Suryaa.co.in

Telangana

ఇంటింటికీ అయోధ్య రాముల వారి అక్షింతల పంపిణీ

– జనవరి 1 నుంచి 15 వరకు “జన సంపర్క అభియాన్”

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగి తీరాలనే హిందువుల ఆకాంక్ష సిద్ధించింది. రామ మందిర నిర్మాణమే హిందువుల స్వాభిమాన సంకేతం. 2024, జనవరి 22న అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో జనసంపర్క అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు పండరీనాథ్ , జనసంపర్క అభియాన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రాజేశ్వర్ రెడ్డి , కో కన్వీనర్ జగదీశ్వర్ , విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్ , శ్రీ నరసింహమూర్తి , రాష్ట్ర సహకార్యదర్శి శశిధర్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి , బజరంగ్దళ్ స్టేట్ కన్వీనర్ శివ రాములు తెలిపారు.

భాగ్యనగరంలోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనవరి ఒకటి 2024 నుంచి 15వ తేదీ వరకు (15 రోజులపాటు) జనసంపర్క అభియాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలు, రాములవారి చిత్రపటం, మందిరం నమూనా కరపత్రం, ప్రతి ఇంటికి అందజేసేందుకు సర్వం సిద్ధం చేశామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువును ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యం చేసేందుకు వ్యవస్థ తయారైందని చెప్పారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె.. తండా ..గ్రామము.. పట్టణము.. నగరము.. మహానగరాల్లో సైతం అక్షింతలు పంపిణీ చేసి అయోధ్య రామ మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జయ రామ నామ సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం, హారతి ఇచ్చి, దేవి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేయాలని హిందూ బంధువులకు వారు పిలుపునిచ్చారు.

జనవరి 22న మధ్యాహ్నం 12 :30 నిమిషాలకు అయోధ్యలో జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని దూరదర్శన్ ద్వారా టీవీ లైవ్ లలో అందరూ వీక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సాయంత్రం పంచభూతాలను ఆహ్వానిస్తూ కనీసం ఐదు దీపాలను వెలిగించి ప్రతి ఇంటిలో దీపావళి చేసుకోవాలని సూచించారు. ఆభాల గోపాలం ఈ మహా యజ్ఞంలో పాల్గొనాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తుంది అని తెలిపారు.

LEAVE A RESPONSE