– కలెక్టర్లకు ప్రయివేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం
– రెవెన్యూ సమస్యల పరిష్కారాని జేసీలు అధిక సమయమివ్వాలి
– ప్రతి రోజూ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించాలి
– కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రీ సర్వే 2.0ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని, అయితే రెండు లక్షల వరకు ఉన్న జాయింట్ ఎల్సీఎంలను సబ్ డివిజన్ చేయించుకునేలా రైతులను, భూయజమానులను చైతన్య వంతులను చేయాలని కలెక్టర్లను కోరారు. బుధవారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వాగతోపన్యాసం చేశారు.
ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా వస్తున్న ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని అన్నారు. ఫిర్యాదులు ఒక్క సోమవారం రోజు మాత్రమే సేకరించే విధంగా కాకుండా ప్రతిరోజూ ప్రజల నుండి తీసుకునేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని, వారు ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పారు. భూముల రీ క్లాసిఫికేషన్ పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఇటీవల కాలంలో రెవన్యూ వ్యవస్థలో చాలా సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగితే కలెక్టర్లకు వాటిని రద్దు చేసే అధికారం ఇచ్చామని, ప్రయివేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్ద చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఇస్తూ త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంపుదల కోసం వివిధ కంపెనీలకు, ప్రాజెక్టులకు ఇచ్చిన భూముల వినియోగం ఎలాఉందో కలెక్టర్లంతా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గత 18 నెలల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ఒక చరిత్ర అని, అది కూటమి ప్రభుత్వం సమిష్టి నాయకత్వంతోనే సాధ్యమైందని అన్నారు.
ఈ పెట్టుబడులను వెనువెంటనే గ్రౌండ్ చేయించి మన యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు అందరూ ఒక టీమ్ గా కష్టపడాల్సి ఉందన్నారు. ప్రతీ ఇంటికీ సంపద, సంక్షేమం చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలంతా ప్రభుత్వం అంటే కలెక్టర్లే అనుకుంటారని, అందుకే అత్యంత జాగ్రత్తగా పాలన అందించాలన్నారు. కొందరు నేతలు దొంగతనాల్ని కూడా సమర్థిస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.