Suryaa.co.in

Andhra Pradesh

సేవలందించని ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణా చర్యలు

-ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ
-జూన్ 15లోగా స్పందించకపోతే శాఖా పరమైన చర్యలు
-ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి

అమరావతి: ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ కోర్స్ లు పూర్తి చేసిన ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదేళ్ళపాటు ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలు అందించాల్సి ఉండగా కొంతమంది ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇన్ సర్వీస్ వైద్యులు పీజీ కోర్స్ లలో చేరే సమయంలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్లపాటు ప్రభుత్వానికి సేవలందించాల్సి ఉందని ఆమె వివరించారు. ఈ షరతును అమలు చేయడంలో విఫలమైతే వారు రూ.20 లక్షలతో పాటు ప్రభుత్వం చెల్లించిన జీత భత్యాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు .

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వైద్యులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వారి నుండి ఎటువంటి స్పందనా లేదని తెలిపారు. నోటీసులందుకున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లు జూన్ 15వ తేదీలోగా స్పందించని ఎడల వారిపై అమలులో ఉన్న నిబంధనల ప్రకారం చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE