– ఎంపీ విజయసాయి రెడ్డి
అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై పరిష్కారం దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన విభజన సమస్యలపై సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పాటు ఆయా అంశాలకు చెందిన కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు కూడా పాల్గొంటారని చెప్పారు. ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలపై తన వాణిని గట్టిగా వినిపించిందని అన్నారు. సమావేశంలో పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, గ్రాంటు, రెవెన్యూ లోటు, ఇరు రాష్ట్రాలకు సంస్థలు విభజన, బ్యాంకు బ్యాలెన్సుల పంపిణీ మెదలగు అంశాలు చర్చించనున్నట్లు తెలిపారు.
మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల ముంగిటకు పాలన మరింత చేరువ చేసే సంకల్పంతో రాష్ట్రంలో దాదాపు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారని అన్నారు. నిజమైన వికేంద్రీకరణ అంటే ఇదేనని అన్నారు.