– ప్రధాని ప్రసంగంపై కమలదళాల పెదవి విరుపు
– మోదీ ప్రసంగంలో కనిపించని మెరుపులు
– సంజయ్ అరెస్టు ప్రస్తావనేదీ?
– ప్రశ్నాపత్రాల లీకేజీపై పెదవి విప్పకపోవడంపై నేతల నిరాశ
– కేసీఆర్ పాలనపై పరోక్ష విసుర్లు
– కుటుంబ పాలనంటూ విమర్శలు
– కేంద్రానికి రాష్ట్రం సహకరించడం లేదని ఆరోపణ
– కోర్ కమిటీతో భేటీ కాని వైనం
– చప్పగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగంపై కమలదళాల నిరాశ
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)
తెలంగాణ రాజకీయాలు వేసవి కాలంలో ఉష్ణోగ్రతల మాదిరిగా హీటెక్కుతున్నాయి. సెగల సెల్సియస్‌తో సమానంగా రాజకీయ పొగలు పెరుగుతున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్, టెన్త్ పరీక్షల లీకేజీ కేంద్రంగా.. రాష్ట్రంలో సవాళ్లు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇవి చాలనవన్నట్లు.. బీజేపీ దళపతి బండి సంజయ్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టిన వైనం, రాజకీయాల్లో మరింత వేడిని పెంచింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం మరింత పెంచేందుకు కారణమయింనది.
మరి అలాంటి వాడి వేడి వాతావరణం నడుమ.. ప్రధాని హైదరాబాద్ నగరానికి వస్తున్నారంటే, విపక్ష బీజేపీ శ్రేణుల అంచనాలు ఎలా ఉంటాయి? ప్రధాని ప్రసంగంపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయి? తమ కోపాన్ని ప్రధాని ప్రసంగంలో వినాలన్నంత కోపం ఉండదూ?
వచ్చేది అధికార కార్యక్రమానికే అయినప్పటికీ, మోదీ తన ప్రసంగంలో మాటల తూటాలు పేల్చుతారన్న అంచనాలు, కమలదళాల్లో కచ్చితంగా ఉంటాయి. వారంతా అదే ఆశించారు. సీఎం కేసీఆర్ పాలనపై మోదీ నేరుగా విరుచుకుపడతారని, సంజయ్ అక్రమ అరెస్టునుద్దేశించి, కేసీఆర్‌కు వేదిక ద్వారా హెచ్చరిక సంకేతాలు జారీ చేస్తారని, కమలదళాలు ఆశించాయి. కానీ.. ప్రధాని ప్రసంగం అందుకు భిన్నంగా సాగడంతో కమలదళాలు పెదవి విరిచాయి.
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రప్రభుత్వం నిర్వహించిన, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ మేరకు బీజేపీ నాయకులు, భారీ జనసేకరణ చేసి ప్రధానిని మెప్పించారు. మోదీ కూడా వచ్చిన కార్యకర్తల సంఖ్యను చూసి మురిసిపోయారు. ఆ మేరకు జన సమీకరణలో నగర బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మోదీ రాకను నిరసిస్తూ, అధికార బీఆర్‌ఎస్ ఎలాంటి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టకపోవడంతో, ప్రధాని సభ ప్రశాంతంగా ముగిసింది.
అయితే.. తెలంగాణలో కేసీఆర్ పాలనా వైఫల్యాలపై, తిరుగుబాటు చేస్తున్న కమలదళాలకు ‘కిక్కు’ ఇచ్చే ప్రసంగం లేకపోవడం, వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. మోదీ ప్రసంగం ఆసాంతం.. సీఎం కేసీఆర్ పేరు లేకుండా సాగడం వారిని ఆశ్చర్య పరిచింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలసి రావడం లేదని, కుటుంబపాలనతో అవినీతి పెరిగిందని విమర్శించారు.
కొంతమంది ప్రగతి నిరోధకులుగా మారారని, కొందరి గుప్పెట్లోనే అధికారం ఉందన్నారు. కుటుంబవాదంతో ప్రతి వ్యవస్థనూ, తమ అధీనంలో ఉంచుకోవాలనుకుంటారని విమర్శించారు. తమను ప్రశ్నించేవారు ఉండకూడదనుకుంటారని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసేవారంటే వారికి ఇష్టం ఉండదని దెప్పిపొడిచారు.
కేసీఆర్ సర్కారుపై పరోక్షంగా ఇన్ని విమర్శలు కురిపించిన మోదీ.. అవినీతిపరులపై పోరాటం చేయాలా? వద్దా?..వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలా? వద్దా? దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా? వద్దా అని, సభకు వచ్చిన వారినుద్దేశించి ప్రశ్నించారు.
మోదీ ప్రసంగించింది కొద్దిసేపే అయినప్పటికీ.. ఎక్కడా పార్టీ శ్రేణులకు, టానిక్ ఇచ్చే వ్యాఖ్యలేవీ లేకపోవడం.. కమలదళాలను నిరాశ పరిచింది. ముఖ్యంగా ఏ సందర్భంలోనూ కేసీఆర్ పేరెత్తకుండా, పరోక్ష విమర్శలు సంధించడం శ్రేణులకు రుచించలేదు.
ప్రధానంగా ఇటీవల టెన్త్ పేపర్ లీకేజీలో అరెస్టుయి.. జైలుకెళ్లొచ్చిన తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారాన్ని, ప్రధాని మాట మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం పార్టీ శ్రేణులను నిరాశపరిచింది. ప్రధాని హాజరయింది ప్రభుత్వ కార్యక్రమం. అయినప్పటికీ కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించిన మాదిరిగానే.. బండి సంజయ్ అక్రమ అరెస్టు వ్యవహారాన్నీ పరోక్షంగా ప్రస్తావిస్తే, బాగుండేదన్నది పార్టీ సీనియర్ల అభిప్రాయం. ప్రధాని ప్రసంగంలో, కేసీఆర్ సర్కారుపై పోరాడుతున్న తమకు భరోసా ఇవ్వడం అటుంచి, కనీసం అభినందించకపోవడంపైనా పార్టీ వర్గాల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
కాగా ప్రధాని రాక సందర్భంగా, ఎయిర్‌పోర్టులోనయినా తమతో భేటీ అవుతారని బీజేపీ కోర్ కమిటీ నేతలు భావించారు. సహజంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా ఏదైనా రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆయా రాష్ర్టాల కోర్ కమిటీ సభ్యులతో భేటీ అవుతుంటారు. ఆ సందర్భంలో ఆయా రాష్ర్టాల రాజకీయ పరిణామాలపై ఆరా తీసి, నేతలకు దిశానిర్దేశం చేస్తుంటారు. అదేవిధంగా హైదరాబాద్ వచ్చిన మోదీ.. తమతో భేటీ అవుతారని ఆశించినప్పటికీ, అలాంటిదేమీ లేకుండానే..సాధారణ ధర్మదర్శనాలు- నమస్కారాలతో మోదీ పర్యటన ముగిసింది.