రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్న వైజాగ్ ను రాజధానిగా ప్రకటిస్తారా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి అని డిమాండ్ చేయడం సిగ్గుచేటు! ధర్మాన ప్రసాదరావు పేరులో “ధర్మాన” అని ఉందే కానీ ఆయన మాటలన్నీ “అధర్మమే”! రాయలసీమ ప్రాంతంలోని ముఖ్యమంత్రి తో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార,ప్రతిపక్ష పార్టీ నాయకులు మేధావులు, ధర్మాన ప్రసాదరావు మాటలను ఖండించకపోవడం శోచనీయం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన ధర్మాన కు వైకాపా ప్రభుత్వ క్యాబినెట్ లో రెండో విడత మంత్రివర్గంలో బెర్త్ కన్ఫామ్ చేయడంతో రెచ్చిపోయి భూ కబ్జాలకు పాల్పడ్డాడని ప్రభుత్వ రంగ నిఘా సంస్థలే నివేదికలు ముఖ్యమంత్రికి ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలోని ఆంతర్యం ఏమిటి !
ధర్మాన ప్రసాదరావు తో సహా ప్రభుత్వ సలహాదారులు ఇతర మంత్రులు “డైవర్షన్ పాలిటిక్స్” కోసం ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకొని పనిచేస్తున్నారా? ఇటీవల సజ్జల తెలంగాణలో ఏపీ ని కలపండి అన్నారా?ధర్మాన కు వైజాగ్ రాజధాని కావాలన్నా ప్రత్యేక రాష్ట్రం కావాలని తన “మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలి లేదా ముఖ్యమంత్రి “ధర్మానను మంత్రి మండలి నుంచి బర్తరఫ్” చేయాలని డిమాండ్ చేస్తున్నాం! ఏపీ సీఎంకు రాయలసీమ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉంటే “శ్రీబాగ్ ఒప్పందం” ప్రకారం రాజధానిగా కర్నూల్ లేదా తిరుపతిని ప్రకటించండి!కర్నూల్ నుంచి “జ్యుడీషియల్ అకాడమీ” మంగళగిరి తరలిపోతే రాయలసీమ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు మౌనంగా ఉన్నారు అంటే ఇంతకన్నా ద్రోహం ఇంకొకటి లేదు!
“రాయలసీమ గర్జన” పేరుతో గర్జించిన నాయకులకు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు వినపడలేదా, పత్రికల్లో కనబడలేదా? స్వార్థ రాజకీయ స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సీమ ద్రోహుల రాజకీయ భవిష్యత్తును ప్రజలే తేలుస్తారు! రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పుణ్యకాలం పూర్తవుతున్నా రాజధాని,రాష్ట్రం పేరుతో దాగుడు మూతలు ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ను కుక్కలు చంపిన విస్తరిలా చేస్తున్నారు! రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజల దృష్టిని ప్రక్కదోవ పట్టించేందుకు పూటకో మాట రోజుకో ప్రకటన చేయడం ధర్మాన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం!ధర్మాన ప్రసాదరావు మాటలు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నదని,రాయలసీమ వాసిగా ముఖ్యమంత్రిని అవమాన పరచటమే అని అన్నారు!