-రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిన 1.70 లక్షల కోట్ల పెట్టుబడులు
-ఎంపీ రఘురామకృష్ణం రాజు
మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి అమర్నాథ్, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, టూరిజం శాఖ మంత్రి రోజా డాన్సులు వేస్తున్న ఫోటోలను ప్రదర్శించిన ఆయన, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి రికార్డింగ్ డాన్స్ చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వెల్లువెత్తుతాయా? అంటూ నిలదీశారు. పారిశ్రామికవేత్తలు కలిసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరికి సమయం ఇవ్వరని, ఎవరైనా పారిశ్రామికవేత్తలు కలవాలనుకుంటే ఆయన ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి వారికి ఎప్పుడు సమయం ఇస్తారో తెలియని అస్తవ్యస్త పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి 1.70 లక్షల కోట్ల రూపాయలతో కుదుర్చుకున్న పరిశ్రమల ఒప్పందాలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల కబుర్లు కోట్లు దాటిపోతున్నప్పటికీ, రాష్ట్రానికి మాత్రం పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదన్నారు. చివరకు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులతో, పదివేల మందికి ఉపాధి కల్పించే అమర్ రాజా బ్యాటరీ సంస్థ కూడా పొరుగు రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయిందని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
రాయలసీమకు దారుణమైన అన్యాయం జరిగిందని, పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులతో, పదివేల మందికి ఉపాధి కల్పించే దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన అమర్ రాజా బ్యాటరీ రాష్ట్రం నుంచి తరలిపోయిందన్నారు. పనికిమాలిన పాలకుల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. పెద్దలు వాటాలు అడిగి, వేధించి కేసులను పెట్టించడం వల్లే అమర్ రాజా బ్యాటరీ సంస్థ తమ పెట్టుబడులకు అనువైన రాష్ట్రాన్ని ఎంచుకుందన్నారు. సిమెంటు పరిశ్రమతో పోలిస్తే, ఇతర పరిశ్రమలలో అంత కాలుష్యం ఉండదన్న రఘురామకృష్ణంరాజు, పాలకుల ఆలోచన ధోరణి వల్లే పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలి వెళ్తున్నాయని విమర్శించారు.
పదివేల కోట్ల పెట్టుబడులు వద్దు… 40 కోట్ల రూపాయల భవనం కావాలా?
పదివేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే పరిశ్రమ వద్దని, 40 కోట్ల రూపాయల నిర్మించే కోర్టు భవనం కావాలని రాయలసీమ ప్రజలు అడుగుతున్నారా ? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు అంత తెలివితక్కువవారా?? అంటూ నిలదీశారు. కోర్టు భవనం… బయట నాలుగు టీ కొట్టులు, మూడు, నాలుగు క్యాంటీన్లు, ఐదు, ఆరు జిరాక్స్ మిషన్లు కావాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ మండిపడ్డారు . సీమలో పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు. రాయలసీమ రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం లేదన్నారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుప్రీంకోర్టులో మాజీ అటార్నీ జనరల్ చేత, కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని చెప్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఒక మాట, రాష్ట్రానికి వచ్చేసరికి మరొక మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ అటార్నీ జనరల్ చేత సుప్రీంకోర్టులో తప్పుడు మాటలు చెప్పిస్తే, పోయేది రాష్ట్ర ప్రజల పరువేనని అన్నారు. కర్నూలు గర్జనకు హాజరయ్యే ప్రజలు… అమర్ రాజా బ్యాటరీని వెనక్కి తీసుకురావాలని గర్జించాలని సూచించారు. అలాగే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయాలని, రాయలసీమ రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ సరఫరా చేయాలని కోరాలన్నారు. కర్నూలు గర్జనలో ఈ నాయకులకు చెప్పే దొంగ మాటలు విని మోసపోవద్దని… సమగ్ర రాష్ట్ర అభివృద్ధి ని కోరుకునే వ్యక్తిగా కోరుతున్నానన్నారు.
ఏమిటి వేలం వెర్రి…!
కడప స్టీల్ ప్లాంట్ ను అధికారంలోకి వచ్చిన ఆరునెలల తరువాత పునాది వేసి 36 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటివరకు కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేకపోయారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. విశ్వసనీయత ఉన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని, విశ్వసనీయత లేని వ్యక్తులు తమ అధికారం చివరి ఆరు నెలలలో శంకుస్థాపనలు చేస్తారంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అవున్న ఇప్పటివరకు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదు అని ప్రశ్నించారు. పులివెందులకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ రివర్ వ్యూ హోటల్ ను ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో చేపల కొట్టు ప్రారంభించిన జగన్, ఇప్పుడు హోటల్ ను ప్రారంభించారంటూ అపహాస్యం చేశారు. వైయస్సార్ పేరిట హోటళ్లు, చేపల కొట్టులు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించిన ఆయన, ప్రతి ఊరిలో పార్కు వైయస్సార్ పేరు పెట్టడం… విడ్డూరంగా ఉందన్నారు. చివరకు కొబ్బరి చెట్టుకు వేప చెట్టుకు కూడా వైయస్సార్ కొబ్బరి చెట్టు వైఎస్సార్ వేపచెట్టు అని పేరు పెడతారేమోనని అపహస్యం చేశారు. ఈ వేలం వె ర్రి ని జనాలు హర్షించరన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మహా నాయకుడు అని, ఆయన మిత్రుడిగా వైయస్సార్ పేరును పాడు చేయవద్దని కోరుతున్నానన్నారు .
లిక్కర్ స్కామ్ లో విజయసాయికి నోటీసులు ఇచ్చే ఛాన్స్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డికి తనకున్న సమాచారం మేరకు… నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . లిక్కర్ డొంక కదిలినప్పటి నుంచి నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా తమ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నదని గుర్తు చేశారు. విజయ సాయి తన ఫోన్ పోయిందని పోలీసుల ఫిర్యాదు చేయడం, దాన్ని వెతకవద్దని సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో అధికార పార్టీలో ఉన్న నాయకులను, ఆంధ్రాలో ని వ్యాపారులను ఈ కుంభకోణంలోకి బలవంతంగా లాగింది విజయ సాయి రెడ్డి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ధ్వంసమైన ఫోన్లన్నింటికీ, విజయ సాయి పోయినట్టు చెప్తున్నా ఫోనే “కీ ” ఫోన్ అని తెలుస్తుందన్నారు.
సిఐడి విధివిధానాలు ఇవి…
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ( సి ఐ డి ) విధి విధానాల గురించి ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ మ్యానువల్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో సిఐడి పోలీసులు అవేమీ పట్టించుకోకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాధారణ పోలీస్ స్టేషన్లో మాదిరిగా సిఐడి పోలీసులు నేరుగా ఫిర్యాదు స్వీకరించడానికి వీలు లేదన్నారు. సిఐడి పోలీసులు కేసును విచారించాలి అంటే, రాష్ట్ర శాసనసభ తీర్మానించాలని, హోం సెక్రటరీ , రాష్ట్ర హైకోర్టు విచారణకు ఆదేశించవచ్చునని తెలిపారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఒక సునీల్ చెబితే, మరొక సునీల్ కేసు నమోదు చేసి… విజయ్ పాల్ తో కలసి అమాయకులను ఎత్తుకొచ్చి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయుడు అంకబాబు విషయంలోనూ ఇదే జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక బుల్లి అధికారి, సిఐడి అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయగా… కేసును స్వీకరించిన సిఐడి అధికారులు, ఇంట్లో ఉన్న అంకబాబును ఎత్తుకు వచ్చారని అన్నారు . అంకబాబును కోర్టులో హాజరుపరచగా, 41 ఏ కింద ఆయన కు నోటీసులు ఎందుకు
జారీ చేయలేదని మెజిస్ట్రేట్ ప్రశ్నించారని గుర్తు చేశారు. నోటీసులు ఇస్తే అంకబాబు తీసుకోలేదని, అందుకే అరెస్టు చేశామని దుర్మార్గులైన సిఐడి పోలీసులు చెప్పారన్నారు. ఎవరైనా నోటీసులు తీసుకొని ఇంట్లో ఉండకుండా, తమను అరెస్టు చేయమని అంటారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
అర్నేష్ కుమార్ తీర్పు స్పష్టంగా ఉందన్న ఆయన, తమను అక్రమంగా అరెస్టు చేసిన వారిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చునని సూచించారు. ఒకవేళ మెజిస్ట్రేట్ కూడా రిమాండ్ కు ఆదేశిస్తే వారిపై కూడా హైకోర్టుకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు . సిఐడి పోలీసులు, సాధారణ పోలీసులు 41 ఏ నోటీసు ఇవ్వకుండా, అరెస్టు చేస్తే వారిపై అర్నేష్ కుమార్ తీర్పును అనుసరించి కోర్టు ధిక్కారణ కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చునని రఘురామరాజు పునరుద్గాటించారు. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం అనుమతించాలని, ప్రస్తుత ప్రభుత్వం అనుమతించదని తెలుసునని అన్నారు. కానీ, ప్రభుత్వం మారాక తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. అయితే, దానికి ఇప్పుడు వారిపై కోర్టులలో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.
అంకబాబుపై 153 A కింద కేసు నమోదు చేశారన్న ఆయన, గతంలో తనపై కూడా ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేశారని తెలిపారు. ఐపీసీ 153A సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అంటే, రెండు వర్గాలు, మతాలు, కులాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టడం… అటువంటి వ్యక్తులపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. అంకబాబు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ ను మరొక వాట్సాప్ గ్రూప్ లోకి పంపించి తొలగించారన్నారు. అంతమాత్రాన రెండు వర్గాలు, కులాలు, మతాల మధ్య ఘర్షణ జరిగిందా? అని ప్రశ్నించారు.
బాబు పర్యటనకు ఇసుక వేస్తే రాలనంత జనం
పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనకు జనం ఇసుక వేస్తే రాలనంతగా హాజరయ్యారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కర్నూలు జిల్లాలో కంటే, పశ్చిమగోదావరి జిల్లాలో జన ప్రభంజనం కొనసాగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యునిగా ప్రధాన ప్రతిపక్ష నేత సభలకు హాజరైతున్న ప్రజలను చూస్తే బాధనిపిస్తున్నప్పటికీ, ఎలాగో తాను ఈ పార్టీ నుంచి పోటీ చేసేది లేదని ఆనందం వేస్తుందన్నారు. తనని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేయగా , ఒక అధికారి ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించారని , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వీడియోని చూసి ఆనందించిన్నట్లుగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని, అది నిజమేనని చెప్పారు. అందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలలో ఇప్పుడిప్పుడే రియలైజేషన్ వస్తుందని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సభలకు హాజరైన దానికంటే, పదింతల ఎక్కువ జనం ప్రస్తుతం హాజరయ్యారన్నారు. మీరు మంచివారని… మేము ఒకరిని నమ్మి మోసపోయామంటూ ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని, అందుకే ఈ జన ప్రభంజనం అని అన్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాలలోను చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్లు తెలుస్తోందని, అక్కడ సభ లకు ఇంతకంటే ఎక్కువ జనం హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తాను తన నియోజకవర్గానికి వెళ్లలేనందుకు బాధగానే ఉందని, వెళ్లడానికి ప్రయత్నించిన ప్రతిసారి తనపై రెండేసి మూడేసి అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. అందుకే తాను అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఇళ్లల్లో కనిపిస్తూ… ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నానని తెలిపారు. ఈ విషయాన్ని తన నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.