– బీఆర్ఎస్ సర్కారులో స్కామేశ్వరంగా మారింది
– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్
మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ వంగడం, పిల్లర్లు పగలడం, అన్నారం బ్యారేజీలో సిపేజ్ లు ఏర్పడడం, ప్రాజెక్టు డిజైన్ లోపాలు.. వీటన్నింటికి, జరిగిన నష్టాలకు బాధ్యులెవరు? కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరం కాదు.. గుదిబండ. కాళేశ్వరం.. గత బీఆర్ఎస్ సర్కారులో స్కామేశ్వరంగా మారింది. నిర్వహణ భారంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
ఈ ప్రాజెక్ట్ తో ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, మేడిగడ్డ బ్యారే జీలోని పిల్లర్లు కూలడం అవినీతికి నిదర్శనం. తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయపడిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లోపాలను దాచిపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా నాణ్యతాలోపం, నిర్వహణాలోపంతో జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను ప్రపంచం యావత్ చూసింది.
మేడిగడ్డ పిల్లర్స్ కుంగిపోవడానికి ప్రాథమికంగా 4 కారణాలున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తేల్చింది. ‘ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో వైఫల్యంతో బ్యారేజి పునాది కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల పియర్స్ సపోర్టు బలహీనపడింది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్ఠత, సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజి లోడ్‌వల్ల ఎగువన ఉన్న కట్ ఆఫ్ వాల్ సీకెంట్ ఫైల్స్ వైఫల్యం చెందింది. వీటన్నింటిని పరిశీలిస్తే ప్లానింగ్ చేసినట్లుగా డిజైన్ లేకపోవడం, డిజైన్ చేసినట్లు నిర్మాణం జరగలేదు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో డ్యామ్ సేఫ్టీ చట్టంలోని అనేక నిబంధనలను అధికారులు ఉల్లంఘించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైంది.. అపూర్వమైందని, కేసీఆర్ ను మించిన ఇంజినీర్ ఎవరూ లేరని,.. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదు.. కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని రాగాలు తీశారు. ఒకానొక దశలో అది పర్యాటక ప్రాంతంగా కీర్తించే స్థాయికి వెళ్లారు బీఆర్ఎస్ నాయకులు. మరి ఇప్పుడు ఏం చెబుతారు? కాళేశ్వరం బీఅర్ఎస్ హాయంలో స్కామేశ్వరంగ మారిపొయింది.. కాళేశ్వరం నిర్మాణంలో అనేక తప్పిదాలు, పొరపాట్లు జరిగాయి. కాళేశ్వరం ఉదంతంలో గత రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి సమాచారాన్ని అందించమని అడిగితే అందించలేదు.. కాళేశ్వరం వైఫల్యానికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలే.
23 అంశాల్లో జవాబు చెప్పమని డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగితే, బీఆర్ఎస్ కేవలం 11 అంశాలకు మాత్రమే జవాబులు చెప్పి తప్పించుకుంది. కాళేశ్వరం ఉదంతాన్ని కాంగ్రెస్ పార్టీ చిన్నదిగా చూపించడానికి ప్రయత్నం చేస్తోంది. నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా సంపద దోపిడీ జరిగిందని అన్నారు. మరి ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు? సీబీఐ ప్రస్తావన ఎందుకు తీసుకురాడం లేదు? అఖిలపక్షంతో కలిసి వెళ్తామన్న కాంగ్రెస్.. ఇఫ్పుడు తమ వరకే ఎందుకు పరిమితం చేస్తోంది?
2019లో బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి నిర్వాహకులు సిమెంట్ కాంక్రీటు దిమ్మెలను, లాంచింగ్ అప్రాన్‌లను సరిగా పరిశీలించలేదు. మెయింటెనెన్స్ చేపట్టలేదు. కాళేశ్వరంపై ఎందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఘటనలో ఏ ఒక్కరిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది..? కాంగ్రెస్ మంత్రులు కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కూనిరాగాలు తీస్తున్నారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
గుంపుగా మంత్రులు వెళ్లి, గుప్పెడు మట్టిని తీసుకొచ్చినట్టుగా ఉంది కాంగ్రెస్ మంత్రుల వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 రోజుల పాలన ముగించుకుంది. అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. మరి ఎందుకు ఇప్పుడు కాలయాపన చేస్తోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్, ఇతర అధికారుల నిర్లక్ష్యం మరో కారణం.. దీనిపై విచారణకు ఆదేశించాల్సిందిపోయి.. దీనంతటికి బాధ్యులైన అధికారుల ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకే పరిమితమయ్యారు.
కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు కలిసి ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టేందుకు చూస్తున్నాయి.. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోంది.. కాళేశ్వరం అంశాన్ని చిన్నదిగా చూపేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో ఎపిసోడ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలి..లేదంటే కాంగ్రెస్ ను కూడా ప్రజలు దోషిగా నిలబెడతారు.