిచ్చారు.
కార్మిక శాఖలో అంతా బావగారేనట
ఇదిలాఉండగా.. గత ఏడాది నుంచి కార్మిక శాఖలో ఒక ‘కొసర బావ’గారు.. లోకేష్, సానా సతీష్ తమకు మద్దతుదారులంటూ చక్రం తిప్పుతున్న వైనం పార్టీ వర్గాల్లో బహిరంగమేనంటున్నారు. ‘మీడియాలో మనకు ఎన్ని వార్తలు రాసినా పైన లోకేష్, సానా సతీష్, టీ డీపీ ఆఫీసు ప్రముఖుడు వాటిని పట్టించుకోర’ని బావగారు చెబుతున్నారు. కార్మిక శాఖలోని ఈఎస్ఐ- ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో పెత్తనం అంతా బావగారిదేనట. పోనీ ఆయనేమైనా సొంత బావగారా అంటే అదీ కాదని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ఈఎస్ఐ-ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటులో బావగారు చక్రం తిప్పుతున్నారన్న ఫిర్యాదులు తెలిసిందే. ప్యాక్టరీస్ డిపార్టుమెంటులో బావగారు చెప్పిన వారికే పెద్ద వేశారంటున్నారు. సదరు బావగారు పేషీ ఆడ్డాగా చేసుకుని, కార్మిక శాఖలోని అధికారులను సెట్ చేస్తారన్న ప్రచారం కూడా లేకపోలేదంటున్నారు. ఇటీవలి ఉద్యోగుల బదిలీలలతోపాటు.. ఈఎస్ఐలో కాంట్రాక్టర్లు ఇతర వ్యవహారాల్లో బావగారే చక్రం తిప్పారన్న విమర్శలు లేకపోలేదు. తాజాగా కాకినాడ, విశాఖలో బావగారు బినామీ థర్డ్‌పార్టీ ఏజెన్సీని, బినామీల పేరుతో వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్న విషయం తెలిసిందే.