టీటీడీ బోర్డు రద్దు?

– జనవరి 3,4లో ప్రకటన?
– జనవరి 14 లోగా కొత్త బోర్డు?
– వైకుంఠదర్శనం వరకే ప్రస్తుత పాలకవర్గం
– కొత్త చైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి పేరు పరిశీలన?
– యాదవులకు చైర్మన్‌ ఇవ్వాలని సీఎం నిర్ణయం?
– ఇప్పటివరకూ బీసీకి టీటీడీ చైర్మన్‌ ఇవ్వని వైసీపీ
– వైవి సుబ్బారెడ్డికి పార్టీ బాధ్యతలు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందా? ఆ మేరకు ఇంకా ఏడాదికి ముందే ఉన్న పదవీకాలాన్ని ముందస్తుగా రద్దు చేయనుందా? అంటే ప్రస్తుత టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఇక మాజీగా మారనున్నారా? ఆయన స్థానంలో బీసీ నేత జంగా కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా నియమితులు కానున్నారా?.. ఇదీ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న హాట్‌ టాపిక్‌.

టీటీడీ పాలకమండలిని రద్దు చేసేందుకు.. జగన్‌ సర్కారు సిద్ధమవుతున్నట్లు, వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న.. వైకుంఠ దర్శన కార్యక్రమం ముగిసేలోగా, టీటీడీ పాలకమండలిని రద్దు చేయనున్నట్లు సమాచారం. ఆ ప్రకారం జనవరి 14వ తేదీలోగా, కొత్త పాలకవర్గం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. టీటీడీ కొత్త చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, జంగా కృష్ణమూర్తిని నియమించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న యాదవులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా, ఆ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్‌ అవకాశం ఇవ్వవచ్చంటున్నారు. ఆయన ఇప్పటికే పార్టీలో బీసీ సెల్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదిలాఉండగా, ప్రస్తుత పాలకవర్గాన్ని కూడా రద్దు చేయడంతోపాటు.. నిబంధనల ప్రకారమే, పాలకవర్గ సంఖ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నిబంధనలు ఉల్లంఘించి 50 మంది వరకూ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులను నియమించిన వైనం, వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. అది హిందూ సమాజంలో వ్యతిరేకతకు దారి తీసింది. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా, నిబంధనల మేరకే పాలకవర్గసభ్యుల సంఖ్య ఉండవచ్చంటున్నారు.

అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న, టీటీడీ లోకల్‌ టెంపుల్స్‌ మేనేజింగ్‌ కమిటీలను కూడా రద్దు చేయనున్నట్లు సమాచారం. ఈ సభ్యుల నియామకాలపై కూడా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ర్టాల్లో ఈ కమిటీలున్నాయి. కాగా ప్రస్తుత చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి సేవలను, ఇకపై పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకుంటారని సీనియర్లు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలు పార్టీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డిపై.. అదనపు భారం తగ్గించేందుకే, ఆయనను టీటీడీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పైగా మూడేళ్లు దాటిన నేపథ్యంలో, ఆయన కూడా చైర్మన్‌ పదవి పట్ల పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదంటున్నారు. దానికితోడు టీటీడీ జేఈఓ ధర్మారెడ్డితో సుబ్బారెడ్డికి సఖ్యత లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఆశించారు. అయితే కొన్ని సమీ రణ దృష్ట్యా, సుబ్బారెడ్డికి రాజ్యసభ దక్కలేదు. అందుకు ప్రతిఫలంగా మళ్లీ ఆయననే టీటీడీ చైర్మన్‌గా కొనసాగించారు.

ఎన్నికల నేపథ్యంలో బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్‌, అందులో భాగంగా యాదవులకు.. టీటీడీ చైర్మన్‌ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ బీసీ జనాభాలో యాదవుల సంఖ్య అధికం. విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా వంటి జిల్లాల్లో యాదవుల ప్రభావం ఎక్కువ. ఇప్పటిదాకా టీటీడీ చైర్మన్‌ పదవిని.. బీసీలకు ఇవ్వలేదన్న విమర్శలకు తెరదించేందుకే, సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాము యాదవులకు చైర్మన్‌ పదవి ఇచ్చామని, టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ గుర్తు చేస్తున్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని.. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి, టీటీడీ చైర్మన్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు గత కొద్దిరోజుల నుంచి, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా కొత్త చైర్మన్‌ ఎవరన్న అంశంపై, జనవరి 3,4 తేదీల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply